ఆ దేశాల టూర్స్ రద్దు.. పాక్‌లో ఇక క్రికెట్ మ్యాచ్‌లు చూడలేమా.?

by Shyam |   ( Updated:2021-09-21 01:52:24.0  )
ఆ దేశాల టూర్స్ రద్దు.. పాక్‌లో ఇక క్రికెట్ మ్యాచ్‌లు చూడలేమా.?
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. పాక్‌లో ఇతర దేశాలతో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ కష్టంగానే ఉండబోతోంది. ఇప్పటికే న్యూజిలాండ్ రావల్పిండిలో తొలి వన్డేకు ముందు మ్యాచ్ ఆడమని హఠాత్తుగా వైదొలగిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాలతో ఏకంగా టూర్‌ రద్దు చేసుకున్న విషయం విదితమే.

ఆ షాక్ నుంచి తెరుకోకముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మరో బాంబ్ పేల్చింది. అక్టోబర్ నెలలో పాకిస్తాన్‌‌తో జరిగే పురుషులు, మహిళల జట్ల పర్యటనలను భద్రతా కారణాలతో రద్దు చేసుకుంటున్నట్టు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చేనెల 14, 15 తేదీల్లో పాకిస్తాన్‌తో రెండు టీ20ల్లో ఇంగ్లండ్‌ పురుషుల జట్టు తలపడాల్సి ఉంది. ఇక మహిళల జట్టు రెండు టీ 20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ పరిణామాలతో పాకిస్తాన్‌ పెట్టుకున్న ఆశలన్నీ మరోసారి ఆవిరయ్యాయి.

ఎందుకు భయపడుతున్నారు..

పాకిస్తాన్‌లో మ్యాచ్‌లు ఆడటానికి ఇతర దేశాల క్రికెటర్లు ఎందుకు భయపడుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ జట్టుకు చాలా ఏళ్లుగా ప్రాతినిధ్యం వహించాడు. అతడికి క్రికెట్ వ్యవహారాల్లో పూర్తి అనుభవం ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు భద్రతా కారణాలు సాకుగా చూపి ఏకంగా సిరీస్ లనే రద్దు చేసుకున్నాయి.

అతడు రంగంలోకి దిగి ఎందుకు క్రికెట్ వ్యవహారాలను చక్కబెట్టలేకపోతున్నాడని క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. భద్రత కల్పించలేకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. భద్రత కల్పిస్తామని చెప్పినా ఇతర దేశాల క్రికెట్ బోర్డులు అతడి మాటలు నమ్మక ఏకంగా టూర్ లనే రద్దు చేసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా అప్ఘనిస్తాన్‌లో జరిగే అల్లర్లే దీనికి కారణమా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed