- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.10వేలు అందరికీ అందేనా?
దిశ, తెలంగాణ బ్యూరో : విశ్వనగరం అంటూ ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా ఇటీవల వరదలు అధికార పార్టీకి తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దాని నుంచి సర్దుకోవడానికి ప్రతీ బాధిత కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున నగదు రూపంలోనే ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశించింది. కానీ క్షేత్రస్థాయిలోని పరిస్థితులు మాత్రం అలాంటి ఆశలను పటాపంచలు చేశాయి. నగదు సాయం అందుకోలేకపోయిన వారంతా ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. వ్రతం చెడ్డా ఫలం.. చందంగా ప్రభుత్వం నుంచి సుమారు రూ.553 కోట్లు విడుదలైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ మేరకు ఫలితం ఇస్తుందనేది అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన లోకల్ కేడర్, లీడర్లలో మాత్రం పదివేలు పనిచేస్తుందన్న నమ్మకం లేకుండా పోయింది.
పది వేల రూపాయలు అందుకున్నవారిలో ఒక మేరకు తృప్తి ఉన్నా స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతల జోక్యం నిరాశకు గురిచేసింది. వరదలకు నష్టపోయినదాంట్లో ఇది కంటితుడుపు మాత్రమేనన్న అసంతృప్తి కూడా తీవ్రంగానే ఉంది. ప్రభుత్వం ఇస్తున్నది ప్రజల సొమ్మే అయినా దానికి పార్టీ రంగు పులమడంతో ఎన్నో విమర్శలను టీఆర్ఎస్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. నిజమైన బాధితులమే అయినా తమకు సాయం అందలేదంటూ వేలాది మంది జీహెచ్ఎంసీ కార్యాలయాల ముందు ధర్నా చేశారు. అధికార పార్టీ నేతల ఇళ్ళను ముట్టడించారు. చివరకు అందరికీ అందేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటన ఇవ్వకతప్పలేదు. ఇప్పుడు ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తు చేసుకుంటే పరిశీలన అనంతరం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కష్టకాలంలో పది వేల రూపాయలను నగదు రూపంలో అందుకున్నవారు ప్రభుత్వానికి విశ్వాసంగా ఉంటారని, అది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో తిరిగి వస్తుందని టీఆర్ఎస్ కొండంత నమ్మకంతో ఉంది. కొన్ని చోట్ల వరదలు రాకపోయినా బాధిత కుటుంబాల పేరుతో స్థానిక టీఆర్ఎస్ నేతలు జేబుల్లో నింపుకోవడాన్ని కళ్ళారా చూసిన ప్రజలు ఇప్పుడు ఓట్ల సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ సెంటిమెంట్ ప్రధాన ప్రచారాస్త్రంగా ఉన్న సమయంలో 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 స్థానాల్లో గెలుపొందింది. ఈ ఐదేళ్ళ కాలంలో సుమారు రూ.67 వేల కోట్లు అభివృద్ధి కోసం ఖర్చు చేసి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని మంత్రి కేటీఆర్ ఒకింత గర్వంగానే అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. కానీ ఒక్క రోజు కురిసిన వర్షానికి వందలాది కాలనీలు ముంపునకు గురయ్యాయి. వేలాది మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. లక్షలాది మంది ఇంట్లో సామాను నీటిలో తడిచిపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. ప్రతి బాధిత కుటుంబానికి రూ.పదివేల చొప్పున మొత్తం రూ. 553 కోట్లను అందించేలా ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సుమారు ఐదున్నర లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇంత ఖర్చు చేసినా అధికార పార్టీకి ఎన్నికల్లో ఏ మేరకు ఓట్లు రాలుతాయన్నది ఆసక్తికరంగా మారింది. గతంకంటే సీట్లు పెరుగుతాయా తగ్గుతాయా? కనీసం గతంలో వచ్చిన సీట్లనైనా నిలబెట్టుకోగలుగుతామా అని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది.