గడ్చిరోలి అటవీ ప్రాంతంలో కాల్పుల మోత

by Sridhar Babu |   ( Updated:2020-05-17 06:26:01.0  )
గడ్చిరోలి అటవీ ప్రాంతంలో కాల్పుల మోత
X

దిశ, కరీంనగర్ :
మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మళ్లీ తుపాకుల మోత వినిపించింది. ఆదివారం పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య రెండు సార్లు ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఎస్సై, కానిస్టేబుల్ మృతిచెందగా, మరో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసుల కథనం ప్రకారం..గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కోసం క్విక్ రెస్పాన్స్ టీం ( క్యూ ఆర్టీ), సీ 60 కమెండోలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో పోలీసులకు మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. ఈ ఒక్కరోజే రెండు సార్లు ఎదురు కాల్పులు జరిగాయని గడ్చిరోలి జిల్లా పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో క్యూఆర్టీ ఎస్సై ధనాజీ హోన్మానే, సీ60 కమెండో కిషోర్ ఆత్రం ప్రాణాలు కోల్పొగా , మరో ముగ్గురు జవాన్లు రాజు పుసలి, గొంగలు ఓకష్, దసురు కురు సామిలు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.కాగా, మే 2న ఇదే అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ కీలక నేత సృజనక్క చనిపోయారు. ఆ ఘటన జరిగిన 15రోజుల్లోనే మరోసారి కాల్పుల మోత వినిపించడంతో భామ్రాఘడ్ అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలు బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed