ఓ వైపు వర్షం.. వాటికి పనిచెప్పిన రైతులు..!

by Sridhar Babu |   ( Updated:2021-06-12 08:09:47.0  )
Farmers are busy with farming as the monsoon season
X

దిశ, చేవెళ్ల: వానాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సీజన్ ప్రారంభం కావాల్సి ఉండడంతో రైతులు దుక్కులు దున్నే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల తుఫాను ప్రభావంతో తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు రైతులు ట్రాక్టర్లతో పొలాలు దున్నే పనుల్లో నిమగ్నమయ్యారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి-చేవెల్ల-మొయినాబాద్-షాబాద్ తదితర మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం రైతులు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు పూర్తయినప్పటికీ ధాన్యాన్ని అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జూన్ 15 నుంచి వానాకాలం పంటల సాగు (ఖరీఫ్ సీజన్) ప్రారంభం కానుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కాగా వ్యవసాయ అధికారులు సాగు ప్రణాళికను సిద్ధం చేసే పనిలో పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పప్పు ధాన్యాల సాగు పెంచాలని అందుకు అనుగుణంగా రైతులను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.

కాగా గత సంవత్సరం 8,026 ఎకరాలలో వరి సాగు చేయగా ఈ సంవత్సరం 4,407 ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయి. గత సంవత్సరం 62,256 ఎకరాలలో పత్తి సాగు చేయగా ఈ సంవత్సరం 68 వేల 991 ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం మొక్కజొన్న వేయవద్దని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 2,558 ఎకరాలలో సాగు చేయగా ఈ సంవత్సరం అదే విస్తీర్ణంలో సాగు చేసే అవకాశాలున్నాయి. ఈ సంవత్సరం ప్రభుత్వం మొక్కజొన్న సాగుకు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

మార్కెట్‌లో గత సంవత్సరం మొక్కజొన్న సాగు చేసిన రైతులకు కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.దీంతో మొక్కజొన్నకు బదులుగా కొంతమంది రైతులు పంటను సాగు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో జొన్నలకు డిమాండ్ కూడా బాగానే ఉండడంతో జొన్న పంటను సాగు చేస్తే తమకు ఆహార పంటగా ఉపయోగపడటమే కాకుండా మార్కెట్ డిమాండ్‌ను కూడా సొంతం చేసుకోవచ్చని ఆలోచనలో రైతులు ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో పెసర్లు 285 ఎకరాలు సాగు చేయగా, మినుములు కేవలం 150 ఎకరాల్లో మాత్రమే సాగు చేసే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story