బహుజనులంటే ఎవరు? దానిని అధిగమించకుంటే బహుజన రాజ్యం కష్టమేనా?

by Ravi |   ( Updated:2022-11-05 10:41:15.0  )
బహుజనులంటే ఎవరు? దానిని అధిగమించకుంటే బహుజన రాజ్యం కష్టమేనా?
X

అంబేద్కరిజం పేరుతో, బహుజన పార్టీల పేరుతో, లాల్-నీల్-మైత్రీ పేరుతో కమ్యూనిస్టు భావజాలం మీద జరుగుతున్న దాడులను ఆపేయాలి. మార్క్సిజాన్ని బలహీనపరచడం, కులతత్వం పెంచడం వంటి చర్యలు శ్రామిక ప్రజలకు ద్రోహం చేయడమేనని గుర్తించాలి. 'కమ్యూనిస్టులు మన అభ్యున్నతి కోరేవారు' అని వివరించాలి. సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి. మార్క్సిజం ఒక ప్రాపంచిక దృక్పథంగా భావించే కమ్యూనిస్టులకు, అంబేద్కర్, ఫూలే వంటి సామాజిక ఉద్యమకారుల పట్ల, దేశంలోని సామాజిక ఉద్యమాల పట్ల గౌరవభావం ఉందని గుర్తించాలి. అంతిమంగా మనకు కావాల్సింది శ్రామికవర్గ దృక్పథం కలిగిన శ్రామిక ప్రజల రాజ్యం.

హుజనులంటే ఎవరు? బహుజనులుగా పిలువబడుతున్న శ్రామిక కులాలలో శ్రామిక వర్గ దృక్పథాన్ని పెంపొందించాల్సిపోయి వారిలో కులతత్వాన్ని నింపుతున్నారు అంబేద్కర్‌వాదులు. నిజానికి కులం కంటే కులతత్వం చాలా ప్రమాదకరం. ఈ అశాస్త్రీయ విధానాలు అంతిమంగా శ్రామిక ప్రజల అనైక్యతకు, దోపిడీ వర్గాల ప్రయోజనాలకు ఉపయోగపడుతున్నాయి. శ్రామికులు కనుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను బహుజనులంటారు. బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెబుతున్నప్పుడు శ్రామిక కులాల ప్రజలు ఏ దృక్పథం కలిగి ఉండాలనేది ఇక్కడ కీలకాంశం.

అందరిని ఒకే గాటన కట్టి

నిజానికి మనుధర్మ భావజాలం అగ్రకులాలలోనే కాదు అణచివేత కులాలలోనూ ఉంది. ఉదాహరణకు లక్ష్మీపేటలో ఎస్సీలకు చెందిన భూమిని బీసీలు అడ్డుకుని వారిని పొడిచి చంపారు. ఆ రెండు కులాలు శ్రామిక కులాలే కదా? వారిద్దరూ శూద్రులే. వీరిలో ఐక్యత లోపించడానికి కారణమేమిటి? వారికి సహజంగా ఉండాల్సిన వర్గ స్పృహ కు బదులు కుల స్పృహ, కులతత్వం ఉండడమే ఇందుకు కారణం. ఇవి రెండూ ఉన్నవారు మనుషులని సమానంగా చూడరు. పెట్టుబడిదారీ సంస్కృతిని అధిగమించకపోవడం మరో కారణం. దీంతో ప్రజల మధ్య ఉండాల్సిన మానవీయ సంబంధాలు డబ్బు సంబంధాలుగా మారుతున్నాయి.

అనేక కులాలతో ఏర్పడి ఉన్న సమాజం అంతిమంగా వర్గ సమాజం అని అర్థం చేసుకునే చైతన్యం శ్రామిక కులాలలో ఉండాలి. ఆధిపత్య అగ్రకులాలలో దోపిడీ చేసేవారు అధికంగా ఉంటే దోపిడీకి గురయ్యే వారు తక్కువగా ఉంటారు. అణచివేత కులాలలో దోపిడీ చేసేవారు తక్కువగా, దోపిడీకి గురయ్యే వారు అధికంగా ఉంటారు. వర్గ స్పృహ లేకపోవడం వలన శ్రామిక కులాలలో ఎదిగిన వారు తమ జాతిని విస్మరించి దోపిడీ వర్గాలలో చేరిపోయి మనుగడ కొనసాగిస్తున్నారు. మరి బహుజన రాజ్యం కావాలని చేప్పేవారు దీనిని పరిగణనలోకి తీసుకోకుండా, అందరిని ఒకే గాటిన కట్టి బహుజనులు అని అనడం శాస్త్రీయమేనా? ఇది శ్రామిక కులాలకు మేలు చేస్తుందా?

Also read: అంబేడ్కర్ పేరుతో పాలిట్రిక్స్!

ఆ ఆలోచన ఎందుకు లేదు?

'బహుజన రాజ్యం రావాలి. బహుజనులు ప్రధానమంత్రులు కావాలి' అంటున్నారు. ఈ లెక్కన ఇప్పటికే అనేక మంది ఉన్నారు కదా! అంతెందుకు నేటి ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా బహుజనులే కదా! ఇంతమంది ఉన్నా బహుజనుల బతుకులు ఎందుకు మారడం లేదు? పొరపాటు ఎక్కడ జరిగిందని ఎందుకు ఆలోచించరు? రక్తం ఉంటేనే శరీరం పనిచేస్తుంది. ప్రజల మేలు కోరే సిద్ధాంతం వారిలో ఉంటేనే, వారి వలన ప్రజలకు మేలు జరుగుతుంది. లేకపోతే అది దోపిడీ వర్గాలకే మేలు చేస్తుంది. అందుకే, వర్గ స్పృహ లేని బహుజన రాజ్యం పూర్తిగా ఆక్షేపణీయం.

బహుజన పార్టీ పేరులో, బహుజన రాజ్యం పిలుపులో, బహుజన సిద్ధాంతంలో వర్గ స్పృహ లేదు. అంటే, వీరు చెబుతున్న రాజ్యాధికారం సాధించడానికి ఒక శాస్త్రీయ లక్ష్యం లేదు. అలాంటప్పుడు అంబేద్కర్ భావజాల పార్టీలు గమ్యం చేరలేవు. లక్ష్యం సాధించలేవు. ఆ విధానాలు అంతిమంగా మనువాదులకే ఉపయోగపడతాయి. అంబేద్కర్ ఆలోచనా విధానం వలన దేశంలో కుల నిర్మూలన సాధ్యం కాదని 75 యేండ్ల దేశ పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. ప్రజలు ప్రగతి శీలురు అయినప్పుడే కొంతైనా మేలు జరుగుతుంది.

Also read: దేశ మూలవాసులు ఎవరు?నేడు వారి పరిస్థితి ఏంటి?

దానిని అధిగమించకుండా

రాజ్యాంగం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అనిపించినా, అది పాలకులకు, దోపిడీ వర్గాలకే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎన్నికలలో గెలవడం సంపన్నులకే తప్పా శ్రామిక కులాలకు సాధ్యం కాదు. వర్గ పోరాటాల ద్వారానే ప్రజలలో ప్రజలలో చైతన్యం వస్తుంది. అప్పుడే సోషలిస్ట్ వ్యవస్థ సాకారమై పార్లమెంటరీ వ్యవస్థ ప్రజలకు ఇప్పటి కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఓటు హక్కు సద్వినియోగం అవుతుంది. అంబేద్కరిజం పేరుతో, బహుజన పార్టీల పేరుతో, లాల్-నీల్-మైత్రీ పేరుతో కమ్యూనిస్టు భావజాలం మీద జరుగుతున్న దాడులను ఆపేయాలి. మార్క్సిజాన్ని బలహీనపరచడం, కులతత్వం పెంచడం వంటి చర్యలు శ్రామిక ప్రజలకు ద్రోహం చేయడమేనని గుర్తించాలి.

'కమ్యూనిస్టులు మన అభ్యున్నతి కోరేవారు' అని వివరించాలి. సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి. మార్క్సిజం ఒక ప్రాపంచిక దృక్పథంగా భావించే కమ్యూనిస్టులకు, అంబేద్కర్, ఫూలే వంటి సామాజిక ఉద్యమకారుల పట్ల, దేశంలోని సామాజిక ఉద్యమాల పట్ల గౌరవభావం ఉందని గుర్తించాలి. అంతిమంగా మనకు కావాల్సింది శ్రామికవర్గ దృక్పథం కలిగిన శ్రామిక ప్రజల రాజ్యం.


సుభాష్ ‌

సామాజిక కార్యకర్త

90009 04284

Advertisement

Next Story

Most Viewed