సింగూరులో మళ్లీ ఆశలు మొలకెత్తినయి

by Shyam |   ( Updated:2020-08-14 00:00:03.0  )
సింగూరులో మళ్లీ ఆశలు మొలకెత్తినయి
X

దిశ, అందోల్ : సింగూరు ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పది రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రెండువారాల్లోనే 2 టీఎంసీలకు పైగా నీరు ప్రాజెక్టులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మాదిరిగా ప్రాజెక్టు నిండితే దాని కింద సాగయ్యే పంటలకు ఇబ్బందులు ఉండవని రైతులు అభిప్రాయపడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, పది రోజుల క్రితం ప్రాజెక్టులో 0.676 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. కానీ వరదల కారణంగా రెండు టీఎంసీల నీరు రెండువారల్లోనే చేరడంతో ప్రాజెక్టులో ప్రస్తుతం 2.179 టీఎంసీల నీరు నిల్వ ఉంది

59 కిలో మీటర్ల కాల్వ..

సింగూర్ ప్రాజెక్టు నీటిని సాగుకు అందించాలన్న లక్ష్యంతో 2006‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వ పనుల కోసం రూ.89.90 కోట్లను మంజూరు చేసింది. నాటి ఎమ్మెల్యే దామోదర్ రాజనర్సింహ చొరవతో కాల్వల నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో అందోల్, పుల్కల్ మండలాలోని 37,500 ఎకరాలకు గానూ ప్రధాన ఎడమ కాలువ 24 కిలో మీటర్లు, ఉప ప్రధాన కాలువ 23 కిలో మీటర్లు… సదాశివ‌పేట్, మునిపల్లి మండలాల్లో 2500 ఎకరాలకు గానూ పన్నెండున్నర కిలో మీటర్ల కుడి కాలువను తీశారు. 2016‌లో కాలువల పనులు పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించి నీటిని వదిలారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక మరో రూ.30 కోట్లను విడతల వారిగా కేటాయించింది. ఆయా మండలాలోని 126 చెరువులను కాలువల ద్వారా నింపడం‌తో మరో 8 వేల ఏకరాలకు సాగు నీరు అందుతున్నది.

రెండేండ్లుగా తప్పని సాగు కష్టాలు

రెండుండ్లుగా ప్రాజెక్టు కింద సాగువుతున్న పంటలకు కష్టకాలమే ఎదురవుతున్నది. ప్రాజెక్టులోని నీటిని 2018లో ప్రభుత్వం అనధికారికంగా 15 టీఎంసీల నీటిని కిందకు వదిలింది. దీంతో అప్పటి నుంచి ఈ ప్రాంత రైతులకు సాగు కష్టాలు తప్పలేదు. అందోల్, పుల్కల్, సదాశివపేట, మునిపల్లి మండలాల్లో 126 చెరువులు, 48 వేల ఎకరాల సాగుతో పాటు, ప్రతి ఏడాది 4 టీఎంసీలు ఘనపూర్, 8 టీఎంసీల నీటిని నిజాం‌సాగర్‌కు నీటిని వదిలారు. కానీ రెండేండ్లలో ఘనపూర్‌కు 2 టీఎంసీల నీటిని మాత్రమే వదిలారు.

సాగు నామమాత్రమే..

రెండేండ్లుగా ప్రాజెక్టులోకి నీరు రాకపోవడంతో సింగూర్‌పై ఆధారపడిన రైతులు నామమాత్రంగానే పంటలను సాగు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీటి తాకిడి పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో తాగునీటికి డోకా లేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వరద నీరు మరింత వచ్చి చేరితేనే సాగుకు నీటిని వదిలే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Next Story