ఆ క్రికెటర్లు ఐపీఎల్‌కు లేట్‌‌గా వస్తారు..

by Shiva |   ( Updated:2020-07-26 07:32:29.0  )
ఆ క్రికెటర్లు ఐపీఎల్‌కు లేట్‌‌గా వస్తారు..
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు ఆలస్యంగా వచ్చి చేరతారని తెలుస్తున్నది. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుండగా, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 16 వరకు జరగనుంది. వాళ్లు యూఏఈ చేరుకున్న తర్వాత వైద్య పరీక్షల కోసం సమయం పడుతుంది. దీంతో ఆటగాళ్లు తమ ఫ్రాంచైజీల్లో చేరడానికి ఒక వారం ఆలస్యం కావొచ్చని తెలుస్తున్నది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే సెప్టెంబర్ 16న జరుగనుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే లేదా మరుసటి రోజు ఆటగాళ్లు లండన్ నుంచి దుబాయ్‌కి బయలుదేరతారు. యూఏఈలోని స్థానిక ప్రభుత్వం ఆటగాళ్లందరికీ కొవిడ్ టెస్టులు చేస్తుంది. వాటి ఫలితాలు రావడానికి కనీసం 48 నుంచి 72 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ప్రకారం.. కొంత సమయం ఆటగాళ్లు క్వారంటైన్‌లో గడపాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి 10 రోజులు పడుతుంది. కాబట్టి వీళ్లు ఐపీఎల్ ప్రారంభమయ్యాక మొదటి వారం ఫ్రాంచైజీల తరఫున ఆడటం కష్టమే.

Next Story

Most Viewed