సన్నవడ్లకు మద్దతు ఇంకెప్పుడు?

by Shyam |
సన్నవడ్లకు మద్దతు ఇంకెప్పుడు?
X

“నియంత్రిత సాగును రైతులు పాటించారు. సన్నాలు వేయమంటే సన్నాలే వేశారు. గిట్టుబాటు ధర విషయంలోనూ నాదే బాధ్యత. దొడ్డు రకాల కంటే నూరో, నూటయాభయ్యో ఎక్కువనే ఇప్పిస్త. కచ్చితంగా వరి సన్నాలకు మద్దతు ధర కంటే ఎక్కువ ఇప్పిస్త ” గత నెల 31న జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన ఇది. 12 రోజులు దాటింది. ఇప్పటి దాకా సన్న రకాలకు మద్దతు ధర మీద నిర్ణయమేదీ జరగలేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: సన్న వడ్లకు గిట్టుబాటు ధర ఇప్పిస్తానన్న సీఎం ఆ విషయాన్నే మర్చిపోయారు. ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, మద్దతు ధర పెరుగుతుందనే ఆశతో రైతులు ఇంకా సన్న వడ్లను కళ్లాల్లోనే దాచి పెడుతున్నారు. నిజానికి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకుండా పోయింది. ప్రతి గింజను కొంటామని ప్రకటించిన ప్రభుత్వం సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. ఫలితంగా ధాన్యం రాసులు రోడ్లపైనే ఉంటున్నాయి. సన్న రకం వడ్లను అమ్ముకోవాలా, నిల్వ పెట్టుకోవాలా అనే సందిగ్థంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే అదునుగా దళారులు రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వడ్లను కొనుగోలు కూడా చేయరని, ఇప్పుడే ఎంతో కొంతకు అమ్ముకోవాలంటూ మభ్యపెతున్నారు. ప్రస్తుతం దొడ్డు రకం వడ్లకు కేంద్రం ఇచ్చే మద్దతు ధర ప్రకారమే రాష్ట్రంలో కొనుగోళ్లు చేస్తున్నారు. ‘ఎ’ గ్రేడ్​కు రూ.1,888, కామన్​ గ్రేడ్​కు రూ.1868 చొప్పున మద్దతు ధర చెల్లిస్తున్నారు. 75 శాతం రైతులు సన్నాలనే పండించారు. గతంలో సన్నాలను పండిస్తే రైతులకు ఎంతో కొంత కలిసి వచ్చేది. మద్దతు ధరతో సంబంధం లేకుండా రూ.400 నుంచి రూ.500 వరకు ఎక్కువ ధర పలికేది. కొన్నిచోట్ల అంతకంటే ఎక్కువ వచ్చేది. రూ.2300 నుంచి రూ.2500 వరకు కొనుగోలు చేసేవారు. ఈసారి సన్న రకాలు ఎక్కువగా పండించడంతో వ్యాపారులు, మిల్లర్లు కూడా కొనుగోలు చేయడం ఆపేశారు. మద్దతు ధర కంటే తక్కువ ఇస్తామని చెబుతున్నారు. కొన్నిచోట్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వారిచ్చిన రేటుకే వడ్లు అమ్ముకుంటున్నారు.

కేంద్రం వినడం లేదని

సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకోవడం లేదని సీఎం కేసీఆర్​ గత నెల 31న కొడకండ్ల సభలో వెల్లడించారు. కేంద్ర నిబంధనల ప్రకారం మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించే అంశంలో రాష్ట్రాలదే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఇస్తే కేంద్రం అభ్యంతరం చెప్పదు. ఆ విషయంలో సీఎం మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవంగా సన్నాలకు, దొడ్డు రకాల వడ్ల ధర ఇస్తే గిట్టుబాటు కాదు. సన్నాల సాగుకు సమయం, పెట్టుబడి ఎక్కువ. దీంతో ధర కొంత ఎక్కువ ఇవ్వాలనే డిమాండ్​ ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎం దొడ్డు రకం వడ్లకంటే రూ. 100 నుంచి రూ. 150 వరకు ఎక్కువ చెల్లిస్తామని, ఒకట్రెండు రోజుల్లోనే ఆదేశాలు జారీ చేస్తామని ప్రకటించారు. రెండు వారాలు గడస్తున్నా ఎలాంటి ప్రకటన లేదు.

తేమ పెరిగితే

ధాన్యం కళ్లాల్లో ఉండటంతో తేమశాతం పెరుగుతుందని రైతులు భయపడుతున్నారు. బరువు కూడా తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర అందదేమోనని కలవరపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 6,491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యం ఉన్నా ఇప్పటి వరకు 3,704 కేంద్రాలనే ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ప్రారంభించిన కేంద్రాలు మూతపడ్డాయి. ఈసారి 75 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, మంగళవారం నాటికి 4.25 లక్షల మెట్రిక్​ టన్నులు మాత్రమే కొన్నారు. కొనుగోలు చేయాలని చెప్పిన అధికారులు ఏ మిల్లుకు ఎంత పంపించాలనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా కొన్నిచోట్ల కేంద్రాల్లోనే కొన్న ధాన్యం ఉంటోంది.

Advertisement

Next Story