భారత్ నుంచి దుబాయ్‌కి తగ్గిన బంగారం ఎగుమతులు!

by Harish |
భారత్ నుంచి దుబాయ్‌కి తగ్గిన బంగారం ఎగుమతులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ముందు నాటితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ మధ్య భారత్ నుంచి దుబాయ్‌కి ఎగుమతి అయ్యే సాదా బంగారు ఆభరణాల ఎగుమతులు 24 శాతం తగ్గాయి. కరోనా వల్ల స్థానిక వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోవడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. పర్యాటకులు లేని కారణంగా భారత్ నుంచి కొనుగోళ్లను తగ్గించినట్టు దుబాయ్ ఆభరణాల టోకు వ్యాపారులు అన్నారు. ఇటీవల బూస్టర్ డోస్ తీసుకోవడం పెరగడంతో పర్యాటకులు పెరుగుతున్నారని, రానున్న రోజుల్లో అమ్మకాలు పెరుగుతాయని ఆశిస్తున్నట్టు భారత్ నుంచి బంగారం ఆభరణాలను దిగుమతి చేసుకునే బఫ్లె జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ భోగిలాల్ చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్‌లో మొత్తం బంగారు ఆభరణాల ఎగుమతులు 23.82 శాతం తగ్గి రూ.45,542 కోట్లుగా నమోదయ్యాయి. కరోనాకు ముందు 2019 ఏప్రిల్-నవంబర్‌లో మొత్తం రూ. 59,783 కోట్లుగా ఉన్నాయి. రత్నాలు, ఆభరణాల మొత్తం ఎగుమతులు సమీక్షించిన కాలంలో 2019 నాటితో పోలిస్తే 9.21 శాతం పెరిగాయి. ప్రధాన ఎగుమతి మార్కెట్లు అయిన అమెరికా 38.33 శాతం, హాంకాంగ్ 24.46 శాతం, యూఏఈ 13.87 శాతం, బెల్జియం 4.10 శాతం, ఇజ్రాయెల్ 3.84 శాతంగా ఉన్నాయి.

అంతకుముందుతో పోలిస్తే రత్నాలు, ఆభరణాల ఎగుమతుల పనితీరు 2021లో మెరుగ్గా ఉంది. అంతేకాకుండా ప్రపంచ అతిపెద్ద ఆభరణాల వినియోగ దేశం అమెరికా ఈ ఏడాది భరత్ నుంచి కొనుగోళ్లను పెంచిందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed