ముందు మురిపించి.. ముఖం చాటేసిన వరుణుడు

by Anukaran |   ( Updated:2021-06-23 10:07:17.0  )
Farmers
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ వానాకాల సీజన్ మొదట్లో చురుకుగా కదిలిన రుతుపనాలు గత 5 రోజులుగా ముఖం చాటేశాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తొలకరి జల్లులు మాత్రమే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో సాధారణ వర్షాపాతం 98.5మిమీ ఉండగా ఇప్పటికి 140.1 మిమీ వరకు నమోదైంది. రెండు వారాల పాటు సాధారణ వర్షాపాతానికి మించిన నమోదైన వర్షాలు ప్రస్తుతం వాటి జాడ కూడా కనిపించడం లేదు. వర్షాలు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పత్తివిత్తనాలు నాటిన14.82 ఎకరాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 18.88 లక్షల ఎకరాల్లో సాగు పనులను రైతులు మొదలు పెట్టారు.

సకాలం రుతు పవనాలు చేరుకున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షాపాతాలు నమోదవుతాయని వాతారణ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. జూన్ నెల మొదటి వారం నుంచి సంవృద్ధిగా వర్షాలు కురియడంతో రైతులు సాగు పనులను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా 80లక్షల ఎకరాల్లో సాగుచేయనున్న పత్తి రైతులు ముందుగా వ్యవసాయ పనులను మొదలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో విత్తనాలను కూడా నాటారు. సాగు పనులు ముమ్మరం చేయగానే వరుణుడు ముఖం చాటేశాడు. రుతుపవానాల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలోనే అతిగా కురిసిన వర్షాలు

ఈ ఏడాది వానాకాలం సీజన్‌ మొదట్లోనే వర్షాలు అతిగా కురిశాయి. రాష్ట్రంలో జూన్ నెలలో సాధారణ వర్షాపాతం 98.5మిమీ ఉండగా ఇప్పటికి 140.1మిమీ వరకు నమోదైంది. మొదటి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్షాలు సంవృద్ధిగా కురిశాయి. గత 5 రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు నమోదు కాకపోవడం ఆందోళన కలిస్తోంది. వాతావరణ శాఖ అధికారులు అందించిన లెక్కల ప్రకారం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వర్షాపాతం 3.1మిమీ ఉండగా 2.5మిమీ నమోదైంది. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో తొలకరి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉండటంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది.

రాష్ట్రంలో18.88 లక్షల ఎకరాల్లో సాగు పనులు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 18.88 లక్షల ఎకరాల్లో సాగు పనులు మొదలయ్యాయి. వీటిలో అత్యధికంగా సాగు చేస్తున్న పత్తి పంటలో 14.82 లక్షల ఎకరాలు, 1.58 లక్షల ఎకరాల్లో కంది పంటను, 2.48 లక్షల ఎకరాల్లో వివిధ రకాల చిరుధాన్యాల పంటల సాగు పనులను రైతులు ప్రారంభించారు. జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురియడంతో విత్తనాలు నాటేందుకు అనుకులంగా నేల తడి ఏర్పడిందనే ఆలోచనతో రైతులు సాగు పనులు ముమ్మరం చేశారు.

ఆందోళన చెందుతున్న పత్తి రైతులు

గత 5 రోజులగా వర్షాలు కురియకపోవడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని బావించిన పత్తి రైతులు పొలాల్లో విత్తనాలు నాటారు. విత్తనాలు మొలకెత్తేందుకు కావల్సిన వర్షాలు కురియకపోవడంతో అయోమయంలో పడ్డారు. బోరుబావులు, నీటి వసతి కలిగిన రైతులు పంటలకు తడులను అందిస్తుండగా వర్షంపైనే ఆధారపడిన రైతులు మొగులు వైపు చూస్తున్నారు. అనుకున్న సమయానికి వర్షాలు కురియకపోతే నాటిన విత్తనాలు మొలకెత్తే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

4 ఎకరాల్లో పత్తిసాగు చేసిన

Ramaswami

ఈ ఏడాది వానలు బాగా కురుస్తుండటంతో 4 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసిన. మా గ్రామంలో అందరూ పత్తి పంటనే ఎక్కువగా సాగు చేస్తున్నారు. విత్తనాలు నాటి వారం రోజులవుతుంది. వానలు కురవడం లేదు. మరో వారం రోజుల్లో వానలు కురియకపోతే పంట నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికే రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టినం.
-నేతల రామస్వామి, తిమ్మాపూర్, నేరేడుగుమ్మ మండలం, నల్లగొండ జిల్లా

వానదేవుడు కరుణించాలని మొక్కుతున్నాం

Yallaiah

సాగు పనులు మొదలు పెట్టినం. పత్తి వేయాలని అధికారులు చెప్పడంతో భూమి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వారం రోజుల నుంచి సరైన వానలు కురియడం లేదు. దీంతో విత్తనాలు నాటకుండా ఆగాము. వాన దేవుడు కరుణించాలని రోజు మొక్కుతున్నాం.
-కూరాకుల ఎల్లయ్య, రేకుల గడ్డ, చందంపేట మండలం, నల్లగొండ జిల్లా

Advertisement

Next Story

Most Viewed