స్తంభంపల్లిలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ.. స్థలం పరిశీలన

by Sridhar Babu |
Koppula111
X

దిశ, వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 1090లో గల స్థలాన్ని క్రిశాంత్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్ కో) చైర్మన్, డైరెక్టర్లు, వైస్ చైర్మైన్ లతో కలిసి మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఇథనాల్, రైస్ బ్రాన్ ఆయిల్ తయారీ పరిశ్రమలను నెలకొల్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 700 కోట్లు కేటాయించిందని అన్నారు. ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి గ్రామ శివారులో 1090 సర్వే నెంబర్ లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైనంత ప్రభుత్వ భూమి ఉండడంతో ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొరకు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇక్కడ గుర్తించినట్లు వివరించారు. తొందరలోనే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనునట్లు తెలిపారు.

అనంతరం క్రిబ్ కో చైర్మన్ డా చంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ దేశంలో గల 3 ప్రదేశాలు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నంతో పాటుగా తెలంగాణలో ప్రభుత్వం సూచించిన వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లిలో ఏర్పాటు చేయన్నామని పేర్కొన్నారు. రూ. 700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని తెలిపారు. ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నూకలు, చెడిపోయిన బియ్యం, మక్కలను ప్రతి సంవత్సరం కొనుగోలు చేయనున్నట్లు వివరించారు. ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రజలందరూ స్వాగతించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి. రవి, కంపెనీ ప్రతినిధులు డా. సునీలకుమార్ సింగ్, డా.బిజేంద్రసింగ్, పొన్నం ప్రభాకర్, వి.ఎస్.ఆర్.రెడ్డి, రాంరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,‌ ఆర్డీఓ మాధురి, సర్పంచ్ రూపారాణి, ఎంపీటీసీ సతీష్, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జెడ్పీటీసీ బి. సుధారాణి, నాయకులు ఏలేటి కృష్ణారెడ్డి, గూడా రాంరెడ్డి, సింహాచలం జగన్, జూపాక కుమార్, చల్లూరి రాంచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed