సెప్టెంబరులో 6 శాతం పెరిగిన ఎగుమతులు

by Harish |   ( Updated:2020-10-15 09:35:04.0  )
సెప్టెంబరులో 6 శాతం పెరిగిన ఎగుమతులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంజనీరింగ్, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్స్, రెడీమేడ్ దుస్తుల రవాణాలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఆరు నెలల పాటు క్షీణించిన భారత ఎగుమతులు సెప్టెంబర్‌లో పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సెప్టెంబర్ నెలలో దేశీయ ఎగుమతులు గతేడాదిలో ఉన్న 5.3 శాతం నుంచి ఈసారి 5.99 శాతం పెరిగినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

గత నెలలో మొత్తం ఎగుమతుల విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా నమోదైంది. అదేవిధంగా దిగుమతులు 19.6 శాతం క్షీణించి సుమారు రూ. 19.5 వేల కోట్ల వాణిజ్య లోటు నమోదైనట్టు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి. వాణిజ్య లోటు గతేడాది సెప్టెంబర్‌లో సుమారు రూ. 85.1 వేల కోట్లు ఉండగా, ఈ ఏడాది ఆగష్టులో సుమారు రూ. 49.4 వేల కోట్లుగా నమోదయ్యాయి.

గతేడాది సెప్టెంబర్‌లో ఎగుమతులు సుమారు రూ. 1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. అలాగే, గత నెలలో బంగారం దిగుమతులు 52.85 శాతం తగ్గాయని గణాంకాలు వెల్లడించాయి. ‘సెప్టెంబర్‌లో సరుకుల ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల కొంత ఉపశమనం కలిగించిందని, గత త్రైమాసికంలో దేశీయంగా ఆహార, వ్యవసాయ ఎగుమతులు దాదాపు 45 శాతం వృద్ధిని నమోదు చేశాయని, భవిష్యత్తులో ఇది ఇలాగే కొనసాగుతుందని’ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.

Advertisement

Next Story