- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిండా ముంచిన ‘నియంత్రిత’ సాగు
దిశ, తెలంగాణ బ్యూరో: “ రైతులకు కష్టాలు రానీయ.. ఉచితంగా ఎరువులు ఇస్తా. నియంత్రిత సాగును చెబితే రైతులంతా అదే పాటించారు. ఇంకేం.. సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతుకు ఇబ్బందులు అనేవే ఉండవు. కేసీఆర్ చెప్పిండంటే చేసి చూపిస్తడు. వెనక్కి పోడు…” సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో చెప్పే మాట ఇదే. కానీ ఒక్కసారిగా వెనకడుగు వేశారు. తాను ఎంతో ప్రతిష్టాత్మకమంటూ చెప్పిన మాటను వెనక్కి తీసుకున్నారు. రైతులు ఏం చేసుకుంటారో చేసుకోండి.. నేనైతే మీకు ఏం చేయను.. అన్నట్టుగానే ప్రకటించారు. వరుస పరిణామాల్లో రైతులపై సీఎం కేసీఆర్‌కు కోపం వచ్చింది. ఇప్పటి వరకు లేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతా మీ ఖర్మ అంటూ చెప్పుకొచ్చారు. మీరేం చేసినా నేను అడుగను.. మీ ధాన్యం కొనను అంటూ వెల్లడించారు. ఇది కొన్ని అంశాల్లో రైతుల వైఖరి తేలడంతోనే సీఎం కేసీఆర్ ఇలా ఫైర్ అవుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కేవలం నియంత్రిత సాగు విధానమే రైతులపై కోపానికి కారణమవుతోంది. అటు కేంద్రం తీసుకువచ్చిన విధానాలను ఒక్కసారిగా సమర్థించడంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.
ముందే పెద్ద తప్పు..!
ఈ వానాకాలం సీజన్ప్రారంభంలోనే సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. వందల మంది అధికారులు, పదుల సంఖ్యలో శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, వ్యవసాయ పరిశోధనా యూనివర్సిటీ బృందం అంతా కలిసి ఈ నియంత్రిత సాగు విధానానికి రూపకల్పన చేశారు. సీఎం కేసీఆర్ సూచనలతోనే ఈ ప్రణాళిక రూపొందించుకుంది. చెప్పిన పంటే వేయాలంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏదైనా రైతుల కోసమే నిర్ణయమనే ధోరణిలో రాష్ట్ర రైతాంగం కూడా పాటించింది. మొక్కజొన్న వేయవద్దంటూ సూచించారు. కానీ కొన్ని భూములు కేవలం మొక్కజొన్నకు మాత్రమే అనుకూలం. అలాంటి భూముల్లో రైతులు ధైర్యం చేసి మక్కల సాగు పెంచారు. ముందుగా చెప్పిన పంటలు వేస్తేనే రైతుబంధు ఇస్తామన్నారు. కానీ ఎలాగో అందరికీ ఇచ్చారు. ఇక మక్కల విషయంలో కూడా అంతే. సీజన్ తర్వాత పంట చేతికి రాగానే మక్కలు కొనమని బెదిరించినా.. ఎట్టకేలకు కొనుగోలు చేశారు.
కానీ నియంత్రిత సాగు అనేది ఫెయిల్యూర్ అంశంగా మారింది. ముందు వ్యవసాయ శాఖ కనీసం మట్టి పరీక్షలు కూడా చేయలేదు. మట్టి తీసుకుని ఫలితాలివ్వలేదు. దీంతో ముందుగా ఏ పంట వేయాలో చెప్పినప్పుడే ఆ భూములు సదరు పంటకు పనికి వస్తాయా లేదా అనేది తేలలేదు. ఏ నేలలు ఏయే పంటలకు అనుకూలమనే అంశమే చెప్పలేదు. సీఎం చెప్పిందే తరువాయి. వ్యవసాయ శాఖ గ్రామాలకు వెళ్లింది. అప్పటి వరకూ ఎలాంటి పరిస్థితి చెప్పని ఆ శాఖ.. ఉన్నపళంగా నియంత్రిత సాగును రైతులపై రుద్దింది. సన్నాల సాగును పెంచింది. పత్తిని ఎక్కువగానే వేయించారు. ఏటేటా పత్తి సాగు పెరుగుతున్నా.. ఈసారి సన్నాల సాగు మాత్రం గణనీయంగా పెరిగింది. వానాకాలంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగుచేస్తే.. ఇందులో సన్నరకాలు 34.45 లక్షల ఎకరాలు, దొడ్డు రకాలు 13.33 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కేవలం నియంత్రిత సాగు విధానంలోనే ఈ మార్పు వచ్చింది.
కొనుగోళ్లు జరిగాయా..?
