Sanjay Raut: ఇండియా కూటమిలో సమన్వయం లేదు.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Sanjay Raut: ఇండియా కూటమిలో సమన్వయం లేదు.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay raut) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో సమన్వయం లోపించిందని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఒక్క సమావేశం కూడా జరగలేదని, భాగస్వామ్య పార్టీల మధ్య చర్చలు ఆగిపోతే ఏ కూటమి కూడా విజయం సాధించబోదని సూచించారు. సోమవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. కూటమిలోని పార్టీల మధ్య చర్చలు జరపడానికి బాధ్యతాయుతమైన నాయకులను నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలయెన్సులో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ఈ పాత్రను పోషించాలని తెలిపారు.

సంకీర్ణ భాగస్వామ్య పక్షాలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయడంలో తప్పేమీ లేదని, అయితే అలాంటి సందర్భాల్లో ఏ పార్టీ కూడా తమ మాజీ మిత్రపక్షాలను ద్రోహులుగా అభివర్ణించొద్దని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో దాదాపు 30 పార్టీలు ఉన్నాయని, వాటన్నింటితో చర్చలు కొనసాగించడానికి ప్రయత్నించాలన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయాన్ని పదేపదే నొక్కిచెప్పారని, ఇతర సీనియర్ నేతలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశ రాజకీయాల్లో కూటమి మెరుగైన పనితీరు కనబరిచిందని, దీనిని ఇలాగే కొనసాగించాలని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలని నొక్కి చెప్పారు.

Next Story

Most Viewed