పోలవరంతో పాటు ఐదు ప్రాజెక్టులు ఈ ఏడాదే ప్రారంభం కావాలి: జగన్

by srinivas |
పోలవరంతో పాటు ఐదు ప్రాజెక్టులు ఈ ఏడాదే ప్రారంభం కావాలి: జగన్
X

పోలవరం ప్రాజెక్టుతో పాటు అవుకు టన్నెల్-2, వెలిగొండ, నెల్లూరు బ్యారేజ్, సంగం బ్యారేజ్, వంశధార-నాగావళి ప్రాజెక్టులు ఈ ఏడాదే పూర్తై ప్రారంభోత్సవం జరగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా సిమెంట్, స్టీల్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎం కు వివరించారు. మ్యాన్ పవర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పనులకు బ్రేక్ పడిందని, దీంతో నెల రోజులకు పైగా సమయం వృథా అయిందని వారు ఆయనకు చెప్పారు. ఈ నెల 20 నుంచి పరిస్థితులు కొంత మేరకు మెరుగుపడటంతో, ఇప్పుడిప్పుడే, సిమెంట్, స్టీల్ సరఫరా మొదలువుతున్నాయని అన్నారు. దీంతో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పారు.

సిమెంట్, స్టీల్ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఈ సందర్భంగా సీఎంను కోరారు. దీంతో పోలవరం స్పిల్ వే పనులు జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి సూక్ష్మ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు సీఎం సూచించారు. 2020లోనే పోలవరం తోపాటు ఈ ఐదు ప్రాజెక్టులు ప్రారంభం కావాలని, ఈ నేపథ్యంలో పనుల పురోగతి ఉండాలని జగన్ వారికి దిశానిర్దేశం చేశారు.

Tags: ysrcp, ys jagan, ap, polavaram project, video conference

Advertisement

Next Story