బస్సు కోసం ఎండలో ఎదురుచూపులు.. బస్టాండ్ లేక ప్రయాణికులకు తప్పని తిప్పలు

by Aamani |
బస్సు కోసం ఎండలో ఎదురుచూపులు.. బస్టాండ్ లేక ప్రయాణికులకు తప్పని తిప్పలు
X

దిశ, ఇబ్రహీంపట్నం : బౌరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో బస్టాండ్ లేక ప్రయాణికులు ఎర్రటి ఎండలో నిలబడి బస్సుల కోసం ఎదురుచూస్తున్న దుస్థితి. ఇబ్రహీంపట్నం మండలం లో మేజర్ గ్రామ పంచాయతీలలో ఒకటైన రాయపోల్ గ్రామంలో దాదాపు ఎనిమిది వేల జనాభా మంది నివసిస్తున్నారు. ఈ రోడ్డు మార్గం నాగార్జున సాగర్ హైవే ఇబ్రహీంపట్నం నుండి విజయవాడ హైవే తూప్రాన్ పేట్ ను కలుపుతుంది. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే ఇబ్రహీంపట్నం నుండి వయా రాయపోల్ నుంచి చౌటుప్పల్, యాదగిరిగుట్ట, దండుమైలారం, ముకునూర్, తాళ్లపల్లి గూడ గ్రామాలకు ప్రతి గంటకు ఒకటి చొప్పున బస్సులు ప్రయాణిస్తూ ఉంటాయి.

దీంతో ప్రయాణికులతో ఈ రోడ్డు మార్గం కిక్కిరిసిపోతుంది. ఇది ఇలావుండగా గతంలో రాయపోల్ గ్రామంలో ప్రయాణికుల కోసం బస్టాండ్ కూడా ఉండేది. కానీ గ్రామంలో ఉన్న ప్రధాన రోడ్డు వెడల్పు లో భాగంగా గతంలో బస్టాండ్ ను కూల్చివేశారు. గత ప్రభుత్వ హయాంలో బస్టాండ్ ను కూల్చే సమయంలో నూతన బస్టాండ్ ను కూడా నిర్మించే బాధ్యత మాదేఅని చెప్పారు. కూల్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు బస్టాండ్ గురించి ఎలాంటి నిర్మాణానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. అసలే ఎండ కాలం.. ప్రారంభంలోనే ఇలా ఎండలు మండుతుంటే మున్ముందు భానుడి ప్రతాపం ఎలా ఉంటుందో అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన బస్టాండ్ ను నిర్మించాలని ప్రయాణికులు వాపోయారు.

ఇప్పటివరకు బస్టాండ్ ఎలాంటి నిర్మాణం చేయలేదు : బాలం పవన్ కుమార్,గ్రామస్తుడు

గతంలో మా గ్రామంలో బస్టాండ్ ఉండేది. గ్రామంలో ప్రధాన రోడ్డు వెడల్పు లో భాగంగా బస్టాండ్ ను కూల్చివేశారు. బస్టాండ్ ను కూల్చినప్పుడు నూతన బస్టాండ్ నిర్మించే బాధ్యత మాదే అని గత పాలకులు చెప్పారు. కానీ ఇప్పటివరకు బస్టాండ్ ఎలాంటి నిర్మాణం చేయలేదు దీంతో ప్రయాణికులు రోజు ఎండలో, షాప్ ల ముందు నిలబడి వివిధ పనుల నిమిత్తం ప్రయాణించే వారు, విద్యార్థులు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.



Next Story