పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది

by Shyam |
పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుంది
X

దిశ, నల్లగొండ: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వంగపల్లి, చిన్న కందుకూరు, శారాజీ పేట గ్రామంలో విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ మహేందర్ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. కోనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం భారత దేశానికి ధాన్య గారంగా మారుతుందన్నారు. ఈ సీజన్‌లో కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని, దేశంలోనే ఇది రికార్డు అని వెల్లడించారు. సీఎం కేసీఆర్ అనుక్షణం ధాన్యం కొనుగోళ్లను మానిటరింగ్ చేస్తూ, రూ.30 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చి రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం,పెండింగ్ ప్రాజెక్టులను, కాళేశ్వరాన్ని పూర్తి చేసి సాగునీరు అందించడం వల్లే రైతులు ఈ సారి బంగారం పండించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలు చిల్లర ఆరోపణలు చేయడం సరికాదని పల్లా రాజేశ్వర్ రెడ్డి హితవు పలికారు.

tags: crop, purchasing center, agriculture state chairman palla rajeshwar reddy

Advertisement

Next Story

Most Viewed