అనుకూల తీర్పులతో... అందలమెక్కడమే న్యాయమా?

by Ravi |   ( Updated:2024-11-01 02:00:34.0  )
అనుకూల తీర్పులతో... అందలమెక్కడమే న్యాయమా?
X

బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అనేక సంవత్సరాలుగా వివాదంలో కొనసాగుతున్న కేసు పేరే 'జ్ఞాన్ వాపి' కేసు. ఈ కేసులో (హిందువులకు) ఆ గుడిలో పూజ చేసుకునేందుకు అనుమతిస్తూ కోర్టులో తీర్పు చెప్పినందుకు ఆ జడ్జి గారికి (అజయ్ కృష్ణ - విశ్వేషా కు) ఆయన పదవీ విరమణ చెందిన నెలలోపే బీజేపీ ప్రభుత్వం మరో విలువైన పదవిని (ఒక యూనివర్సిటీకి "లోక్ పాల్ ") బహుమానంగా అప్పగించింది. ఈ విషయం పేపర్లలో, మీడియా చానెళ్లలో వార్తలు రావటంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. గతంలో ఇలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ... తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌కి.. తన పదవీ విరమణానంతరం రాజ్యసభ ఎంపీగా పదవిని బీజేపీ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.

ఇలా పదవీ విరమణ దగ్గర పడుతున్న తరుణంలో సున్నితమైన "అయోధ్య-బాబ్రీ మసీదు" విషయంలో ఒక వర్గానికి (హిందువులకు) అనుకూలంగా, ఒక పార్టీకి బలం చేకూరేలా తీర్పునిచ్చారనీ, అందుకు ప్రతిఫలంగానే ఆయనకు రాజ్యసభ సీటు వరించిందని అప్పుడు అందరూ అనుకున్నారు. ఇప్పటికీ అక్కడక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా ఈ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు వారణాసిలోని 'జ్ఞాన్ వాపి' మసీదు విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయినట్టు కనిపిస్తున్నది.

తీర్పులు ప్రకటించు.. పదవులు చేపట్టు..

మసీదు బేస్మెంట్‌ను హిందువుల పూజల కోసం తన ఉద్యోగ జీవితంలో చివరి రోజున తీర్పు ఇచ్చిన నెలలోపే 'అజయ్ కృష్ణ - విశ్వేషా'కు లక్నోలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి 'అంబు డ్స్‌మన్'గా నియమితులయ్యారు. జనవరి 31న ఆయన పదవీ విరమణ చేయగా, ఫిబ్రవరి 27న.. డాక్టర్ శకుంతలా మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయం) లోక్‌పాల్ (అంబుడ్స్‌మన్)గా నియమించినట్టు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. విశ్వేషా ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉంటారు. యూనివర్సిటీ లోక్‌పాల్ విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించే బాధ్యతను ఇకముందు నిర్వహించవలసి ఉంటుంది. ఇక భవిష్యత్తులో విద్యార్థుల ఫిర్యాదుల విషయంలోనూ ఆయన చెప్పబోయే తీర్పులు ఏలా ఉండబోతాయో మనం ముందుగానే ఊహించవచ్చు.

ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా..

సమాజంలోని రెండు మతాల మధ్య సున్నితమైన అంశంలో తీర్పునిచ్చిన వ్యక్తిని ఇప్పుడు అంబుడ్స్‌మన్‌గా నియమించటం పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ పరోక్షంగా న్యాయవ్యవస్థను సైతం ఇలా భ్రష్టు పట్టించడంలో బహు నేర్పరిగా పేరుపొందాడు. న్యాయ వ్యవ స్థను గురించి ప్రజలలో ఇలా అనుమానాలు తలెత్తేలా ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం నడుచుకోవడం ఇటు ప్రధానమంత్రి పదవికీ, అటు స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ గౌరవ ప్రతిష్టలకు భంగకరమే. మన భారత రాజ్యంగంలో సమున్నత గౌరవం కలిగిన వ్యవస్థల గౌరవానికీ, ప్రజల నమ్మకానికి విఘాతం కలిగించటమే. ఇప్పటికే ఈడీ, ఐటీ, సీబీఐ, ఆర్‌బీ‌ఐ లాంటి వ్యవస్థల పనితీరులోనూ పలు ఆరోపణలు, నిందలూ వినిపిస్తునే ఉన్నాయి.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..!

ఇందులో భాగంగానే కీలక కేసుల్లో న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు అనుమానం రేకెత్తించేలా 'ప్యాకేజీ తీర్పులు' వెలువడుతున్నాయనీ, పదవీ విరమణ అనంతరం సదరు న్యాయమూర్తులకు కీలక పదవులు వరిస్తున్నాయని సామాజిక‌వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విష సంస్కృతికి ఇకనైనా స్వస్తి చెప్పడం అవసరం. మన రాజ్యాంగ విలువలను, స్పూర్తిని కాపాడే బాధ్యతను మన న్యాయమూర్తులు నిలబెట్టుకోవాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవస్థలను కాపాడుకునే బాధ్యత అందరి మీదా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చైతన్యస్థాయిని అనుసరించే వ్యవస్థలు కూడా బాధ్యతగా పనిచేస్తాయి. ఇలాంటి అవకతవకలపై మీడియాలోనూ విస్తృతంగా చర్చలు జరిగినప్పుడు ప్రజలు కూడా అప్రమత్తత కలిగి ఉంటారు. ఒకరకంగా గుజరాత్‌లో మోడీ సీఎంగానూ, దేశానికి ప్రధానిగానూ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి, అలాగే ఉత్తర‌ప్రదేశ్‌లో యోగి ఆధిత్యానాథ్ సీఎంగా పదవిలో ఉండగా తీసుకున్న పాలనా నిర్ణయాలపై పునఃసమీక్ష చేయాలి. వాటివల్ల ప్రజా సంక్షేమానికి ఎంతవరకు మేలు జరిగిందో నిష్పాక్షిక పునర్విచారణ జరపాల్సిన అవసరం కూడా ఉంది.

డాక్టర్ కోలాహలం రామ్ కిషోర్

98493 28496

Advertisement

Next Story

Most Viewed