- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలు క్లోజ్..
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గుముఖం పడుతోంది. గత ఇరవై రోజులుగా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాలన్నింటినీ మూసివేసింది. అనుమానితులంతా ఇకపైన ‘హోమ్ క్వారంటైన్’లోనే ఉండనున్నారు. ప్రస్తుతం 535 పరీక్షలకు రిపోర్టు రావాల్సి ఉన్నందున రెండు రోజుల పాటు పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 453కు చేరుకుంది. ప్రస్తుతం 397 మంది యాక్టివ్ పాజిటివ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం నగరంలోని కింగ్ కోఠి, ఛెస్ట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లు డిశ్చార్జి కావడంతో ఒక్క గాంధీ ఆసుపత్రిలో మాత్రమే కరోనా పేషెంట్లు ఉంటారు. ఇకపైన వచ్చే కొత్త కేసులన్నీ ఆ ఆసుపత్రికే వెళ్ళనున్నాయి. నాలుగైదు రోజుల తర్వాత రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని, ఆ తర్వాత వారం రోజులకు పరిస్థితి మొత్తం సద్దుమణుగుతుందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
విదేశీ ప్రయాణం ముగించుకుని వచ్చినవారికి ప్రభుత్వం ఇప్పటిదాకా విధించిన క్వారంటైన్ గడువు ముగిసిందని, అందరూ ఇళ్ళకు వెళ్లిపోయారని, అక్కడే ‘హోమ్ క్వారంటైన్’లో ఉంటారని, దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ కేంద్రాలన్నింటినీ మూసివేస్తున్నట్లు మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు సుమారు 1100 మందికిపైగా ఉన్నారని, వారితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులోకి వెళ్ళిన మొత్తం 3152 మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పరీక్షలు చేశామని, అనుమానితులను ఐసొలేషన్ వార్డులకు, పాజిటివ్ పేషెంట్లను ఆసుపత్రులకు తరలించామని, మరో 535 మంది పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. రెండు రోజుల్లో అవి కూడా వస్తే ప్రభుత్వానికి మరింత స్పష్టత వస్తుందని, ఆ తర్వాత క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని, లాక్‌డౌన్ పీరియడ్ ముగిసేనాటికి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయన్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న మర్కజ్ సంబంధిత అనుమానితులను ఇకపైన హోమ్ క్వారంటైన్‌లోకి పంపుతున్నామన్నారు.
అయినా జాగ్రత్తగానే ఉంటాం
మర్కజ్ వ్యవహారంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని, ఇప్పటిదాకా 95% మందికి పైగానే గుర్తించి పరీక్షలు చేశామని, పెండింగ్‌లో ఉన్న రిపోర్టులు కూడా వస్తే ఇక పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం లేదని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటిదాకా మర్కజ్‌తో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారిలో 200 మందికి పాజిటివ్, పరోక్షంగా (కాంటాక్టు ద్వారా) సంబంధం ఉన్న వంద మందికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. ఈ వారం రోజుల వ్యవధిలో సుమారు 3500 మంది వైద్యారోగ్య శాఖ సిబ్బది రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని సుమారు 65 వేల ఇళ్ళలోని మూడున్నర లక్షల మందికి హెల్త్ సర్వే నిర్వహించింది. మరో వారం రోజుల పాటు రాష్ట్రంలో ఇప్పటిదాకా గుర్తించిన సుమారు 125 హాట్ స్పాట్‌లలో ఈ సర్వేను కొనసాగించనుంది. దీని గురించి మంత్రి స్పందిస్తూ 80 హాట్ స్పాట్‌లలో హెల్త్ సర్వే జరిగిందని వివరణ ఇచ్చారు. ఇంత భారీ స్థాయిలో హెల్త్ సర్వే జరిగింది కాబట్టి ఇకపైన కొత్త కేసులు రావడం గణనీయంగా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.
అయినా మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామని, అనుమానితుల సంఖ్య పెరిగినా వెంటనే చికిత్స ప్రారంభించడానికి వీలుగా గచ్చిబౌలి స్టేడియంలో 1500 బెడ్‌లతో ఐసోలేషన్ వార్డులను, ఐసీయూ వార్డులను పదిహేను రోజుల వ్యవధిలోనే సిద్ధం చేశామని, దీనికి అదనంగా రాష్ట్రంలోని మొత్తం 22 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని సుమారు 15,080 బెడ్‌లను కూడా రెడీగా ఉంచుకున్నట్లు తెలిపారు. మందులకు కూడా కొరత లేదని, సుమారు రూ. 400 కోట్లతో అందుబాటులో ఉంచామన్నారు. పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్), ఎన్-95 మాస్కులు, గ్లౌజులు తదితరాలకు కూడా ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర సుమారు 80 వేల పీపీఈలు, లక్ష దాకా ఎన్-95 మాస్కులు ఉన్నాయని తెలిపారు. మరో ఐదు లక్షల పీపీఈలు, మాస్కులకు ఆర్డర్ ఇచ్చామని, త్వరలోనే అవి కూడా సమకూరుతాయన్నారు. రెగ్యులర్‌గా వాడే సాధారణ మాస్కులను సుమారు రెండు కోట్లు, కోటి గ్లౌజులను, ఐదు లక్షల గాగుల్స్, మూడున్నర లక్షల కరోనా టెస్టింగ్ కిట్లను సమకూర్చుకుంటున్నామని మంత్రి తెలిపారు. పీపీఈలు, మాస్కుల ధర ఎక్కువైనా ప్రభుత్వం సమకూర్చుకుంటోందన్నారు.
కరోనా పేషెంట్లలో 80 మంది మహిళలు
ప్రస్తుతం (ఏప్రిల్ 7వ తేదీ రాత్రి వరకు) వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషెంట్లలో 80 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నారు. మృతుల్లో హెచ్చుశాతం మంది అరవై ఏళ్ళ వయసుకు పైబడినవారే అయినప్పటికీ పాజిటివ్ పేషెంట్లలో మాత్రం ఈ వయసులోనివారు దాదాపు యాభై మంది మాత్రమే ఉన్నారు. పన్నెండేళ్ళలోపువారు 15మంది, 22 ఏళ్ళలోపువారు 39 మంది, 32 ఏళ్ళలోపువారు 92 మంది, 42 ఏళ్ళలోపువారు 79 మంది, 52 ఏళ్ళలోపువారు 76 మంది, అరవై ఏళ్ళలోపువారు 50 మంది చొప్పున ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కరోనా బారిన పడ్డారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 70% మంది మర్కజ్‌తో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్నవారే. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు (నారాయణపేట, వనపర్తి, భువనగిరి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్ రూరల్) మినహా మిగిలిన పాతిక జిల్లాల్లో కరోనా వైరస్ ఉంది. పాజిటివ్ పేషెంట్లు కింగ్ కోఠి, నిమ్స్, నీలోఫర్, ఛెస్ట్, నిజామియా, నేచర్ క్యూర్ తదితర ఆసుపత్రులతో పాటు గద్వాల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లా ఆసుపత్రుల్లోనూ చికిత్స పొందుతున్నారు.
Tags: Telangana, Corona, Markaz, Positive, PPE Kits, N95 Masks, HotSpots, Health Survey