ఈటల ఎపిసోడ్‌లో కీలక ఘట్టం.. పెద్దిరెడ్డి మదిలో పజిల్..!

by Anukaran |
ఈటల ఎపిసోడ్‌లో కీలక ఘట్టం.. పెద్దిరెడ్డి మదిలో పజిల్..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి వ్యవహారం లోగుట్టు పెరుమాళ్లకెరుక అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు వ్యవహరిస్తున్న తీరుకు పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతున్న తీరుకు పొంతన లేకుండా పోతోందని తెలుస్తోంది. దీంతో పెద్దిరెడ్డి మదిలో ఏముంది అన్నదే పజిల్‌గా మారిపోయింది. హుజురాబాద్ ఇన్‌చార్జీగా కూడా చెప్పుకుంటున్న పెద్దిరెడ్డికి అలాంటి బాధ్యతలు ఇవ్వలేదని, కేవలం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునిగా మాత్రమే ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

అయితే ఈటల ఎపిసోడ్ తరువాత పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తనతో సంప్రదింపులు జరపకుండా ఆయనను ఎలా చేర్చుకుంటారని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీలో రాజేందర్ చేరిక విషయంలో ముసలం మొదలైందన్న ప్రచారం జరిగింది. కానీ అంతర్గతంగా జరిగిన పార్టీలో జరిగిన చర్చల్లో మాత్రం తాను అలా మాట్లాడలేదని మీడియానే హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకొచ్చారని తెలుస్తోంది. ఒకే సమయంలో ఈటల రాజేందర్, పెద్దిరెడ్డిలు ఇద్దరూ కూడా హుజురాబాద్‌లోనే పర్యటిస్తున్నారు. ఒకరినొకరు కలవడం కానీ, కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇద్దరూ చేయలేదు. దీంతో పెద్దిరెడ్డి బీజేపీలో ఉన్నారా లేదా అన్నదే పార్టీ వర్గాల్లో ఇప్పుడు సాగుతున్న చర్చ.

డీకే రాయబారం ఫలించలేదా..?

ఈటల రాజేందర్ చేరికపై స్పష్టత వచ్చిన తరువాత పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర కమిటీ కొంత సీరియస్‌గానే పరిగణించింది. దీంతో జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్వయంగా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆ తరువాత టీ కప్పులో తుపానులా ఈ వ్యవహారం సద్దుమణిగిందని భావించారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం తనలోని నైరాశ్యాన్ని పరోక్షంగా బయటపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. చాలా కాలం తరువాత హుజురాబాద్‌కు వచ్చిన పెద్దిరెడ్డి తన సన్నిహితులను కలుస్తున్నారు తప్ప బీజేపీ కేడర్‌తో అంతగా టచ్‌లో ఉండడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగతంగా కలుస్తుండడంతోనే సరిపెడ్తున్న ఆయన పార్టీ కార్యకలాపాల్లో మాత్రం పాల్గొనడం లేదు.

ఫిర్యాదు చేశారా..?

అయితే ఈటల విషయంలో గుర్రుగా ఉన్న పెద్దిరెడ్డి అధిష్టానం తనకు అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హుజురాబాద్‌లో ప్రకటించారు. కానీ, ఈటల విషయంలో అయినా, తనకు సంబంధం లేకుండా జరుగుతున్న పరిణామాల గురించి అయినా అధిష్టానానికి మాత్రం ఫిర్యాదు చేయలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పెద్దిరెడ్డి వ్యూహం ఏంటన్నదే అంతుచిక్కకుండా తయారైంది. ఒక వేళ రాష్ట్ర పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు ఆయనకు అన్యాయం జరిగినట్టుగా ఉన్నట్టయితే జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది కదా అన్నదే పార్టీ వర్గాల చర్చ. పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో వివేక్ తమను పక్కనపెడ్తున్నారన్న విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించడం గమనార్హం. పెద్దిరెడ్డి కూడా ఇదే విధంగా కంప్లైంట్ చేయవచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారే లేకపోలేదు.

గులాబీ పంచన చేరేనా..?

హుజురాబాద్ నుంచి రెండుసార్లు గెలిచి మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగుతోంది. ఆయనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే హరీష్ రావుతో చర్చలు జరిపిన పెద్దిరెడ్డి ఎలాంటి కండిషన్స్ లేకుండానే పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారని కూడా లీకులు వచ్చాయి. కానీ పెద్దిరెడ్డి మాత్రం అలాంటిదేమీ లేదని చెప్తున్నారు. దీంతో ఆయన కమలంలోనే ఉంటారా..? లేక గులాబీ వనంలో చేరుతారా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.

ఆ పార్టీలో చేరుతారా..?

2001లో కరీంనగర్‌లో సింహ గర్జన పెట్టిన మరునాడే మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ వీఆర్ఎస్ అవుతుందని ఆయన చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి. వీఆర్ఎస్‌గా మారుతుందన్న టీఆర్ఎస్ పార్టీలో పెద్దిరెడ్డి చేరుతారా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Advertisement

Next Story

Most Viewed