- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ‘సామాన్యుడి’ ఫెడరల్ ఫ్రంట్..
దేశంలో రాబోయేది ఫెడరల్ ప్రభుత్వమేననీ, దీన్ని ఎవరూ ఆపలేరని, తనకున్న అనుభవంతోనే ఈ విషయం చెప్తున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ కొద్ది రోజుల కిందట చెప్పారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వంద శాతం వెళ్తానని ఆయన తెలిపారు. అంతేగాకుండా ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపు గురించి జోస్యం చెప్పారు. అది నిజం అయింది. నిన్ననే ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ గురించి ఆప్, టీఆర్ఎస్ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఫ్రంట్ సారథి ఎవరు..?
దేశంలో ఇప్పటికే ఉన్న ఫ్రంట్‌లు రెండు. ఒకటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, మరొకటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ. ఈ రెండు ఫ్రంట్‌లకు నేతలు ఉన్నారు. బీజేపీకయితే 2024 ఎన్నికల్లోనూ మోదీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కాంగ్రెస్‌కు ప్రధాన అభ్యర్థి ఎవరనే దానిపై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలున్న మాట వాస్తవం. రాహుల్ గాంధీని అభ్యర్థిగా ప్రకటించకముందే మిత్రపక్షాల నుంచే అభ్యంతరాలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫ్రంట్‌లకు భిన్నంగా మరో ఫ్రంట్ వచ్చే అవకాశాలున్నాయా.. అనే అంశాన్ని పరిశీలిద్దాం..
2018 ముందస్తు ఎన్నికల సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్తావించిన కేసీఆర్ ఆ తర్వాత మళ్లా మొన్ననే ఫ్రంట్ ముచ్చట చెప్పారు. అప్పుడు ఎన్నికల సందర్భంలో మాట్లాడుతూ గల్లీలో ఢిల్లీ పెత్తనమేంది.. మా గల్లీకి సంబంధించిన పనులు మేమే చేసుకుంటం.. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలనీ, కొన్ని విషయాల్లో అనవసరంగా కేంద్రం జోక్యం చేసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఉంటుందని కేసీఆర్ చెప్పారు. దీంతో టీఆర్ఎస్ అనుయాయులు, కార్యకర్తలు ‘దేశ్ కీ నేత కేసీఆర్’ అని గట్టిగా నినదించారు. కానీ, ఆ తర్వాత అంత తీవ్రంగా కేంద్రం, ఫ్రంట్ గురించి మళ్లా మాట్లాడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొన్న మున్సిపల్ ఎన్నికల విజయం సందర్భంగా ప్రెస్ మీట్‌లో ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారు. బీజేపీ వ్యతిరేక స్టాండ్ స్పష్టంగా తీసుకున్నట్టు గులాబీ బాస్ చెప్పారు. సీఏఏ వ్యతిరేక సభ, విపక్షాల సీఎంలు, కాంగ్రెస్‌ను కలుపుకుని నిరసన తెలుపుతామనీ, అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానం చేస్తామని తెలిపారు. అదే సందర్భంలో తాను సీఎంగా ఉంటాననీ, చెప్తూనే అవసరమైనపుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారు. అయితే, కేటీఆర్‌ను సీఎం చేసి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్‌లోకి వెళ్తారని పింక్ పార్టీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఆసక్తి కర చర్చ నడుస్తున్నది. దేశ రాజకీయాల పట్ల కేసీఆర్‌కు అవగాహన ఉన్న మాట వాస్తవమే కానీ, కేవలం 17 లోక్ సభ సీట్లు ఉన్న గులాబీ దళపతి కేసీఆర్‌ను ఫ్రంట్ నాయకత్వ బాధ్యత స్వీకరిస్తారా.. అందుకు మిగిలిన ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా.. అనే దానికి కాలమే సమాధానం చెబుతుందని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అయితే, కేసీఆర్ అనుకున్న ఫెడరల్ ఫ్రంట్, తృతీయ ఫ్రంట్‌లో కాంగ్రెస్‌కు స్థానముంటుందా.. అనేది కూడా తేలాలని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
‘ఆప్’కా అరవింద్..?
దేశ రాజకీయాల పట్ల అమితంగా ఆసక్తి ఉన్న మరో నేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఏకంగా ప్రధానమంత్రిపైనే పోటీ చేసిన వ్యక్తి ఆయన. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఎదుర్కొని హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ తృతీయ లేదా ఫెడరల్ ఫ్రంట్‌కు సై అంటారనే చర్చఆప్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే ఆప్ కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదనీ, పంజాబ్, హర్యానా, గోవా ఇతర రాష్ట్రాల్లో విస్తరించిందని కాబట్టి ఆప్ జాతీయ రాజకీయాలకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ప్రతిపక్ష పాత్ర, 4 ఎంపీ స్థానాలు గెలిచిన విషయం విదితమే. ఇదే క్రమంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే కేంద్రీకృతమైన రాజకీయాన్ని ‘ఆప్’ బ్రేక్ చేస్తే అరవింద్ కేజ్రీవాల్‌కు జాతీయ రాజకీయాల్లో స్థానం సుగమమం అవుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఢిల్లీలో కేవలం 7 లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల లోక్‌సభ స్థానాలు.. 65 ప్లస్ ఢిల్లీ 7 స్థానాలు మొత్తం 72లో కనీసంగా యాభై స్థానాల్లో ప్రభావితం చేసి స్వీప్ చేస్తే ప్రాంతీయ నేతలైన మమతా, స్టాలిన్, నితీశ్, కేసీఆర్, జగన్, నవీన్ పట్నాయక్‌ల కంటే ఫ్రంట్ సారథిగా సామాన్యుడైనా కేజ్రీకే అవకాశముంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. తాను చూపిన సంక్షేమ, సుపరిపాలనలే ఎజెండాగా ప్రచారం కూడా నిర్వహించొచ్చనీ, జాతీయంగా దాన్ని ఎత్తి చూపొచ్చని చెబుతున్నారు.
‘నెంబర్’ గేమ్.. నెసెస్సిటీ..
రాష్ట్ర రాజకీయాల్లోనైనా, దేశ రాజకీయాల్లోనైనా నెంబర్ గేమ్ ఇంపార్టెంట్. మ్యాజిక్ ఫిగర్ (50 పర్సెంట్ ప్లస్) ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యం. అయితే, జాతీయ పార్టీలకున్న అవకాశాలు మెండు. ఎందుకంటే అవి అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు పరిమితులు ఉన్నమాట వాస్తవం. ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడే భూమిక ఉంటే ప్రాంతీయ పార్టీలకు సారథ్యం వహించే నాయకత్వం ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఉదాహరణకు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 39 స్థానాలతో, మమతా నేతృత్వంలోని ఏఐటీఎంసీ 42 స్థానాలతో, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ 17 స్థానాలతో, జగన్ నేతృత్వంలోని వైసీపీ 25 స్థానాలతో, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ 21 స్థానాలతో కేవలం 7 సీట్లున్న ఆప్ ‘అరవింద్’ నాయకత్వాన్ని బలపర్చే అవకాశముండకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, పెద్ద రాష్ట్రాలైన బీహార్, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్కడ ప్రాంతీయ పార్టీల బలాబలాలు, ఆ తర్వాత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక పవనాలు చూడాలి. 80 లోక్ సభ స్థానాలున్న యూపీలో ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ ఏకీకరణ గతంలో విఫలమైంది. వాటి సర్దుబాటు ఎలా ఉండాలి. వాటి పునరేకీకరణకు ఎవరు చొరవ చూపాలి. గెలుపు ఎవరికి సాధ్యం. వీటన్నింటిని బట్టి ప్రాంతీయ పార్టీల నేతలు ఫ్రంట్ కూడగట్టేందుకు చొరవ చూపి, కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రాతిపదికన ప్రయత్నాలు చేస్తే 2024లో ఫెడరల్ లేదా తృతీయ ఫ్రంట్ ఏర్పడొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.