పాపం.. వాళ్లు ఇంకా ఎదురుచూస్తున్రు

by Sridhar Babu |   ( Updated:2020-06-09 20:53:20.0  )
పాపం.. వాళ్లు ఇంకా ఎదురుచూస్తున్రు
X

దిశ, కరీంనగర్: రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ.. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కరీంనగర్ జిల్లా.. రికార్డుల్లోకి ఎక్కనున్నాయని చెప్తున్న ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన డబ్బులు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. దాంతో విత్తన రైతులు తమకు రావాల్సిన ‘విత్తం’ ఎప్పుడిస్తారు సారూ అంటూ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెలరోజులుగా డబ్బులకు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు సీడ్ కంపెనీలను కాదని తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు విత్తన ధాన్యం సరఫరా చేస్తున్న రైతాంగాన్ని ఈసారి సంస్థ నిరాశకు గురి చేస్తోంది. ఏప్రిల్ 22 లోగా విక్రయించిన రైతులకు మాత్రమే డబ్బులను అందించిన సంస్థ ఆ తర్వాత వారికి ఇవ్వలేదు. ఆర్థిక సంక్షోభం కారణంగానే డబ్బులు ఇవ్వడం లేదని అధికారులు చెప్తున్నారని రైతులు అంటున్నారు. సంస్థ బ్యాంకు‌లోన్ కోసం ట్రై చేస్తోందని రుణం కార్పొరేషన్ చేతిలో పడగానే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెబుతున్నారని వివరించారు.

కేవలం రూ.2 కోట్లే చెల్లింపు..

విత్తనాల కోసం సేకరించే ధాన్యంలో తాలు, ఇతరత్రా వేస్టేజ్ రాకూడదు. ఒకవేళ వస్తే వాటిని గ్రేడిండ్ చేసి క్లీన్ సీడ్ మాత్రమే కొంటారు. ధాన్యం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి తరలించాలి. క్లీన్ సీడ్ అని అధికారులు గుర్తించిన తర్వాతే ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేస్తారు. క్వింటాళుకు రూ. 2,300 చొప్పున చెల్లిస్తారు. అయితే, ఈ ధాన్యాన్ని రైతులే కార్పొరేషన్ పర్చేసింగ్ సెంటర్ వరకూ ట్రాన్స్ పోర్టు చేయాల్సి ఉంటుంది. వివిధ రకాల సీడ్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 వేల క్వింటాళ్ల వరకూ సేకరిస్తారు. జిల్లాలో రూ.8 కోట్ల విలువ చేసే సీడ్‌ను అధికారులు ఇప్పటి వరకు సేకరించారు. కేవలం రూ. 2 కోట్ల రూపాయల వరకు మాత్రమే డబ్బులు చెల్లించారు. దీంతో సీడ్ సప్లై చేసిన రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సీడ్ కోసం కార్పొరేషన్ ధాన్యం సేకరిస్తోంది. పూర్వ జిల్లాల వారిగానే విత్తన ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇందులో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల రైతులు ఎక్కువగా సీడ్ ధాన్యాన్ని కార్పొరేషన్‌కు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రూ.300 కోట్ల రూపాయల మేర సీడ్ ధాన్యాన్ని తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సేకరించగా ఇప్పటి వరకు రూ. వంద కోట్ల రూపాయల మేరకే విడుదల చేసినట్లు సమాచారం.

సబ్సిడీకి నో..

రాష్ట్ర ప్రభుత్వం సీడ్ ధాన్యాన్ని సరఫరా చేసే రైతులకు గతంలో సబ్సిడీ ఇస్తూ ప్రొత్సహించేది. కానీ, ఇప్పుడు ఆ విధానాన్ని ఎత్తేసింది. కార్పొరేషన్ లోన్ తీసుకుని రైతులకు డబ్బు చెల్లించాలని చెప్తోంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ష్యూరిటీగా ఉంటుందన్న హామీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఎత్తి వేయడం వల్ల రైతులపై క్వింటాల్ కు రూ. 700 వరకు భారం పడుతోంది. మరోవైపున ఈసారి బ్యాంకుల విలీనం కూడా రైతుల చేతికి డబ్బు అందకుండా చేసింది. జాతీయ బ్యాంకుల్లో విలీన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నందున డబ్బులు రైతులకు సకాలంలో అందడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed