శ్రీశైలం ప్రమాదంపై బోలెడు అనుమానాలు..

by Shyam |   ( Updated:2020-08-27 03:31:29.0  )
శ్రీశైలం ప్రమాదంపై బోలెడు అనుమానాలు..
X

దిశ, అచ్చంపేట :

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్​ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ నెల 20న నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంటలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది ఉద్యోగులు ప్రాణాలు పోగొట్టుకోగా, కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదానికి కారణం మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపామా అని తేల్చే పనిలో బృందాలు నిమగ్నమయ్యాయి. సీఐడీ అధికారులు, జెన్కో శాఖాపరమైన నిపుణులు, పోలీసు శాఖ వారు వేర్వేరుగా విచారణ చేపట్టారు. కాగా, ఇప్పటికే సీఐడీ మాత్రం షార్ట్ సర్క్యూట్, సాంకేతిక లోపం ఎంత వరకు ప్రమాదానికి కారణమనే విషయంలో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ రోజే బ్యాటరీలు ఎందుకు మార్చినట్టు?

ఎడమగట్టు విద్యుత్​ కేంద్రంలో రెండు సంవత్సరాల కిందట బ్యాటరీలు మార్చాల్సి ఉందని ఉద్యోగులు జెన్కో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పోస్టులు సోషల్​మీడియాలో వైరల్​ అవుతున్నాయి. దేశంలోనే అతి ప్రధాన హైడల్​ ప్రాజెక్టులో అధికారులు అంత నిర్లక్ష్యం ఎందుకు ప్రదర్శించారో తెలియడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

పైగా, ప్రాజెక్ట్​ సీఈ అధికారి సెలవులో ఉండడం, ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే మరో సీఈ తన బృందంతో ఉన్న సమయంలో బ్యాటరీలను మార్చడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేయడం వెనక ఎవరి ఒత్తిళ్లైనా ఉన్నాయా.. ? అనే గుసగుసలు వినవస్తున్నాయి. పైగా తక్షణమే బ్యాటరీలు మార్పించి రూ.20 లక్షల బిల్లులను అక్రమంగా కాజేసేందుకు ఎవరైనా ప్రయత్నించారా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది.

ఉద్యోగుల మృతికి కారకులు ఎవరు?

జలవిద్యుత్ కేంద్రంలో 20న జరిగిన అగ్నిప్రమాదంలో విధుల్లో ఉన్న తొమ్మిది మంది ఉద్యోగులు మరణించడానికి కారకులెవరు..? కోట్లాది రూపాయల ప్రజాధనం బుగ్గిపాలు కావడం వెనక అసలు సూత్రధారి ఎవరనేది తేల్చాలని నిపుణులు డిమాండ్​ చేస్తున్నారు. కేవలం సీఐడీ దర్యాప్తు కాకుండా ప్రత్యేక బృందంతో న్యాయ విచారణ చేయిస్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని వారు అంటున్నారు. ఇదిలా ఉండగా, మంగళవారం జెన్కో సీఎండీ స్థాయి అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed