అద్దంలో సముద్రం.. ఆహ్లాదం, ఆనందం!

by Anukaran |
అద్దంలో సముద్రం.. ఆహ్లాదం, ఆనందం!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అందమైన గాజు పెట్టె.. అందులో నీళ్లూ రంగురంగుల రాళ్లు.. తిరగాడే బుజ్జి బుజ్జి చేప పిల్లలు.. అదేనండి అక్వేరియం. దాన్ని చూస్తేచాలు మానసిక ఒత్తిడి మటుమాయం. ఏదో తెలియని మధురానుభూతిని పొందుతాం. అప్పుడప్పుడు సినిమాల్లో, తరువాత పట్టణాల్లో రిచ్ పీపుల్ ఇండ్లలో ఉండేవి. ప్రస్తుతం ఈ కల్చర్ గ్రామీణ ప్రాంతాల్లోనూ కనిపిస్తోంది. చిన్న చిన్న అక్వేరియాల్లో తమకు నచ్చిన చేప పిల్లలను పెంచుతున్నారు. అంతేకాదండోయ్.. ఇంటి వాస్తుదోషం నివారణకు కూడా కొన్ని రకాల చేప పిల్లలను పెంచుతున్నారు. ఆరోగ్యానికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారండోయ్.. అటువంటి అక్వేరియం గురించి మీకోసం దిశ స్పెషల్ ఐటెం.

సముద్రమే చిన్న గాజు పెట్టెలోకి ఒదిగిందా అన్నటుగా ఉంటుంది అక్వేరియం. మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు అందులోకి తొంగి చూస్తే చాలు అంతా మైమరిచిపోతాం. ఓ బుల్లి సముద్రం రంగురంగుల గులక రాళ్లు, అందులో సయ్యాటలాడే చేప పిల్లలతో అబ్బురపరుస్తోంది. ప్లాస్టిక్ వనంతో కాంతులీనుతుంది. వాటిని చూస్తుంటే ఎంతటి కష్ట సమయంలోనైనా మత్స్యలోకంలోకి అడుగు పెట్టామా అనే అనుభూతిని పొందుతాం. ప్రస్తుత కాలంలో ఇంటి అలంకరణలో అక్వేరియం భాగమైంది.

వాస్తు సెంటిమెంట్..
నగరవాసుల్లో ఇటీవల వాస్తు దోషం నివారణకు చేపల పిల్లల పెంపకం ఓ సెంటిమెంట్ గా మారింది. పలువురు వాస్తు ప్రేమికులు ఎంత ఖర్చు పెట్టైనా ఆ చేప పిల్లలను కొనుగోలు చేసి ఆకర్షణీయంగా ఇంట్లో అలంకరించుకుంటున్నారు. ఇక మత్స్య ప్రేమికుల గురించి చెప్పనక్కరే లేదు. రంగుల రంగుల చేప పిల్లలకు ముద్దు పేర్లు పెడుతూ తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూసుకుంటున్నారు. గోల్డ్ ఫిష్, మోలిన్, సుప్పిన్, సోటాలే, ఎల్లోఫిష్, టైగర్ బార్ వంటి చేపలను అక్వేరియంలో పెంచుకునేందుకు అధిక సంఖ్యలో ఇష్టపడుతుంటారు. సైజును బట్టి వీటి ధరలు రూ.50నుంచి రూ.500వరకు పలుకుతున్నాయి. స్లివర్ హార్న్ చేపలు వాస్తు దోష నివారణ కోసం పెంచుకునేందుకు పేరొందాయి. అయితే వీటి సైజులను బట్టి ధరలను నిర్దారిస్తుంటారు. వీటిని ఇంట్లో పెంచితే అదృష్టం కలిసి వస్తోందని వాస్తు ప్రేమికుల ప్రగాఢ నమ్మకం. చైనా నుంచి సంక్రమించిన ఈ సంప్రదాయం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది.

మానసిక ప్రశాంతత…
అక్వేరియం గృహాలంకరణకు తోడ్పడడమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయి. అక్వేరియంలోని చేపలను చూస్తుంటే మనిషి తనలోని ఒత్తిడి, అలసటను మర్చి పోతుంటారు. ఇటీవల కాలంలో డాక్టర్లు డిప్రెషన్, హైపర్ టెన్షన్, గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి ఇంట్లో అక్వేరియాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజు అక్వేరియంలో తిరుగాడే చేప పిల్లలను కాసేపు చూడడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం పెంపొందుతున్నట్లు వైద్యులు సూచిస్తున్నారు. చేపలను చూస్తూ వాటికి ఆహారాన్ని అందజేయడంతో మనిషిలో ప్రశాంతత చేకూరి రక్తపోటు అదుపులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు. అక్వేరియాన్ని చూడడం వల్ల కళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అక్వేరియాలను ఇంట్లోనే కాకుండా కార్యాలయాలు, హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లు, కంపెనీల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. హోటళ్లు, వస్త్ర దుకాణాల ఎంట్రన్స్ లో ఏర్పాటు చేసి కస్టమర్లకు స్వాగతం పలుకుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు…
ఇంట్లో, గదుల్లోనైనా వీటి నిర్వహణ ఎంతో సులువుగా ఉంటుంది. అక్వేరియంలోని చేపలకు రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం ఆహారం అందజేయాలి. గాజు పెట్టెల సైజులను బట్టి నీటిని రోజుకు ఒకసారి శుభ్రపరుచుకోవాలి. అక్వేరియం ధరలు వాటి సైజులను బట్టి దొరుకుతాయి. రంగురంగుల చేపలు అక్వేరియం ఆకృతి, ఇంటీరియర్ డెకరేషన్, లైటింగ్ ప్రకారం ఉంటాయి. చక్కటి నిర్వహణతోపాటు ఎప్పటికప్పుడు అక్వేరియాలను శుభ్ర పరచుకుంటే ఇంట్లో శోభయమానంగా మారుతాయి.

నిర్వహణ ఇలా..
* ఎప్పటికప్పుడు అక్వేరియంలో నీటి స్థాయి తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా లీకేజీలు లేకుండా జాగ్రత్తపడాలి.
* అక్వేరియంలో నింపేందుకు బోరు నీరే ఉత్తమం.
* ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అక్వేరియంలో సగం నీరు తొలగించి వాటి స్థానంలో కొత్త నీటిని చేర్చాలి.
* ప్రతి నెల రోజులకు నీటిని పూర్తిగా మార్చి అక్వేరియాన్ని శుభ్రం చేయాలి.
* చేపలకు వాయువును సక్రమంగా సమకూర్చేందుకు నాణ్యమైన ఆక్సిజన్ మోటార్లను వినియోగించాలి.
* చేపలను చేతితో తాకకూడదు. వాటిని పట్టుకునేందుకు మార్కెట్లో జల్లెళ్లు లభ్యమవుతున్నాయి.
* నిపుణుల సూచనల మేరకు చేపలకు ఆహారం సమపాళ్లలో మాత్రమే ఇవ్వాలి.
* అక్వేరియాన్ని కావల్సిన రీతుల్లో కూడా తయారుచేసుకోవచ్చు. అందుకు ఖర్చును గురించి ఆలోచించుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో విదేశాల నుంచి దిగుమతైన ఫైబర్ అక్వేరియాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed