శవం పువ్వుల వాసన కోసం అమెరికన్ల ఆరాటం..

by vinod kumar |   ( Updated:2021-05-20 02:22:50.0  )
Rare corpse flower
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా సువానన గల పుష్పాల పరిమళాన్ని ఎక్కువ సేపు ఆస్వాదిస్తేనే తల తిరిగినట్లు ఉంటుంది. అలాంటిది కుళ్లిపోయిన శవాల తరహా కంపును పీల్చుకునే సాహసం చేస్తామా? కానీ అమెరికన్లు మాత్రం అంతకంటే దారుణమైన దుర్వాసన గల పుష్పాన్ని దగ్గరి నుంచి చూసేందుకు గంటల తరబడి లైన్‌లో నిలబడుతున్నారు. ఆ పువ్వు విశేషాలేంటో మీరూ తెలుసుకోండి..

‘ఆమార్ఫఫాలస్ టైటానియం’ అనే శాస్త్రీయ నామం గల మొక్క.. ఏడు నుంచి పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. దీనినే శవం పువ్వు(కార్ప్స్ ఫ్లవర్) అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్కలు 1000 కంటే తక్కువ సంఖ్యలోనే ఉన్నందున వీటిని అరుదైన పుష్పాలుగా పరిగణిస్తారు. అందుకే ఇవి వికసించినపుడు చూసేందుకు ఫ్లవర్ లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో కాలిఫోర్నియా సిటీకి చెందిన నర్సరీ ఓనర్ లేవ్యా.. ఈ సారి కార్ప్స్ ఫ్లవర్ పుష్పించే అవకాశం ఉందని తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు ఆసక్తి ఉన్నవారికి ఆ పువ్వును చూపించే అవకాశం కల్పించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆ పుష్పాన్ని నర్సరీ నుంచి అల్మెడలోని ఓ నిషిద్ధ భవనానికి తరలించి ప్రదర్శనకు ఏర్పాటు చేసింది.

ఈ అరుదైన పువ్వు విషయానికొస్తే.. వాంతులు చేసుకుంటే వెలువడే వాసనకు వెయ్యి రెట్లు సమానమైన లేదా కుళ్లిపోయిన శవం కంపుతో గుర్తింపు పొందింది. అయితే ఇంతకుముందు శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ పువ్వును ప్రదర్శనకు ఉంచినపుడు బారియర్స్‌తో ప్రొటెక్ట్ చేయడం వల్ల చాలా మంది విజిటర్లు దగ్గరి నుంచి చూడలేకపోవడంతో పాటు గంటల తరబడి లైన్‌లో వెయిట్ చేయాల్సి వచ్చింది. కాగా ఈసారి ప్రతి ఒక్కరికీ పువ్వు దగ్గరగా వెళ్లి వాసన చూసే అవకాశాన్ని కూడా కల్పించాలని అనుకుంటున్నట్టు నర్సరీ యజమాని లేవ్యా వెల్లడించింది.

దాదాపు 12 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ అరుదైన ఫ్లవర్.. పుష్పించే రోజుల్లో పరాగ సంపర్క ప్రక్రియలో భాగంగా ఈ రకమైన దుర్గంధభరిత వాసనను రిలీజ్ చేస్తుంది. అయితే పుష్పించిన కొద్దిరోజుల్లోనే ఈ మొక్కలు చనిపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed