హైదరాబాద్‌లో లాల్ బహద్దూర్ శాస్త్రీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏర్పాటు

by Shyam |
Vinod Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో త్వరలో లాల్ బహద్దూర్ శాస్త్రీ నైపుణ్య అభివృద్ధి సంస్థ (స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ) ఏర్పాటు కాబోతుంది. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక ఐటీఈ సంస్థ, ఢిల్లీలోని మాజీ ప్రధాని లాల్ బహద్దూర్ శాస్త్రీ ట్రస్ట్‌లు సంయుక్తంగా ఈ ఇనిస్టిట్యాట్‌ను నిర్వహించనున్నాయి. లాల్ బహద్దూర్ శాస్త్రీ కుమారుడు అనిల్ శాస్త్రీ ఈ సంస్థను నెలకొల్పేందుకు ముందకు వచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం బీఆర్‌కే భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, అనిల్ శాస్త్రీ భేటీ అయ్యారు.

జాతీయ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అనిల్ శాస్త్రీ ముందుకు రావడం పట్ల సోమేశ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా వివిధ కోర్సులను ఈ జాతీయ సంస్థ నిర్వహించనుందని అనిల్ శాస్త్రీ తెలిపారు. అందుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైన ప్రాంతంగా తాము గుర్తించామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇనిస్టిట్యూట్ ను నెలకొల్పేందుకు అనిల్ శాస్త్రీ ముందుకు రావడం హర్షించదగిన విషయమని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed