- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పటిష్టమైన చట్టాలున్నా విద్యావ్యవస్థను ఆగం చేస్తుంది ఎవరు?
ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు సమాయత్తమవుతారు. అదే సమయంలో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు తెచ్చి మరీ ర్యాంకుల పేరిట అబద్ధపు ప్రచారాలు నిర్వహించే కార్పొరేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి కార్పొరేట్ శక్తులు అందినకాడికి దోచుకుంటున్నాయి. జ్ఞాన సముపార్జన లేని, సమాజం పోకడ నేర్పని విష వలయంలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. కార్పొరేట్‌లో ఎల్‌కేజీ నుంచి డిగ్రీ వరకు చదివించాలంటే దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై లక్షల దాకా ఖర్చవుతోంది.
అయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి చదివిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది విద్యావేత్తలు ప్రభుత్వ విద్యాసంస్థలకు సమాంతరంగా, లాభాపేక్ష లేకుండా ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వహించి లక్షల మందికి నామమాత్రపు ఫీజుతో విద్యనందించారు. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సామాజిక స్పృహను విస్మరించి, విద్యతో వ్యాపారం చేయడం మొదలెట్టారు. ధనార్జనే ధ్యేయంగా కోట్ల రూపాయల సంపాదనే లక్ష్యంగా కార్పొరేటు సంస్థలు రావడంతో పేదలకు నాణ్యమైన విద్య ప్రశ్నార్థకమైంది. పాఠశాల ఫీజులు ఇంజినీరింగ్, మెడిసిన్ ఫీజుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. స్కూల్ ఫీజు తో పాటు యూనిఫామ్, టై అంటూ విద్యాసంస్థలను కిరాణా దుకాణాలుగా మార్చారు.
పటిష్టమైన చట్టాలున్నా
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం విద్యాసంస్థలు నెలకొల్పే హక్కు ఉంది. విద్య పేరుతో వ్యాపారం చేస్తే నియంత్రించే హక్కు 19(6) ద్వారా ప్రభుత్వానికి ఉంది. 1982 నాటి ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం సెక్షన్ 20(A) వ్యక్తిగత హోదాలో విద్యాసంస్థలు నెలకొల్పడాన్ని నిషేధించింది. లాభాపేక్ష లేని సొసైటీలు, ట్రస్టులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. 1983 నాటి ఆంధ్రప్రదేశ్ క్యాపిటేషన్ ఫీజు నియంత్రణ చట్టం డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు, వన్ టైం ఫీజులు వసూలు చేయడాన్ని నిషేధించింది. అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించాలని చట్టంలో ఉంది. ఇన్ని పటిష్ట చట్టాలున్నా కార్పొరేట్ కళాశాలలపై ప్రభుత్వ చర్యలు శూన్యం.
రాష్ట్రంలో సర్కారు బడులు ఎనిమిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సర్వేలు తేల్చాయి. అన్ని సర్వేలలో తెలంగాణ చివరలో ఉంది. వాటన్నింటిని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి 'మన ఊరు-మన బడి' అంటూ ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ డ్రస్‌లు అందలేదు. ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టలేని పరిస్థితులలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ అసమర్థతను ఆసరాగా తీసుకుంటున్న కార్పొరేటు కళాశాలలు తన బ్రాంచీలను విస్తరించుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి.
ఓట్ల రాజకీయం చేస్తూ
విద్యారంగానికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం లేదు. మౌలిక వసతుల కల్పనలో, మధ్యాహ్న భోజనం అందించడంలో సర్కారు విఫలమవుతున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గురుకుల విద్యాలయాలు కొంత ప్రగతి సాధించినప్పటికీ, వాటికి శాశ్వత భవనాలు లేవు. కేటాయించిన నిధులు అద్దె భవనాలకే సరిపోతున్నాయి. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయం వరకు టీచర్ల కొరత ఉండటంతో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరం అవుతున్నారు.
సంక్షేమ, గురుకుల, ప్రభుత్వ వసతి గృహాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టల్ విద్యార్థులు చలికి వణుకుతూ, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు సీట్ల రాజకీయానికి తెరలేపి సంక్షేమ పథకాలను నమ్ముకుంటూ ఓట్ల వ్యాపారం చేస్తున్నాయి. సకల జనులు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో విద్యారంగానికి కొఠారీ కమిషన్ ప్రకారం బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలి. వసతి గృహాలు, గురుకులాలు, యూనివర్సిటీలలో సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలి. ప్రైవేటు, కార్పొరేట్ శక్తుల అధిక ఫీజులను నియంత్రించేలా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.
జీవన్
ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్
ఓయూ రీసెర్చ్ స్కాలర్
88850 99930