వరల్డ్ వాక్: ఉగ్రవాద నిరోధకానికి ఎఫ్ఏటీఎఫ్ సంస్థ పాత్ర ఎంత?

by Ravi |   ( Updated:2022-11-08 18:30:39.0  )
వరల్డ్ వాక్: ఉగ్రవాద నిరోధకానికి ఎఫ్ఏటీఎఫ్ సంస్థ పాత్ర ఎంత?
X

ప్రపంచంలోని ఏ దేశం కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం, సహాయం అందించకుండా, నిధులు చేర్చకుండా చూసేందుకు 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్)' ఏర్పడింది. దీని లక్ష్యాలకు వ్యతిరేకంగా పనిచేసే దేశాలను గ్రే లిస్ట్ లేదా బ్లాక్ లిస్ట్‌లో చేర్చి ఆంక్షలు విధిస్తారు. యాంటీ మనీ లాండరింగ్ (అక్రమ ఆదాయం చట్టబద్ధం చేయడం), కంబేటింగ్ ఫైనాన్సియల్ టెర్రరిజం (ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం అందించడం) వంటి అంశాలపై ఎఫ్ఏటీఎఫ్ ప్రత్యేకంగా దృష్టి సారించి, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జీడీపీలో సుమారు 2.7 శాతం నిధుల అక్రమ రవాణా జరుగుతోంది.

39 దేశాలు కలిసి

కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నది. దీంతో 2012 నుంచి 2015 వరకు, 2018 నుంచి 2022 అక్టోబర్ వరకు పాకిస్తాన్‌ను గ్రే లిస్ట్ లో ఉంచారు. అక్టోబర్ 21న జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశంలో ఉగ్రవాదంపై అక్రమ రవాణా విషయంలో పాకిస్తాన్ తీసుకున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని భావించి గ్రే లిస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా జి-7 దేశాలకు దీటుగా, 1989లో 37 దేశాలతోపాటు యూరోపియన్ కమిషన్, ది యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బాడీ గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ కలిసి ఎఫ్ఏటీఎఫ్‌గా ఏర్పడ్డాయి.

మన దేశం 2006లో పరిశీలన దేశంగా, 2010లో సభ్యదేశంగా చేరింది. ఈ సభ్య దేశాలన్నీ యేటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ నెలలలో సమావేశమవుతాయి. వివిధ దేశాలలో ఉగ్రవాదం, అక్రమ రవాణా, ఫైనాన్షియల్ విషయాలను సమీక్షిస్తాయి. నిబంధనలు ఉల్లంఘించిన దేశాల మీద చర్యలు తీసుకుంటాయి. ఏఎమ్ఎల్, సీఎఫ్‌టీ విషయాలలో భారీ ఎత్తున అక్రమాలు చేస్తుంటే గ్రే లిస్ట్ లో ఉంచుతారు. ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలు బేఖాతరు చేస్తుంటే బ్లాక్ లిస్ట్ లో ఉంచుతారు. ఈ రేటింగ్ ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సంస్థలు పరిశీలిస్తుంటాయి. ఈ లిస్టులలో ఉన్న దేశాలకు వరల్డ్ బ్యాంక్, ఏడీబీ ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఐఎమ్ఎఫ్ వంటి సంస్థలు అప్పులు ఇవ్వవు. కావున సభ్యదేశాలన్నీ అప్రమత్తతతో వ్యవహరిస్తుంటాయి.

ఉత్సవ విగ్రహంగా ఆ సంస్థ

పాకిస్తాన్‌లో ఉగ్రవాదం, ఆర్థిక నేరాలకు సంబంధించిన చర్యలను ఎఫ్‌ఏటీఎఫ్ అధ్యక్షుడు మార్క్స్ ప్లయర్ పరిశీలించారు. భద్రతామండలి నియమ నిబంధనలు సరిగా అమలవుతున్నాయా. లేదా అని స్వయంగా ఆరా తీశారు. మన దేశంపై దాడి చేసిన ఉగ్రవాదులు వారి దేశంలో ఉంటే ఖైదు చేయడం వంటి అంశాలను తనిఖీ చేశారు. పాకిస్తాన్ నిర్ణయాలు సంతృప్తికరంగా ఉండటంతో గ్రే లిస్ట్ నుంచి విముక్తి కలిగించారు. కానీ, సభ్య దేశాలు, ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌పై నిరంతర నిఘా వేసి ఉంచాలని హెచ్చరించారు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ఉన్న మచ్చను తొలగించుకుంటుందని ఆశిద్ధాం. ఉగ్రవాదం అంతం కోసం అందరమూ కలిసి పని చేయాలని, ప్రపంచశాంతి కోసం ముందడుగు వేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 'వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్' అమలు చేస్తున్నామని మన విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు.ఐక్యరాజ్యసమితి భద్రతా సమితి, ఎఫ్ఏటీఎఫ్ నియమ నిబంధనలు భారత్ తప్పకుండా పాటిస్తుందని స్పష్టం చేశారు.

గ్లోబలైజేషన్‌లో భాగంగా ప్రపంచమంతా కుగ్రామం మారిన నేపథ్యంలో అన్ని దేశాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించుటకు స్నేహ హస్తం తో ముందుకు సాగాలి. సంఘ విద్రోహ శక్తులను, ఉగ్రవాదులను నియంత్రించాలి. హింస ద్వారా సమాజంలో జరిగే నష్టం చరిత్రలో ఎన్నో చూశాం. 'అహింసో పరమో ధర్మహః' అనే భావనతో మెలగాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదం నుంచి రక్షించగలుగుతాం. లేకపోతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎంతో బలమైన సంస్థగా ఉన్న ఐక్యరాజ్యసమితి ఉత్సవ విగ్రహంగా ఉండుట మనం చూస్తున్నాం. ప్రతీ పౌరుడిని అన్ని దేశాలు విద్యావంతులుగా మార్చి మానవ నైతిక విలువలు పెంచే విధంగా చేయాలి. అప్పుడు మాత్రమే వసుధైక కుటుంబంగా జగత్ వర్ధిల్లుతుంది.


ఐ.ప్రసాదరావు

6305682733

Advertisement

Next Story