రేషన్ డీలర్ల ‘డీల్’ అయిపోయిందట.. పరీక్షలు, ఇంటర్వ్యూలు అంతా నాటకమేనా..?

by Anukaran |
ration dealers bribe danda in suryapet
X

దిశ ప్రతినిధి, మెదక్ : రేషన్ డీలర్ల నియామకంలో ఆది నుంచి అవినీతి జరుగుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న రేషన్ షాపులలో రేషన్ డీలర్లను భర్తీ చేయాలని చెప్పగా సిద్దిపేట జిల్లాలో 74 రేషన్ డీలర్ల పోస్టులు ఖాళీ ఉన్నట్టు రెవెన్యూ అధికారులు గుర్తించారు. కానీ 44 షాపులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించారు. వాటికి సంబంధించి నేడు పరీక్ష నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో డీలర్ పోస్టుల పరీక్ష రాసేందుకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రేషన్ డీలర్ల భర్తీ ఇప్పటికే పూర్తయ్యిందని, కేవలం ఫార్మాల్టీ కోసం రికార్డుల్లో నమోదు చేసుకునేందుకు పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

జిల్లాలో 74 డీలర్ల భర్తీకి నోటిఫికేషన్…

జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల నియామక ప్రక్రియను త్వరలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు ముగ్గురు ఆర్డీవోలు జిల్లాలో పలు కారణాలతో 74 ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. ఆర్డీవోలు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట డివిజన్ పరిధిలో 32, గజ్వేల్ డివిజన్ పరిధిలో 17, హుస్నాబాద్ డివిజన్ పరిధిలో 25 ఖాళీలు, మొత్తం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 74 డీలరు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో ఖాళీగా ఉన్న 74 షాపులకు రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉన్న ఆర్డీవోలు మాత్రం 44 షాపులకే రిజర్వేషన్లు ప్రకటించారు. సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 32 షాపులకు గాను 19 షాపులకు రిజర్వేషన్లు ప్రకటించారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 25 షాపులకు 12 మాత్రమే ప్రకటిచారు. ఇక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 17 షాపులకు గాను 13 షాపులకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఇంకా 30 షాపులకు రిజర్వేషన్లు కేటాయించలేదు. దీనిపై గతంలోనే విమర్శలు వెల్లువెత్తాయి.

పేరుకే డీలర్ల భర్తీ…

రేషన్ డీలర్ల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే డీలర్ల భర్తీ ప్రక్రియలో ఫైరవీలదే పైచేయిగా నిలిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల భర్తీ ఇప్పటికే పూర్తయ్యిందని, పేరుకు దరఖాస్తుల స్వీకరణ, ఇంటర్వ్యూలు, పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న వారికే రేషన్ షాపులను అధికారులు కేటాయించినట్టు గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల ప్రకారం అధికార పార్టీ నాయకులు తమకు లేదా వారి కుటుంబ సభ్యులకు రేషన్ షాపు వచ్చేలా ఫైరవీలు చేశారని, ఒక్కో రేషన్ షాపు కోసం సుమారు రూ.రెండు, మూడు లక్షలు వెచ్చించినట్టు సమాచారం. దీనిపై అధికారులకు వివరణ కోరగా అలాంటిదేమి లేదని, అది పూర్తిగా అవాస్తవమని, రేషన్ డీలర్ల నియమాల ప్రకారం పరీక్షలో ఉత్తీర్ణులై అన్ని అర్హతలు కల్గిన వారినే ఎంపిక చేస్తామని చెబుతున్నారు.

పరీక్ష వాయిదా …

రేషన్ డీలర్ల ఎంపిక కోసం నిర్వహించాల్సిన పరీక్షల్లోనూ గందరగోళం నెలకొంది. ముందస్తు సమాచారం అందక వర్షంలో నానుతూ.. తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్ల ఎంపిక కోసం సిద్దిపేట టీటీసీ భవనంలో పరీక్ష నిర్వహిస్తామని ఆర్డీవో అనంతారెడ్డి తెలిపారు. మళ్లీ ఆదివారం సాయంత్రం టీటీసీ భవనంకు బదులు కొండా భూదేవిలో నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం మరోమారు వర్షం కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. విషయం తెలియని కొందరు మొదట టీటీసీ భవన్‌కు వెళ్లారు. అక్కడ కాదని తెలుసుకున్న వారు కొండా భూదేవి గార్డెన్ కు చేరుకున్నారు. వర్షం కారణంగా నేటి పరీక్ష రద్దు చేశామని అక్కడి అధికారులు చెప్పడంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నానా ఇబ్బందులు పడుతూ ఇక్కడకు వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చాక పరీక్ష లేదని చెప్పడమేంటని అధికారులను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా ‘దిశ’తో రేషన్ డీలర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ దివ్యాంగుడి తల్లి మాట్లాడారు. తాము సిద్దిపేట పట్టణానికి చెందిన వారమని, తమ అబ్బాయి పూర్తిగా వికలాంగుడని తెలిపారు. రేషన్ డీలర్ల ఎంపిక పరీక్ష ఉందని కష్టపడి ఆటోలో తీసుకొచ్చానని, తీరా ఇక్కడికి వచ్చాక పరీక్ష లేదని చెప్పారని వెల్లడించారు. రెవెన్యూ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తాము చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed