- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జనంపై వన్యమృగాల దాడులేల...!
ఇటీవలి కాలంలో మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో జనావాసాలపై జంతువులు దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ వారంలో తిరుపతి కాలినడక మార్గంలో చిరుత దాడిలో రక్షిత అనే చిన్నారి మరణించడంతో యావత్ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. దీంతో ఈ వన్య మృగాల సంచారం పట్ల ప్రభుత్వం, ప్రజలు దృష్టి పెట్టారు. గత శతాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా నివాస గృహాలు, పొలాలపై వానరాలు ( కోతులు), ఏనుగులు దాడులు చేస్తుండటంతో ఇటు మనుషులు, అటు పంట చేలు దెబ్బతింటున్న మాట వాస్తవం. ఇక వీధి కుక్కల దాడులు చెప్పనవసరం లేదు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ పాము కాటు కూడా ఎక్కువగా నమోదు అవుతూ ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. దీనికి తోడు, ప్రస్తుతం అడవుల్లో సంచరించే పులులు సింహాలు చిరుతలు ఎలుగుబంటి వంటి క్రూర మృగాలు , వాటి నివాస స్థావరాలు అయిన అడవులను వదిలి జనావాసాల పైకి రావడం చర్చనీయాంశం అయింది.
కార్పొరేట్లు చొరబడడంతో..
ముఖ్యంగా దట్టమైన అడవులు కొండలు గుట్టలు మధ్య నివసించే ఈ మృగాలు, ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఎక్కువగా రాత్రిపూట సంచరిస్తూ అనేక మందిని గాయపరుస్తూ, కొంతమంది మృతికి కారణం అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటనేది సూక్ష్మంగా పరిశీలిస్తే.. అభివృద్ధి పేరుతో అడవులను ధ్వంసం చేయడమే అని తెలుస్తోంది. అడవుల్లో రోడ్లు నిర్మాణాలు చేపట్టారు. మంచిదే కానీ ఇదే సాకుతో మొత్తం అడవులను నరికి మైదానాలుగా మార్చడం సబుబా...! ఇలా మైదానాలుగా మార్చడంతో ప్రయాణికుల రద్దీ పెరిగి టూరిజం పుంజుకుంది. దీంతో అనేక మంది విహార యాత్రలకు సిద్ధపడుతున్నారు. కొండలు కోనలు దర్శించడానికి ముందుకు వస్తున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యాటకానికి ప్రాధాన్యత ఇవ్వడంతో అటవీ ప్రాంతంలో కొత్త కొత్త భవనాలు, రిసార్ట్‌లు,హోటల్స్ నిర్మిస్తున్నారు, ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి అనేక మంది వీకెండ్, సెలవుల్లో కుటుంబ సభ్యులతో, స్నేహితులతో అటవీ ప్రాంతాల్లో పర్యటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో అడవుల నరికివేత ఎక్కువగా పెరిగింది. ప్రైవేటీకరణ, ఆధునీకరణ పేరుతో కార్పొరేట్ వ్యక్తులు మొత్తం అడవులను నిర్వీర్యం చేస్తున్నారు. దీంతో వన్య మృగాలకు నివాస ప్రాంతాలు కరువు అవుతున్నాయి. దీనికి తోడు, వాటికి కావలసిన ఆహారం జింకలు, దుప్పులు వంటివి లభ్యం కాకపోవడంతో జనావాసాల పైకి చొచ్చుకు వస్తున్నాయి.
మైనింగ్ తోడవ్వడంతో..
అలాగే ఈ మధ్య అడవుల్లో అక్రమ మైనింగ్ పెరిగింది. రంగు రాళ్ళు, విలువైన ఖనిజాలు కోసం అడవులను ధ్వంసం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఎర్రచందనం అక్రమార్కులు తిరుపతి చుట్టుపక్కల ఉన్న అడవులను నిర్మూలిస్తున్నారు. ఇటువంటి అక్రమార్కులకు, స్మగ్లర్లకు పలువురు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో ఈ అడవుల దోపిడికి అంతులేకుండా పోతుంది. చివరికి అడవుల్లో నివసించే జంతువులు మనుషులపై దాడి చేస్తున్నాయి. మన ఆవాసాలు ఆక్రమించడానికి వస్తున్నాయి.. తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా ప్రభుత్వాలు అటవీ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. అటవీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలి. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలి. అటవీ సరిహద్దు ప్రాంతంలో ఫెన్సింగ్‌ను బలోపేతం చేయాలి. అటవీ, పోలీసు, నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలి. అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఖాళీ పోస్టుల భర్తీ చేయాలి. నూతన టెక్నాలజీ, సాధనాలు ఆయా సిబ్బందికి అందించాలి. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, సందర్శన ప్రదేశాల వద్ద రక్షణ భద్రత కల్పించాలి. అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తమతో వచ్చే పిల్లలు, వృద్ధులను తమతో పాటు దగ్గర ఉంచుకొని ప్రయాణం చేయాలి. ప్రజలు ప్రభుత్వం, అయా అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి, శుభయాత్రగా తమ తమ పర్యటనలు ముగించాలి... ముమ్మాటికీ జంతువులు మనుషులపై దాడి చేయడానికి ప్రధాన కారణం అడవులను ధ్వంసం చేయడమేనని గుర్తించాలి. అడవుల మనుగడ పైనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుంది అని గ్రహించాలి.
ఐ.ప్రసాదరావు
63056 82733