- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధర్మానికి.. అధర్మానికి సంగ్రామం.. ఈటల రాజేందర్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు
దిశ ప్రతినిధి, వరంగల్: తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో తన వైపున యుద్ధం చేయడానికి అన్యాయానికి గురైన ప్రైవేటు టీచర్లు, ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ యువత, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన విద్యార్థి సంఘాల నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 20 ఏళ్ల నాటి కమలాపూర్ నియోజకవర్గం నుంచి నేటి హుజురాబాద్ నియోజకవర్గం దాకా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావని ప్రజలు తనకు కలిసి చెబుతున్నారని అన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించి కేసీఆర్‌కు బుద్ధి చెబుతామంటూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత సోమవారం తొలిసారిగా ఈటల నియోజకవర్గానికి రావడంతో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. కమలాపూర్ మండలంలోని శంభునిపల్లె నుంచి మొదలైన బైక్ ర్యాలీలో వేలాది మందిలో ఈటల అభిమానులు పాల్గొన్నారు. అభిమాని బైక్‌పై కూర్చున్న ఈటల కానిపర్తి మీదుగా తన స్వగ్రామం కమలాపూర్‌కు చేరుకున్నారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.
హుజురాబాద్‌లో కురుక్షేత్రమే…
తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువుగా పనిచేసింది. ఆ కరీంనగర్ కేంద్రంగా సాగిన ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, ఉద్యమాన్ని కాపాడుకున్న నియోజకవర్గం నాటి కమలాపూర్..నేటి హుజురాబాద్ అంటూ ఈటల రాజేందర్ గుర్తుచేశారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి ఆత్మగౌరవ పోరాటానికి బయల్దేరిన తనకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని అన్నారు. ఎత్తిన జెండా..ఎగిసిన పిడికిలిని బిగపట్టుకుని నడవు బిడ్డా… మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటది… ఇవాళ డబ్బు విజయం సాధించద్దు.. దౌర్జన్యం విజయం సాధించదు… అధర్మం విజయం సాధించదు..కేసీఆర్ విజయం సాధించడు… తప్పకుండా మళ్లీ నీకే విజయం కట్టబెడుతాం బిడ్డా అంటూ జనం తనను నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని ఈటల అన్నారు. తన రాజీనామా తర్వాత హుజురాబాద్‌లో జరిగబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని అన్నారు. ధర్మానికి అధర్మానికి సంగ్రామం జరగనుంది… ఇదొక కురుక్షేత్రంలా ఉంటుంది..కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంది.. ఈ హుజురాబాద్‌లో జరిగే యుద్ధ సంగ్రామంలో.. ఇవ్వాళ 20సంవత్సరాల పాటు గులాబీ జెండా ఎత్తుకుని భంగపడ్డవాళ్లు, అవమానాలకు గురైనవాళ్లు, ఏమి చెందకుండా ఉండిపోయినవాళ్లంతా కూడా తప్పకుండా హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి గడపడకు వచ్చి అన్యాయాన్ని వివరిస్తారని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థిలోకం, ప్రైవేటు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు,శ్రామికులు, నిరుద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఎవరికివారుగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఎవరికి వారుగా పనిచేస్తారని అన్నారు.
వాళ్లు తొత్తులు.. బానిసలు
కొద్దిమంది వ్యక్తులు కేసీఆర్ కుటుంబానికి తొత్తులుగా మారిపోయి.. బానిసలుగా మారిపోయి.. మా నాయకుల మీద.. మా ప్రజల మీద అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఖబడ్దార్ మీరు అని వారిని హెచ్చరిస్తున్నా..! మీరు ఎవరో ఇచ్చిన స్క్రీఫ్ట్ పట్టుకుని మామీద నిందలు వేస్తే, మా ప్రజలను అవమానిస్తే మీలాంటి నేతలను రాజకీయంగా బొందపెట్టి తీరుతామని అన్నారు. ఆనాటి తెలంగాణ ఉద్యమానికి కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభ ఎలా తొలిపలుకు పలికిందో…తొలి పిడికిలి ఎత్తిందో..!ఇవ్వాళ ఆత్మగౌరవ పోరటానికి, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం,అణిచివేత నుంచి ప్రజలను ముందుకు నడపడం కోసం మళ్లీ హుజురాబాద్ ఉద్యమక్షేత్రంగా ఉండబోతోందని అన్నారు. హుజురాబాద్ నుంచే మరోక ఉద్యమానికి నాంది పలుకుతుందని అన్నారు. ఈ హుజరాబాద్ గెలుపే.. తెలంగాణ ప్రజానీకం ఆత్మగౌరవ గెలుపు కాబోతోందన్నారు. పిడికెడు మంది అబద్దాల కోరుల విజయం సాధించబోరని అన్నారు. ఎన్నంటికైనా… ఎప్పటికైనా ఈ ప్రాంత ప్రజలకు తానే అండగా ఉంటానని అన్నారు. తనకు మద్దతు తెలుపుతున్న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజానీకానికి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఆడబిడ్డలకు చేతులెత్తి చెబుతా ఉన్నా.. మీ కాళ్లకు దండపెట్టి చెబుతా ఉన్నా..మీరు మెచ్చిన ఈబిడ్డా మీ ఆత్మగౌరవం నింపే ప్రయత్నం చేస్తాడని చెబుతున్నాని అన్నారు.