కాంగ్రెస్‌ నాయకుల తీరు మారేనా!?

by Ravi |   ( Updated:2023-04-26 00:15:56.0  )
కాంగ్రెస్‌ నాయకుల తీరు మారేనా!?
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అంతర్గత లోపాలను సవరించుకొని రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని కసరత్తు చేస్తుంటే అదే స్థాయిలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. ఇప్పటికి మారని పార్టీ ఏదైనా ఉందంటే అది శతాధిక కాంగ్రెస్ పార్టీనే అని చెప్పాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన వేళ కాంగ్రెస్ నేతలు పడుతున్న ప్రయాస చూస్తే. పార్టీ కంటే తమ పదవులే ముఖ్యమన్నట్టుగా వ్యవహరించే తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. కష్టకాలంలో పార్టీ పరిస్థితి మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల కంటే.. గ్రూపులుగా విడిపోయి చేస్తున్న ప్రయత్నాలు.. నడుపుతున్న గూడుపుఠాణీలు చూస్తే.. జాలి కలుగక మానదు. ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని స్థాయిలో ఉన్న కాంగ్రెస్.. ఈ రోజున ఎలాంటి దుస్థితిలో ఉందన్నది తెలిసిందే.

వర్గ విభేదాలు

కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. నిరుద్యోగ నిరసన సభ చిచ్చు రాజేసింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగ నిరసన దీక్షలకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏప్రిల్ 21న నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో‌ సభ ఉంటుందని ప్రకటించారు. అక్కడే అసలు వివాదం మొదలైంది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సభ ఉంటుందంటూ ఎలా ప్రకటిస్తారని ఆ ప్రాంత సీనియర్ నేత అసహనం‌ వ్యక్తం చేసి ఈ విషయంపై ఆయన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కి ఫిర్యాదు చేశారని సమాచారం. అలాగే పీసీసీ చీఫ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇప్పటికే ఆయన వ్యతిరేక వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. మొన్నటి మంచిర్యాల సభలోనూ కొందరు నేతలు ‌పీసీసీ చీఫ్‌తో అంటీముట్టనట్టే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతతోనూ పీసీసీ చీఫ్ సంబంధాలు అంతంతే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రేగిన ఈ దుమారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. పీసీసీ చీఫ్ మాత్రం‌ తానేమీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ పార్టీ అంతర్గత చర్చల్లో చెబుతూ వస్తున్నారు. కానీ... వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆయన వ్యతిరేక వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పైగా పాదయాత్రలలోనూ తలోదారిగా వ్యవహరిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పాదయాత్ర చేపట్టగా మరో పక్క 'పీపుల్స్‌ మార్చ్‌' పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మరో యాత్రను కొనసాగిస్తున్నారు.

మొదలైన కుర్చీల కుమ్ములాట

ఆలూ లేదు చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అన్న దానిపైన కాంగ్రెస్‌లో ఇప్పటినుంచే చర్చ జరుగుతోంది. సీఎం అభ్యర్థిని నేనంటే నేనంటూ ఆశావహులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉన్న పార్టీ అని గొప్పలు చెప్పుకుంటూ, అంతర్గత ప్రజాస్వామ్యం అనే ముసుగులో క్రమశిక్షణ మరిచి అధిష్టానం అండ వుందనే ధీమాతో కోటరీ కోటలో పాగా వేసిన నాయకుల చేష్టలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయని అధిష్టానం గుర్తించి, పార్టీకి నష్టం కలిగించే ఏ ఒక్క చర్యను సమర్ధించదని చెప్పాలి. దాన్నే ఆచరణలో పెట్టాలి. కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది తాము సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే కొంత మంది కాంగ్రెస్ సీనియర్లు పక్క పార్టీలకు వలసపోతున్నారు మరికొందరు సీనియర్లు అవకాశం కోసం ఎదురుసూస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ. పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నారు.

వృద్ధ పావురం మాటవిని వలలో చిక్కిన పావురాలు నిందలు చేసినా నాయకుడైన చిత్రగ్రీవుడు ధైర్యం చెప్పి, తప్పిదాన్ని సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని సూచించి తేకువతో అన్ని పావురాలకి బంధ విముక్తి చేయిస్తాడు. ఈ కథలోని నీతిని అర్థం చేసుకుని స్ఫూర్తి పొంది సమైక్యంగా గెలుపు కోసం పోరాడితే కాంగ్రెస్ మనుగడ. లేదంటే కనుమరుగే. సీనియర్లు, జూనియర్లు అన్న అహాన్ని పక్కనపెట్టి, నాయకుడిగా నియమితుడైన వ్యక్తికి గౌరవం ఇస్తూ అనుభవరాహిత్యం వల్ల తప్పు చేస్తే అనుభవమున్న నేతగా వాటిని సరిదిద్ది పార్టీని ముందుకు నడిపించాలి. నాయకుడైనా కొన్ని సార్లు అనుభవమున్న వారి సేవలను సలహాలను తీసుకుంటూ సమర్దవంతంగా పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలి. నేతల తీరును పక్కకు నెట్టి, గెలుపు వ్యూహాలకు పదును పెట్టి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి అధికారంలోకి వస్తే ప్రజల కోసం చేసే కార్యక్రమాల చిట్టాపట్టి ప్రచారాన్ని మొదలు పెట్టండి... విజయానికి అదే తొలిమెట్టు.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story