NPS ను రద్దు చేసి తీరాల్సిందే : ఉద్యోగ సంఘాలు

by Shyam |   ( Updated:2021-06-28 06:01:44.0  )
Teachers unions
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాత పింఛను సాధనే ధ్యేయంగా దేశవ్యాప్తంగా మరోసారి సామాజిక మాధ్యమం అస్త్రంగా సమరానికి సిద్ధం అవుతున్నదని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం(సీపీఎస్టీఈఏటీఎస్) స్పష్టం చేసింది. న్యూ పెన్షన్ స్కీమ్(భాగస్వామ్య పింఛను పథకం)ను రద్దు చేసి తీరాల్సిందేనన్న ఏకైక నినాదంతో ఈ నెల30న జాతీయ స్థాయిలో సోషల్ మీడియా సాయంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తున్నాయని సంఘం పేర్కొంది. సోమవారం హైదరాబాద్‌లో ఈ మేరకు సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష, ప్రచార కార్యదర్శులు దాముక కమలాకర్, మాచన రఘునందన్, సహాధ్యక్షులు వారణాసి రామకృష్ణలు మాట్లాడుతూ.. కొత్త పెన్షన్​స్కీంలో ఉద్యోగులకు భద్రత లేకుండా పోతుందని, తిరిగి పాత పెన్షన్​విధానాన్ని కొనసాగించాలన్నారు.

ట్విట్టర్‌లో ప్రతి ఉద్యోగి తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం పాత పెన్షన్​విధానం ఆర్ధిక భారంగా చెబుతోంది. కానీ అది నిజం కాదని ఎన్నో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగ కమిటీలతో చర్చించాలని డిమాండ్​చేశారు. శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని సూచించారు. 2001 లో పెన్షన్​ఖర్చు 15 శాతం, ఇప్పటికీ అదే స్థాయిలో మాత్రమే ఉందన్నారు. ప్రభుత్వ ఆదాయంలో మార్పు వచ్చిందేమో కానీ.. మరేఇతర నష్టాలు లేవు. పాత విధానాన్ని అమలు చేస్తూ.. నష్టాల భారీన పడుతుందన్న మాట నిజమైతే ఆర్థికరంగ నిపుణులతో అధ్యయనం చేయించాలని డిమాండ్​చేశారు. నూతన పెన్షన్​విధానంలో గరిష్టంగా 15 ఏండ్లు పని చేసి రిటైరైన వారికి లభించే పెన్షన్ రూ.1500 మాత్రమే. అదే వివిధ పథకాల ద్వారా ఇచ్చే పెన్షన్లు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు ఉన్నాయని గుర్తుచేశారు.

కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి, పాత పింఛను పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ 30న దేశ వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలతో పాటు ఏకంగా 8 గంటల ఆందోళనను ట్విట్టర్ ద్వారా చేపడుతున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమం ఓ ఆయుధంగా ఉపకరిస్తుందని, సామాన్యుడి అస్త్రంగా ఉండి ప్రతి గొంతుకను గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరవేస్తోందన్నారు. అందుకే ట్విట్టర్ ద్వారా సాధ్యమైనంత మేరకు అధిక, అత్యధిక సంఖ్యలో పాత పింఛను సాధన కోసం దేశం మొత్తం ఆలోచించేలా ప్రతి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను సామాన్యుల నుంచి అమాత్యుల వరకు వివరించే సమయం ఆసన్నమైందన్నారు. 30న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్విట్టర్‌లో ఆందోళన చేపట్టాలన్నారు.

Advertisement

Next Story