కానీ కొనుగోళ్లకు వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. దొడ్డు రకాలకు ఇచ్చే మద్దతు ధరనే సన్నాలకు ఇచ్చారు. వాస్తవంగా సన్నాల సాగుకు పెట్టుబడి పెరిగింది. ఎకరాకు ఆరేడు వేలు ఎక్కువయ్యాయి. ఎక్కువ రోజులు తీసుకుంది. కానీ దిగుబడి తగ్గింది. దొడ్డు రకాలతో పోలిస్తే.. దాదాపు 6 నుంచి 8 క్వింటాళ్లు తగ్గాయి. అయినా రైతులు భరించారు. కానీ కొనుగోళ్ల సమస్యలు మొదలయ్యాయి. సన్నాలను కొనడంలో కొనుగోలు కేంద్రాలు నిర్లక్ష్యం చేశాయి. దీనికి కారణం మిల్లర్లు కూడా. మిల్లర్లకు ఈసారి టార్గెట్ కేటాయించలేదు. అటు దొడ్డు రకాలతో పోలిస్తే సన్న బియ్యం ఉత్పత్తి కూడా తక్కువ. దీంతో మిల్లర్లు కూడా కొనుగోలు కేంద్రాల నుంచి వడ్లను తీసుకుపోలేదు. నిల్వలు ఉంటుండటంతో నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం చేశారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ మద్దతు ధరపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్31న జనగామ జిల్లా కొడకండ్ల సభలో సన్న వడ్లకు వందో, నూటయాభయ్యో ఎక్కువ ఇప్పిస్తానని ప్రకటించారు. కానీ అమల్లో సాధ్యం కాలేదు. ధర పెరుగుతుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకున్నారు. ఇక డిసెంబర్ నెల వరకు చూసి రైతులు ఎంతో కొంతకు అమ్ముకున్నారు. కానీ రైతుల చేతుల్లో నుంచి ధాన్యం పోయిన తర్వాత పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు మద్దతు ధర కంటే ఎక్కువ పెట్టి కొన్నారు. దీంతో రైతుల్లో సన్నాల సాగు ఆగ్రహం తెప్పించింది.
యాసంగి కూడా…
ఇదే సమయంలో యాసంగి సాగు పనులు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన కోసం రైతులు ఎదురుచూశారు. నియంత్రిత సాగు విధాన ప్రణాళికను ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు సన్నాల సాగు ప్రమాదకరంగా మారింది. దీంతో రైతులు మళ్లీ దొడ్డు రకాల వైపు మళ్లారు.
వ్యతిరేకతను గుర్తించారా..?
వాస్తవంగా రైతుల్లో వ్యతిరేకత పెరిగింది. నియంత్రిత సాగు విధానంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్పార్టీ ఇదే బలాన్ని పెట్టుకుంది. సర్కారు లెక్క ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 92 వేల మంది రైతుబంధు, రైతుబీమా లబ్ధిదారులున్నారు. అంటే రైతుల ఓట్లు వచ్చినా చాలనుకున్నారు. అటు సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఉన్నారు. కానీ వ్యవహారం బెడిసికొట్టింది. రైతుల ఓట్లు రాలలేదు. 60 వేల ఓట్లు మాత్రమే పోలైనా.. అవి సంక్షేమ పథకాల లబ్ధిదారులవేనన్నట్లు తేల్చారు. అంటే రైతులు ప్రభుత్వానికి అనుకూలంగా లేరని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
అందుకే ఫ్రస్టేషన్
ప్రతి చిన్న అంశాల్లో ఆచితూచి అడుగులేసే సీఎం కేసీఆర్.. రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఫ్రస్టేషన్ పెంచినట్లైందని ఆయా వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా 81 శాతం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం భరించలేని పరిస్థితులకు తీసుకువచ్చిందంటున్నారు. దీంతో సీఎం కేసీఆర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారని తెలుస్తోంది. అందుకే ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వేదికగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతులకు ఇంత చేస్తున్నా.. వ్యతిరేకతతో ఉండటంపై సీఎం తట్టుకోలేకపోయారనే ప్రచారం జరుగుతోంది. అందుకే కేంద్ర చట్టాలకు మద్దతుగా ఉండేలా ఉంటూ నియంత్రిత సాగు విధానాన్ని ఎత్తివేస్తూ.. పంటలు, కొనుగోళ్ల భారమంతా రైతులపైనే వేస్తూ నిర్ణయం తీసుకున్నారని చర్చించుకుంటున్నారు. అయితే పరిస్థితులను బట్టి మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. కానీ ముందుగా ఓసారి పరిస్థితులను చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారంటున్నారు. అంటే యాసంగి సీజన్ తర్వాత కొనుగోళ్ల పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత రైతులకు అనుకూల ప్రకటన చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.