తండ్రి బీజేపీ.. కొడుకు కాంగ్రెస్… చర్చకు దారి తీస్తున్న తాజా పరిణామాలు..!

by Aamani |
ritesh rathod
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఔను వారిద్దరు తండ్రీ కొడుకులు.. టీడీపీ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగిన మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ రమేష్.. ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరే వరకు తండ్రికి అన్ని వేళలా కుమారుడు రితేష్ రాథోడ్ వెంట నడిచారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆసక్తికర చర్చ మొదలైంది. రాథోడ్ రమేష్ బీజేపీలో చేరే వరకు అన్నింటా వెంట నడిచిన ఆయన కుమారుడు.. తాజాగా టీపీసీసీ కొత్త అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది.

సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన రాథోడ్ రమేశ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్‌గా, పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. ఆయన భార్య సుమన్ రాథోడ్ కూడా 2008 ఉప ఎన్నికలతో పాటు 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలుపొందారు. రాథోడ్, ఆయన భార్య ఎమ్మెల్యేగా పని చేయగా.. ఆయన కుమారుడు రితేష్ రాథోడ్ కూడా రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులకు రాజకీయాల్లో చేదోడు వాదోడుగా నిలిచారు. ప్రతి ఎన్నిక సమయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.

భార్యాభర్తల విజయాల్లో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉంది. రాథోడ్ రమేష్ టీడీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరగా.. ఆయనతో పాటు కుమారుడు కూడా చేరారు. తర్వాత టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెసులో చేరటంతో.. తండ్రి వెంట కొడుకు కలిసి నడిచారు. రాథోడ్ రమేష్ భార్య సుమన్ రాథోడ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో ఉంటున్నారు. దీంతో రాథోడ్ రమేష్ ఖానాపూర్ అసెంబ్లీతో పాటు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఖానాపూరులో పోటీ చేసి ఓడారు. 2019లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ నుంచి బరిలో దిగి పరాజయం పాలయ్యారు.

ఇక ఆయన కుమారుడు రితేష్ రాథోడ్ ఆసిఫాబాద్ నియోజకవర్గం లక్ష్యంగా పని చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో ఇదే నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ రెండు పార్టీల నుంచి ఆసిఫాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా.. 2018లో రాలేదు. ఇటీవల రాథోడ్ రమేష్ బీజేపీలో చేరగా.. తెర వెనకుండి అన్ని వ్యవహారాలు ఆయన కుమారుడే నడిపించారు. రాథోడ్ కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరినా.. రితేష్ మాత్రం బీజేపీలో చేరకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారా.. బీజేపీలో చేరుతారా.. అనే ఊహాగానాలు నెలకొన్నాయి.

తాజాగా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా అనుముల రేవంత్ రెడ్డి నియామకం కావటంతో.. కాంగ్రెస్ నాయకులతో కలిసి రితేష్ హైదరాబాద్ తరలి వెళ్లారు. కొత్త అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఆయన కాంగ్రెసులో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆత్రం సక్కు టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఎస్టీ రిజర్వు స్థానమైన ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానంపై రితేష్ గురి పెట్టినట్లు తెలుస్తోంది.

ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశాలుండగా.. వచ్చే ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి బరిలో దిగేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు కలిసి నడిచిన తండ్రీ కొడుకులిద్దరు తాజాగా వేర్వేరు పార్టీలో ఉండటం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీలో కొనసాగుతుండటంతో జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story