చంద్రబాబు బంగారం అన్న కేసీఆర్ ను ఉద్యమంలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా!

by Ravi |   ( Updated:2022-09-21 18:30:49.0  )
చంద్రబాబు బంగారం అన్న కేసీఆర్ ను ఉద్యమంలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా!
X

తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో జర్నలిస్టులు ముందు వరుసలో ఉన్నారు. 1969 నుంచి తెలంగాణ కోసం జర్నలిస్టులు ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలను ఉద్యమంలోకి తెస్తూనే ఉన్నారు. చాలా మంది సమైక్యవాదుల మనసు మార్చి వారిని తెలంగాణవాదులు గా తీర్చిదిద్దిన ఘనత జర్నలిస్టులదే. రాజకీయ ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమవుతుందని విశ్వసించి ఉద్యమంలోకి నేతలను తీసుకురావడంలో జర్నలిస్టుల దశాబ్దాల కృషి ఉన్నది. తెలంగాణ సాకారమైతే ప్రజల బతుకులలో మార్పు వస్తుందని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో తెలంగాణ అస్మిత కనిపిస్తుందని భావించి ఉద్యమాన్ని నిర్మించడానికి జర్నలిస్టులు కృషి చేశారు.

అధికార మత్తులో జోగుతూ ఆంధ్రా నేతలకు వంతపాడే ఎందరో నాయకులను ఉద్యమంలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ ఎజెండా ఈ నేపథ్యంలోనే రూపొందింది. టీడీపీలో ఉంటూ అసెంబ్లీలో 360 జీఓ అవసరం లేదని వాదించిన నేత. 'చంద్రబాబే బంగారం' అన్న కేసీఆర్‌కు ఉద్యమ పాఠం నేర్పింది జర్నలిస్టులు కాదా? నిబద్ధత కలిగిన పాశం యాదగిరి లాంటి ఎందరో బుద్ధిజీవులు చాలా మంది నేతలను ఉద్యమంలోకి తెచ్చారు. దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి, సిద్దిపేట ఈనాడు విలేకరి అంజయ్య, అష్టకాల రామ్‌మోహన్, ఆర్. సత్యనారాయణ తదితరులు ప్రభావం చూపించారు.

ఆనాడు బలంగానే

కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం బలంగానే ఉన్నది. అపుడు మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షుడుగా, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాం. తెలంగాణ కోసం జర్నలిస్టుల పాటల క్యాసెట్ రూపొందించాం. దేశపతి శ్రీనివాస్, దరువు అంజన్న పాడిన పాటలతో క్యాసెట్ విడుదల చేయాలని కేసీఆర్‌ను ఆహ్వానిస్తే రాలేదు. అందుకు వేరే రాజకీయ కారణాలు ఉన్నాయి. తరువాత అనేకసార్లు నేను, రామలింగారెడ్డి ఇద్దరం కేసీఆర్‌ను తార్నాకలోని ఇంటిలో కలిసి తెలంగాణ ఉద్యమంలోకి రావాల్సిన అవసరం గురించి వివరించాం. అప్పటికే తెలంగాణ నలుమూలల కలియదిరుగుతూ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, నష్టాలను వివరిస్తున్న గాదె ఇన్నయ్యతో పాటు అనేక మంది మేధావులతో చర్చించిన తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమం లోకి ప్రవేశించారు.

టీఆర్‌ఎస్ ఆవిర్భావం తరువాత తెరవెనుక ఉన్న చాలా మంది జర్నలిస్టులు బహిరంగంగా ముందుకు వచ్చారు. చాలా మంది గ్రామీణ విలేకరులు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి అల్లం నారాయణ కన్వీనర్‌గా ముందుకు సాగారు. తరువాత తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు జరిగింది. ప్రొఫెసర్ కోదండరామ్ సారథ్యంలో రాజకీయ జేఏసీ ఏర్పాటు లో జర్నలిస్టుల పాత్ర చాలా ఉన్నది. యాజమాన్యాలు అనుకూలంగా లేకపోయినా, ఉద్యోగాలు పోతాయని తెలిసినా, కేసులు అయినా వెనకడుగు వేయకుండా ఉద్యమం నడిపించారు.

తీరని సమస్యలు

ఆత్మగౌరవం తో పాటు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించారు. అవేవీ జరగలేదు. అధికార మార్పిడి తప్ప ఆత్మగౌరవం కూడా కరువైంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఎనిమిదేండ్ల తెలంగాణలో ఇండ్ల స్థలాల మాటే మరిచిపోయారు. హెల్త్ కార్డులు లేక ఎందరో జర్నలిస్టులు అసువులు బాసారు. ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే జర్నలిస్టులకు తప్ప ఎవ్వరికీ సహాయము అందడం లేదు. ఎవరికైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే. 'ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉన్నాను సహాయం చేయండి' అని. ఎందరో తమ్ముళ్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెడతారు. కరోనా సమయంలో ఐదు కిలోల బియ్యం కోసం సంచులు పట్టుకొని దాతల ఇండ్ల ముందు పడిగాపులు గాసిన వారెందరో!

ప్రభుత్వ పక్షాన ఉండే నాయకులు ఆసుపత్రిలో చేరితే సీఎం రిలీఫ్ ఫండ్ లక్షలు ఎలా వస్తాయి? గ్రామీణ ప్రాంత పేద జర్నలిస్టులకు ఎందుకు రావు? ఇదో పెద్ద ప్రశ్న. ఇండ్ల స్థలాలు ఒక నాయకుడికి మూడు, నాలుగు వస్తాయి. అడిగిందే తడవుగా నిబంధనలకు విరుద్ధంగా వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. కలాలనే నమ్ముకున్న వారికి ఎందుకు రావు? జర్నలిస్టుల వైద్యం, వారి పిల్లలకు విద్య, ఇంటి స్థలం, ఉద్యోగ భద్రత, చిన్న పత్రికలకు, చానల్లకు ప్రకటనలు, భావ ప్రకటన స్వేచ్ఛ, భద్రత తదితర అంశాలు ఎందుకు చర్చకు రావడం లేదు?

ఎందుకీ పాదాభివందనాలు

సీఎంగారే స్వయంగా విలేకరుల సమావేశంలో అవమానిస్తూ మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? పాలాభిషేకాలు, పాదాభివందనాలు ఎవరికోసం చేస్తున్నారు? చివరకు అక్రెడిటేషన్ కార్డుల కోసం కూడా ఇబ్బందులే. పైరవీలు చేస్తేనే కార్డ్ ఇస్తున్న పరిస్థితి. ఇంకా ఉపేక్షించితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. జర్నలిస్టుల సమస్యలపై చర్చించి ఒక కార్యాచరణ రూపొందించాల్సి ఉన్నది.

తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల పరిస్థితులను చర్చించేందుకు 23, 24 తేదీలలో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగనున్నాన్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. ఐఎఫ్‌డబ్ల్యూజే అధ్యక్షులు మల్లికార్జునయ్య, సెక్రెటరీ జనరల్ పరమానంద పాండే మార్గదర్శనం చేస్తారు. పలువురు రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. ఈ సమావేశాలను జయప్రదం చేయాల్సిందిగా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను.


కప్పర ప్రసాదరావు

ప్రెసిడెంట్, తెలంగాణ జర్నలిస్టుల యూనియన్

96767 76622

Advertisement

Next Story

Most Viewed