మంచి పుస్తకం కాదు.. మంచి మస్తకం కావాలి..

by Ravi |   ( Updated:2024-10-17 01:15:41.0  )
మంచి పుస్తకం కాదు.. మంచి మస్తకం కావాలి..
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు నారా లోకేష్ రెడ్ బుక్ యువగళంలోనూ ఎన్నికల ప్రచారంలోనూ తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. అయితే ఇప్పుడు అదే బుక్‌ని పాలనలో అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. లోకేష్‌కి పోటిగా ఒక బుక్కు పెడతానంటు ప్రకటించారు.. కానీ అసలు విషయం ఏమిటంటే ఆయన పెట్టాల్సింది మంచి పుస్తకం కాదు.. తనకు మంచి మస్తకం ఉండటం అవసరమనే విషయాన్ని మర్చిపోతున్నారు.

రెడ్ బుక్ అమలు..

నారా లోకేష్ తన పాదయాత్ర “యువగళం” విజయవంతంగా ముగించుకుని విజయనగరం పొలిపల్లి గ్రామంలో యువగళం విజయోత్సవ సభలో పాల్గొన్న సందర్బంలో యువగళం సభలో “రెడ్ బుక్” గురించి వివరణ ఇచ్చారు.“ఈ 'రెడ్ బుక్' అనేది అన్ని ప్రభుత్వ అధికారులను ట్రాక్ చేయడం, ముఖ్యంగా వైసీపీ ఆదేశానుసారం వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై, నకిలీ కేసులు పెట్టి, చట్టాన్ని అక్రమంగా అమలు చేసే చర్యలతో టీడీపీ క్యాడర్‌ను భయభ్రాంతులకు గురిచేసిన వారిపై అయా శాఖల విచారణ జరపడానికి, పాలనా పరమైన సంస్కరణలు చేపట్టటానికి మాత్రమే అని ఇది ప్రతీకార చర్యల కోసం కాదని వివరణ ఇచ్చారు. వైసీపీ కొంత కాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని వదిలి పెట్టాలా? అని ప్రశ్నించారు. రెడ్ బుక్‌లో తప్పులు చేసిన వారి పేర్లు ఉన్నాయని.. వారికి శిక్ష పడేలా చేయటం ఖాయమని స్పష్టం చేసారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలేది లేదని చెప్పడం జరిగింది. రెడ్ బుక్ విషయంలో ఊరూరూ వెళ్లి మాట్లాడతానని వివరించారు. దీనిపై ప్రజలకు హామీ ఇచ్చానన్నారు. దానికి కట్టుబడి ఉన్నానని తెలియజేశారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు మాకు మంచి తీర్పుఇచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని అంశాలపై యాక్షన్ తప్పదన్నారు. ముఖ్యంగా శాండ్, ల్యాండ్, మైన్స్, లిక్కర్ ఆధికారులను పావులుగా వాడుకొన్నారు. కొత్త ప్రభుత్వ విచారణలో ఇలాంటి ఎన్నోవిషయాలు తేటలెల్లమయ్యాయి.

మార్పు కోసమే మంచి పుస్తకం కావాలి..

పుస్తకం హస్త భూషణం అన్నారు. అనాడు స్వాతంత్ర్య సమరంలో ప్రజలను ఉత్తేజితులను చేయటంకోసం తమ ప్రసంగంలోని ఆంశాలని పొందు పరుచుకోవటానికి అనాడు నాయ కులు బుక్ వాడేవారు. నేడు నాయకులు సైతం బుక్‌కో రంగు అద్ది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అది వారికి హస్తభూషణంలా కాకుండా దూషణ నిఘంటువుగా మారిపోయింది. అదే రాజకీయ రచ్చకు దారితీసింది. ప్రతి పేజీలో పగ ప్రతీకారాన్ని వారి నుడికారంగా ఉపయోగించారు. హుందాతనాన్ని మరిచి అనైతికంగా, అమర్యాదగా సభ్య సమాజం గర్హించే విధంగా ప్రవర్తించడం వల్లే అధికారాన్ని కోల్పోయారు. నమ్మినవారే అధినేతకు వెన్నుపోటు పొడిచారు. కోటరీ నమ్ముకున్నందుకే 11 స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఢిల్లీలో ధర్నా చేసినా స్పందన నామమాత్రమే. ఈ వ్యూహం ఫలితాన్ని ఇవ్వలేదు సరికదా... పరిపక్వత లేని రాజకీయ వ్యూహంగా విశ్లేషకులు దీనిని అభివర్ణించారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయని ఆ కష్టాల నుంచే నాయకుడు అనేవారు పుడతారని మనం కూడా గుడ్ బుక్ పెడదామని కార్యకర్తలను ఉద్దేశించే తెలియజేశారు. గుడ్ బుక్ పేరుతో రాసుకోవడం మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కచ్చితంగా అందులో ఉంచుతామని తెలియజేశారు. వారికి తప్పకుండా మంచి అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేయటం వైసీపీ పార్టీ సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని తేటతెల్లమౌతోంది. ఇది శుభ పరిణామం. ఈ నేపథ్యంలో జగన్ చేసిన ప్రకటనను పరిశీలిస్తే తానే స్వయంగా పార్టీని పటిష్టపరచాలన్న సంకేతం కనబడుతుంది.

కోటరీకి అందలం..కార్యకర్తలకు దూరం...!

అయితే పార్టీ నిర్మాణానికి ఒక సలహాదారుడిని నియమించుకోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓటమిపై ఆత్మ విమర్శ చేసుకుని, గుణపాఠాలు నేర్చుకుంటే ఏ సలహాదారుడు అవసరం లేదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికీ జగన్‌ను సామాన్యులు కలవడానికి ఇబ్బందే. ఆయన కలవడానికి అపా‌యింట్‌మెంట్ లేకున్నా ఫర్వాలేదనే పరిస్థితి రావాలి. జగన్ చుట్టూ ఉన్న కోటరీనే ఆయనకు నష్టం కలిగిస్తున్నారనే అభిప్రాయం జనంలో బలంగా ఉంది. జగన్ ఒక మాస్ లీడర్ అని, ఆయన్ను జనంతో మమేకం కానివ్వకపోతే తీవ్రంగా నష్టం కలిగించిన వారవుతారనే ఆగ్రహం కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది. ఇందుకు ప్రధానంగా వైసీపీలో సమన్వయ లోపం కనిపిస్తోంది. జగన్‌ను కోరుకుంటున్న నాయకులు ఆయనకు దూరమవుతున్నారు. జగన్‌ కలవాలని కోరుకుంటున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులకు ఆయన దూరంగా ఉన్నారు. ఇద్దర్నీ కలిపే వ్యవస్థ ఏర్పడేంత వరకూ వైసీపీకి మంచి రోజులు లేనట్టే. గతంలోని తప్పిదాలను సరిజేసి ప్రతి పక్షనేతగా హుందాతనాన్ని పాటించి సకారత్మమైన విమర్శలు చెయ్యాలి. సంఖ్య ముఖ్యం కాదు, ప్రతిపక్షంగా శాసనసభలో చర్చల్లో పాల్గొనాలి. ఇప్పుడే కుదురుకుంటున్న ప్రభుత్వం తీరును పరిశీలించి తగిన సమయం లో స్పందించాలి. ఇప్పుడే హామీల అమలుపై వ్యాఖ్యలు, విమర్శలు చేయటం వల్ల పార్టీకి ఉపయోగంలేదు. సంస్థాగత మార్పులు బాధ్యతాయుతమైన నాయకులను ఎంపిక చేసుకుని. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానికసంస్థల ఎన్నికలపై దృష్టి సారించి పెద్ద నాయకుల నుంచి కార్యకర్త వరకు వలసలు పోకుండా కాపాడుకుంటేనే జగన్‌కి మనుగడ.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story

Most Viewed