దళారుల ఉచ్చులో బీర, కాకర రైతులు

by Sridhar Babu |
Beerakaya
X

దిశ, అశ్వారావుపేట : రైతుల రోజువారీ ఆదాయ మార్గమైన కూరగాయల సాగు సంక్షోభంలో పడింది. సాగు పనులకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. మార్కెట్లో అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నా, ధరలు పతనం కావడంతో లాభాలు మడిలోనే ఆవిరవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని నారంవారిగూడెం, దమ్మపేట కూరగాయల సాగుకు పెట్టింది పేరు. ఈ గ్రామాలకు చెందిన రైతులు ఎక్కువగా బీర, కాకర, బెండకాయ లాంటి పంటలను సాగు చేస్తుంటారు.

ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో బీర, కాకర అధికంగా పడింది. కానీ ఆ ఆనందం రైతులకు ఎంతోకాలం నిలవలేదు. ప్రస్తుతం క్వింటా బీర ధర 1000 రూపాయాలు, క్వింటా కాకర రూ.1500 ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దళారులు బీర, కాకర రైతుల పాలిట శాపంగా మారారు. రైతు దగ్గర నుంచి కేజీ రూ.10 కొనుగోలు చేస్తూ, మార్కెట్లో రూ.40లకు అమ్ముతు రైతుల శ్రమను దోచుకుంటున్నారు.

ఎకరానికి మూడు నుండి నాలుగు టన్నులు బీర, కాకర దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం ధరతో పోల్చితే ఎకరానికి రూ.40 వేలు కూడా రావట్లేదని, పందిరి ఖర్చులు కూడా రావని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో బీర, కాకర దళారులు ఒకరి నుండి మరొకరికి రేట్ల వ్యత్యాసం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధర లేదనే సాకుతో అతి తక్కువ ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed