- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వారి ఆరోపణలపై ఎందుకింత నిర్లక్ష్యం?
న్యాయం కోసం మహిళా రెజ్లర్లు రోడ్డెక్కడం భారత దేశ క్రీడా చరిత్రలోనే అసాధారణం. ఒలింపిక్స్‌లో నాలుగు సార్లు, కామన్వెల్త్, ఆసియాడ్‌లలో అనేక సార్లు పతకాలు సాధించి అంతర్జాతీయంగా భారత దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహిళా రెజ్లర్లు ఇప్పుడు ఆత్మగౌరవం కోసం రాజధాని నడిబొడ్డున రెండుసార్లు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం.
భారత కుస్తీ సమాఖ్య (డబ్ల్యు.ఎఫ్.ఐ)పైన, ఆ సమాఖ్య అధ్యక్షుడు, నేరచరితుడు అయిన బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శర్మ పైన ఒక మైనరుతో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేస్తే, దానిపై ఇంతవరకు ఎఫ్‌ఐఆరే నమోదు చేయని ఢిల్లీ పోలీసుల నిర్వాకాన్ని ఏమనాలి? న్యాయం కోసం సుప్రీం కోర్టు తలుపుతట్టాల్సిన పరిస్థితికి బాధితులను నెట్టిన పాపం ప్రభుత్వానిదే.
మహిళా రెజ్లర్లకు కోర్టు అండ!
దీనిపై సర్వోన్నత న్యాయస్థానం వెంటనే స్పందించి ఈ ఆరోపణలు తీవ్రమైనవంటూ శుక్రవారం విచారణ చేపట్టాలని నిర్ణయించింది. మరో వైపు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 30 మంది రెజ్లర్లు, 200 మందికి పైగా క్రీడాకారులు గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆందోళనకు సహచర క్రీడాకారులు నీరజ్ చోప్రా, సానియా మీర్జా, నిఖితా జరీన్ మరియు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా, రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజం పెద్దయెత్తున మద్దతు పలకడం ఆహ్వానించదగ్గ పరిణామం.
డబ్ల్యు ఎఫ్‌ఐని తన జేబు సంస్థగా మార్చుకుని, పదేళ్లుగా ఆ పదవిలో తిష్టవేసుక్కూర్చున్న బీజేపీ ఎంపీ మహిళా అథ్లెట్లపై యథేచ్ఛగా లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని, డబ్ల్యు ఎఫ్‌ఐని సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని మహిళా రెజ్లర్లు చేస్తున్న డిమాండ్లు అత్యంత న్యాయసమ్మతమైనవి.
వీటిని పరిష్కరించడానికి బదులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దోషిని కాపాడేందుకు యత్నించడం గర్హనీయం. సాధారణంగా మహిళా అథ్లెట్లు లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేయడానికి ముందుకు రారు. అందులోనూ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు అసలు ఇష్టపడరు. అటువంటిది వారు బహిరంగంగా రోడ్డెక్కారంటే బీజేపీ ఎంపీ వికృత సంస్కృతితో వారు ఎంత నరకయాతన అనుభవించారో అర్థమవుతుంది.
మేరీకోమ్ కమిటీ నివేదిక ఏది?
బాధితులు జనవరిలో మొదటిసారి జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేసినప్పుడు డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను నెల రోజుల్లో తొలగిస్తామని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఒక కమిటీని వేస్తామని, ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. దీంతో ఆందోళనను విరమించారు. మేరీ కోమ్ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చి చాలా రోజులైనా దానిని బయటకు వెల్లడించలేదు.
ఆ కమిటీ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. మూడు మాసాల క్రితం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవికి తిరిగి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు ఒక అడ్‌హాక్ ప్యానెల్‌ను నియమించింది. మే 9న ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో డబ్ల్యు.ఎఫ్.ఐ చీఫ్ పదవిని మళ్లీ దక్కించుకోడానికి బ్రిజ్‌భూషణ్ పావులు కదుపుతున్నాడు.
లెక్కకు మించిన ఆరోపణలు
ఒక వేళ అది సాధ్యం కాని పక్షంలో ప్రస్తుతం సమాఖ్య ఉపాధ్యక్షుడిగా ఉన్న తన పుత్ర రత్నాన్ని అధ్యక్షుడ్ని చేయాలని చూస్తున్నాడు. దీంతో కడుపుమండిన రెజ్లర్లు ఏప్రిల్ 21 నుంచి మళ్లీ ఆందోళనకు దిగారు. 'మీ టూ ఉద్యమం' స్ఫూర్తితో వారు ధైర్యంగా గొంతెత్తుతున్నారు. 2012 నుండి 2022 వరకు భారత్‌లోను, విదేశీ గడ్డపైనా ఎప్పుడెప్పుడు ఎలా లైంగిక వేధింపులకు బ్రిజ్‌భూషణ్ పాల్పడినదీ ఆధారాలతో సహా తమ వద్ద ఉన్నాయని వారు చెబుతున్నారు.
అరెస్టైన వ్యక్తికి అందలమా?
అయినా, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రిలిమినరీ దర్యాప్తు జరపడానికి కొంత వ్యవధి కావాలని ఢిల్లీ పోలీసులు చెప్పడం హాస్యాస్పదం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఢిల్లీ పోలీసుల తీరు ఇలా వుంటే రాజధానిలో మహిళలకు భద్రత ఎలా ఉంటుంది? నేర సామ్రాజ్యాధిపతి దావూద్ ఇబ్రహీంకు సాయం చేశారన్న ఆరోపణపై గతంలో ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఒకసారి అరెస్టయిన వ్యక్తిని తీసుకొచ్చి రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే పరిస్థితి ఇలానే ఉంటుంది. బేటీ బచావో, బేటీ పఢావో (ఆడపిల్లలను రక్షించండి, చదివించండి) అని ప్రధాని ఇచ్చే నినాదానికి పూర్తి భిన్నంగా బీజేపీ ఎంపీ తీరు ఉన్నది. ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి వున్నా బ్రిజ్‌భూషణ్‌ను ఆ పదవి నుంచి తక్షణమే తొలగించాలి. రెజ్లర్లు కోరుతున్నట్లుగా ఆయనపై దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలి.
మేకల రవి కుమార్.
82474 79824