- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు తప్పని పాట్లు…
దిశ, మహబూబ్ నగర్: కరోనా మహమ్మారి ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులపై తన ప్రభావం చూపడంతో రైతులు కుదేలవుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడిక్కక్కడా గ్రామాలలోనే కొనగోళ్ల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా వరకు కొనుగోళ్ల కేంద్రాలు ఇంకా తెరుచుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 760 కొనుగోళ్ళు కేంద్రాలను తెరవాల్సి ఉంది. జిల్లాల వారీగా మహబూబ్ నగర్ జిల్లాలో 225, నాగర్ కర్నూల్ జిల్లాలో 177, వనపర్తిలో 214, గద్వాలలో 9, నారాయణపేటలో 160 కేంద్రాలు తెరవాలి. ఇప్పటి వరకు వాటిలో సగం కూడా తెరుచుకోకపోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయం దళారులకు వరంగా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం చాలామంది దళారులు నేరుగా రైతుల నుండి పంటను కొనుగోళ్లు చేస్తూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లాలో 96,730 మెట్రిక్ టన్నులు, నాగర్ కర్నూల్ లో 1,44,859, వనపర్తిలో 2,37,000, జోగుళాంబ గద్వాలలో 1,05,000, నారాయణపేటలో 1,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ యార్డులకు వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. గోనె సంచుల సమీకరణలో వెనుకబాటు… గోనె సంచుల సమీకరణలో మాత్రం అధికారులు వెనబడిపోవడంతో ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
దీంతో ప్లాస్టిక్ సంచుల ద్వారా ధాన్యం కొనుగోళ్లను చేయడం జరుగుతుంది. కానీ, దళారులు మాత్రం గోనె సంచులను వారే తీసుకువచ్చి ధాన్యాన్ని నింపుకుని తీసుకెళ్లడంతో రైతులు అటువైపే మొగ్గు చూపుతున్నారు. టోకెన్లను జారీ చేసి వారి నెంబర్ వచ్చిన సమయంలోనే గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు పంటలను తీసుకురావాలని ప్రభుత్వం రైతులను అదేశించింది. అయితే ఈ పద్ధతి ఆచరణకు అంత సలువు కాదని రైతులు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పంటలు కోతకు రాగా మరికొన్ని చోట్ల పంటలను కోశారు. అయితే తమకు కేటాయించిన నెంబర్ వచ్చే వరకు పంటను వ్యవసాయ పొలాల వద్ద నిల్వ ఉంచడం రైతులకు కష్టంగా మారింది. పందులు, వన్యప్రాణుల బెడద ఎక్కువ ఉండడం, మరోవైపు ఎపుడు వర్షం కురుస్తదో తెలియని పరిస్థితి నెలకొన్నది. రోజుకు పది మందితో మాత్రమే పంటలను కొనుగోళ్లు చేస్తే తమ టోకన్ నెంబర్ వచ్చే వరకూ పంటను వ్యవసాయ పొలాల వద్దే పెట్టి కంటిమీద కునుకులేకుండా ఉండాల్సి వస్తోందిన వాపోతున్నారు. దీంతో పాటు ప్రభుత్వం పంటలను కొనుగోళ్లు చేసిన డబ్బులను నేరుగా రైతుల అకౌంట్లలో వేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. పంట
అధికారుల చేతుల్లో పెట్టి డబ్బుల కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దళారుల పంట పండింది. అధికారుల కంటే ముందుగానే గ్రామాలలో తిష్టవేసి నేరుగా రైతుల నుండి పంటలను కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి పంటను విక్రయించాలంటే రైతులే వాటిని కొనుగోళ్ల కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. కానీ, దళారులకు విక్రయించడం వల్ల వారే నేరుగా రైతుల పొలాల వద్ద నుండి పంటను కొనుగోళ్లు చేసి వారి సొంత ఖర్చులతో తరలించుకుపోతున్నారు.
దళారుల పంట పండింది…
పంటలను కొనుగోళ్లు చేసే దళారులు ఎలాంటి హమాలీ ఖర్చులు, రవాణా ఖర్చులు లేకుండా ధాన్యాన్ని తరలించుకుపోవడంతోపాటు రైతులకు డబ్బులను కూడా రెండు మూడు రోజుల్లో ఇస్తున్నారు. వరి గ్రేడ్- ఏ రకానికి రూ.1,835, సాధారణ రకానికి రూ.1,815, అలాగే మొక్కజొన్నకు రూ.1,760, పప్పుశనగకు రూ.4,875లను మద్దతు ధరగా నిర్ణయించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రూ.100 నుండి 200 వరకు తక్కువ ధరకే రైతుల నుండి దళారులు పంటలను కొనుగోళ్లు చేస్తున్నారు. ఇదే విషయాన్ని రైతుల వద్ద ప్రస్తావిస్తే ప్రభుత్వానికి పంటలను విక్రయిస్తే హమాలీ ఖర్చుతోపాటు రవాణా ఖర్చులు, తమ టోకెన్ నెంబర్ ఎప్పుడు వస్తదో అని ఎదురుచూపులు, ప్రతి రోజు వర్షం పేరుతో భయం, రేయింబవళ్ళు పొలాల వద్ద పంటకు కావలి, ఇంతా చేసినా సరైన సమయానికి డబ్బలు చేతికి రావు. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడం కంటే కొంత తక్కువైనా కూడా దళారులకు పంటలను విక్రయించడమే మేలు అని వారు అంటున్నారు. ఇటు తమ అవసరానికి చేతికి డబ్బులు అందడంతోపాటు ప్రస్తుతం తమపై ఉన్న బరువును కూడా దింపుకునే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. అదే విధంగా రైతులు ప్రభుత్వానికి తమ పంటలను విక్రయించాలంటే రైతులు తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్ పుస్తకము తీసుకుని రావాలని తెలిపారు. వీటితోపాటు వీఆర్వో, వీఏఓలచే వారు సాగు చేసిన పంట ధృవీకరణ పత్రాలను వెంట తీసుకురావాలన్నారు. తమ పంటను తాము విక్రయించుకునేందుకు ఇలా ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా గ్రామాలల్లో వరి కొనుగోళ్ల కేంద్రాల వద్ద కావాల్సిన మేర కాంటాలు లేకపోవడంతో ఆయా గ్రామాలల్లో ఉన్న రేషన్ షాపుల కాంటాలను వాడుతుండడంతో రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దేవరక్రద మండలం మినిగోనిపల్లిలో కొనుగోళ్ల కేంద్రం వద్ద కాంటాకు , రైస్ మిల్లు వద్ద ఉన్న కాంటాకు మధ్య వ్యత్యాసం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇలా తూకాలలో కూడా తమకు నష్టం తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం, అధికారుల అనేక నిర్ణయాలు దళారులకు పంట పండిస్తుండగా రైతులకు మాత్రం కన్నీరే మిగులుతుంది.
Tags: Farmers, Mahabubnagar, crop purchase, dalits, new implications