శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు మంగళం

by Shamantha N |
శశికళ సంచలన నిర్ణయం.. రాజకీయాలకు మంగళం
X

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ రాజకీయాలకు మంగళం పలికారు. తానెప్పుడూ అధికారం, హోదా, పదవుల కోసం పరితపించలేదని స్పష్టం చేశారు. అమ్మ అని పిలిచే తమిళ ప్రజలు, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ఓటేయాలని కోరారు. అమ్మ ఎప్పుడూ డీఎంకే ఓటమిని కోరిందని, అందుకే ఆ పార్టీ ఓడిపోయేలా విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. అమ్మ మద్దతుదారులందరూ ఐక్యంగా సాగాలని, విజయం కోసం పోరాడాలని సూచించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుమారు నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన వీకే శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తుందని అందరూ అంచనా వేశారు. ఎన్నికల్లన్నీ ఆమె చుట్టూనే తిరుగుతాయని భావించారు.

కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ బుధవారం ఆమె రాజకీయాలకు స్వస్తి చెబుతూ లేఖ విడుదల చేశారు. జయలలిత బ్రతికి ఉన్నప్పుడూ తాను అధికారం, హోదాల కోసం పరుగెత్తలేదని, ఇప్పుడూ తనది అదే వైఖరి అని స్పష్టం చేశారు. ఏఐఏడీఎంకే విజయం కోసం జయలలిత కష్టపడిందని, ఆమెను దైవంగా భావించేవారందరూ ఆ పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిపారు. కానీ, జయలలిత కన్న కలలు నెరవేరాలని, ఆమె కోరుకున్న సుపరిపాలన సాగాలని అభిలాషించారు. వీకే శశికళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందని టెంకాసీలో మేనల్లుడు టీటీవీ దినకరణ్ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. మరోవైపు ఏఐఏడీఎంకే, శశికళను ఏకతాటిపైకి తేవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. పళని ప్రభుత్వం మాత్రం శశికళ కదలికలపై కన్నేసి ఉంచింది. ఈ తరుణంలో తాను రాజకీయాల నుంచే తప్పుకుంటున్నాని శశికళ ప్రకటించడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed