మే నెల పూర్తి జీతం చెల్లించాలి: ఉద్యోగుల జేఏసీ

by Shyam |

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కోత పెట్టిన ఉద్యోగుల జీతాలు మే నెలలో పూర్తిగా చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసి చైర్మన్ కారం రవీందర్ రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత, టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల మొదటి వారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ ఉద్యోగులు పూర్తి స్థాయిలో విధులకు హాజరవుతున్నారని, రాష్ట్ర ఆదాయ పరిస్థితులు మెరుగు పడ్డాయని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ నెలలో ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఉందని, రెండు నెలలుగా ఉద్యోగులు సగం జీతంతోనే సరిపెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ నెల పూర్తి జీతంతో పాటు రెండు నెలలుగా ఆపివేసిన జీతాలు చెల్లించాలని ఉద్యోగుల తరుపున కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో మెరుగు పడిన ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగులు ఎదర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని, పవిత్ర రంజాన్ పండుగను గమనంలోకి తీసుకొని ఉద్యోగులకు మే నెల జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Next Story

Most Viewed