దేశ చరిత్రలో ఇదే ప్రథమం

by Shamantha N |   ( Updated:2020-03-21 22:53:17.0  )
దేశ చరిత్రలో ఇదే ప్రథమం
X

దేశ చరిత్రలోనే తొట్ట తొలిసారి జనతా కర్ఫ్యూ దిగ్విజయ వంతంగా కొనసాగుతోంది. యావద్భారత దేశపు రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయి. భారతీయులంతా తొలిసారి మూకుమ్మడిగా ఇళ్లకు పరిమితమయ్యారు. ఎవరిళ్లలో వారు తమకు తాముగా స్వచ్ఛందంగా నిర్బంధించుకున్నారు. దేశ సమైకత్యను చాటే సరికొత్త సంప్రదాయాన్ని మూకుమ్మడిగా ముందుకు తెచ్చారు.

విపత్కర పరిస్థితులు, ఆపత్కాలంలో ప్రభుత్వాలు కర్ఫ్యూ విధించడం, విధిలేని పరిస్థితుల్లో ప్రజలు వాటిని కొనసాగించడం సాధారణంగా జరుగుతుంది. విపత్కర పరిస్థితుల్లో అవగాహన, అనుమానంతో భారత దేశ చరిత్రలో తొలి సారిగా జనతా కర్ఫ్యూ జరుగుతోంది. ఇందు కోసం దేశం యావత్తూ సంసిద్ధమైంది. ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు పల్లెల్లోని పంచాయతీల్లో దండోరా వేయించారు. దీంతో పల్లెవాసులెవ్వరూ బయటకు రావడం లేదు.

మరోవైపు జిల్లా, మండల కేంద్రాల్లో మున్సిపల్, వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా మీడియా గత నెల రోజులుగా చైతన్యవంతంగా పని చేసింది. ప్రపంచ దేశాల్లో కరోనా ఎలా విస్తరిస్తోంది. ఆయాదేశాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఏంటి? ఆయా దేశాల్లోని భారతీయులు స్థితిగతులేంటి? కరోనాపై అవగాహన ఎంత ఉండాలి? ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా దేశంలో ఎలా ఉంది? వంటి వివరాలతో బులిటెన్లపై బులిటెన్ల కొద్దీ వార్తలు ప్రసారం చేయడంతో ప్రజల్లో అవగాహన పెరిగింది.

దీంతో ప్రజా కర్ఫ్యూ ఆవశ్యకత అందరికీ తెలిసి వచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి స్వచ్ఛంద బంద్‌ అవసరమని దేశ ప్రజలంతా గుర్తించారు. దీంతో ఎవరిళ్లకు వారు పరిమితమయ్యారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన నెలకొంటుంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు కూడా భయాందోళనలకు కారణమవుతుంది. అయితే కరోనాపై పోరాటంలో అన్ని రంగాలు ఏకతాటిపై నిలవడంతో దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగనుంది. నేటి తెల్లవారుజామున నుంచి 29 వరకు అంతర్జాతీయ విమానాలన్నీ నిలిపివేశారు. విదేశాల్లో టేకాఫ్‌ తీసుకునే విమానాలకు ల్యాండింగ్‌ లేదని డీజీసీఏ స్పష్టం చేసింది.

Tags: janatha curfew, india, people curfew,

Advertisement

Next Story

Most Viewed