కందుల పైస‌లు రాలే..!

by Shyam |

దిశ, నల్లగొండ: కంది రైతు రంధి పడుతున్నాడు. పంట డబ్బు చేతికి రాక పెట్టుబడి కోసం చేసిన రుణానికి వడ్డీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కందులను అమ్మి నెలరోజులు కావస్తున్నా పైసలు ఇప్పటివరకు రాకపోవడంతో యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని 6,052 మంది రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గ‌త మార్చి 15 నాటికి జిల్లాలోని నాలుగు చోట్ల ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 53,825 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. వీటికి రూ. 31,25,85000 చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకూ రైతుల‌కు కేవలం రూ.6కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. మరో రూ. 25 కోట్ల బ‌కాయిలు రైతులకు అందాల్సి ఉంది. క‌రోనా నేప‌త్యంలో చేతిలో చిల్లిగ‌వ్వ లేకుండా ఇబ్బందులు ప‌డుతున్న రైతులు కందుల డబ్బుల కోసం ఒత్తులేసుకుని నిరీక్షించాల్సిన దైన్య పరిస్థితి నెలకొంది.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఏడాది 20,400 ఎకరాల్లో కందిపంటను సాగు చేశారు. సాగు విస్తీర్ణం ప్రకారం 1,49,800 క్వింటాళ్ల కందుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఆఫీసర్లు అంచనా వేశారు. క్వింటాల్ కందికి కనీస మద్దతు ధరగా రూ. 5,800గా నిర్ణయించారు. కొనుగోలు చేయడానికి జిల్లా యంత్రాంగం మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10నుంచి కందుల కొనుగోళ్లు ప్రారంభించింది. నిబంధనల కారణంగా కందుల అమ్మకం విషయంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప‌రిమితికి మించి తాము కొనుగోలు చేయమని ఆఫీసర్లు చెప్పడంతో అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు నిర్వహించారు. చివరకు కందులను మొత్తం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కొనుగోలు కేంద్రాల్లో మార్చి 21వరకూ 6,052 మంది రైతుల వద్ద 53,825 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు.

కందులు అమ్మి రోజులు గడుస్తున్నా.. పైసలు రాక పోవడంతో రైతులు బ్యాంకులు చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు చేసిన కందుల వివరాలు, బ్యాంక్‌ఖాతా నెంబర్లను కూడా ఆన్‌లైన్‌ చేశారు. అయితే రైతులకు చెల్లించాల్సిన కందుల కొనుగోలు బిల్లులను ఇప్పటికే అందించామని, కొద్ది రోజుల్లో రైతులందరికి డబ్బు అందుతుందని మార్క్‌ఫెడ్‌ ఆఫీసర్లు చెబుతున్నారు.

Tags: farmers, Yadadri Bhuvanagiri district, 6,052 farmers, banks, Agriculture Department

Advertisement

Next Story