పేదలు ‘ఆకలి’తో చనిపోవాలా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Anukaran |
పేదలు ‘ఆకలి’తో చనిపోవాలా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : లాక్‌డౌన్ అమలవుతున్న కాలంలో పేదలు ఆకలితో చనిపోవడానికి వీల్లేదని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్జీవో సంస్థలను కలుపుకుపోతూ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆహార పదార్ధాలను సరఫరా చేయాలని, ప్రతీ జిల్లాలో కమ్యూనిటీ కిచెన్‌లను ఏర్పాటు చేయాలని, ఆయా జిల్లాల అధికారిక వెబ్‌సైట్‌లలో కమ్యూనిటీ కిచెన్ వివరాలను డిస్‌ప్లే చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి ఆదేశించారు.

కరోనాకు సంబంధించి దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి సోమవారం విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ వ్యాక్సిన్ ప్రక్రియకు సంబంధించి సమగ్రమైన నివేదికను జూన్ 1వ తేదీకల్లా సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో లభ్యమవుతున్న బెడ్‌ల సమాచారం వెబ్‌సైట్‌లో ఒక రకంగా ఉంటే వాస్తవిక పరిస్థితి దానికి భిన్నంగా ఉందంటూ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నట్లుగానే తెలంగాణలో సైతం వ్యాక్సిన్ కేంద్రాల్లో మాత్రమే కాక డ్రైవ్-ఇన్ (వాహనాల్లో వెళ్తున్నవారికి) పద్ధతిలో కూడా టీకాలు ఇవ్వాలని ఆదేశించింది. వృద్ధులు, పేదలు, నిరాశ్రయులకు కచ్చితంగా వ్యాక్సిన్ అందేలా ఎన్జీవోల సహకారాన్ని తీసుకోవాలని సూచించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అందరికీ వ్యాక్సిన్ అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తానికే ఆపేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు బెంచ్ దృష్టికి తీసుకురాగా ఇప్పటివరకు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ ఎంత మందికి ఇచ్చారో పూర్తి వివరాలను నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుతో పాటు ముగ్గురు పోలీసు కమిషనర్లు కూడా హాజరయ్యారు.

కరోనా పాజిటివ్ లేకపోయినప్పటికీ ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి ఐదు ఆస్పత్రుల్లో వైద్యం అందక చివరికి చనిపోయిన సంఘటనతో పాటు ఆమె అంత్యక్రియలకు ఎదురైన ఆటంకాలు, తల్లినీ బిడ్డను వేరు చేయాలన్న అంశానికి సంబంధించి ప్రభుత్వం సమగ్రమైన నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఆస్పత్రి సైతం ఆమెను చేర్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో విధి నిర్వహణలో ఉన్న సుమారు 500 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకిందని, పదిహేను మంది చనిపోయారని పిటిషనర్ లేవనెత్తిన వాదనపై స్పందించిన హైకోర్టు వారిని కరోనా వారియర్లుగా గుర్తించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వం గతేడాది జారీ చేసిన జీవోలో నిర్దేశించిన విధంగా కాకుండా అధికమొత్తంలో ఛార్జీలు వసూలు చేయడాన్ని తప్పు పట్టిన హైకోర్టు.. గతేడాది ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ అధికారులతో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, టాస్క్ ఫోర్స్ కమిటీ చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేసింది.

లాక్‌డౌన్ అమలవుతున్నా సడలింపుల సమయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలేదని, ప్రజలు కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడంలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లాక్‌డౌన్, నైట్ కర్ప్యూ సమయాల్లో ప్రభుత్వం మాస్కులు లేనివారిపై 3.39 లక్షల కేసుల్ని నమోదు చేసిందని, సోషల్ డిస్టెన్స్ పాటించనందుకు 22,560 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ తన నివేదికల పేర్కొన్నారు. సుమారు రూ. 31 కోట్ల మేర జరిమానా రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు. బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు మందుల్ని అమ్ముతున్నవారిపై 98 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed