T Congress: పదవుల భర్తీపై అధికార పార్టీలో అనిశ్చితి.. నిరాశ, నిస్పృహలో కేడర్

by Shiva |
T Congress: పదవుల భర్తీపై అధికార పార్టీలో అనిశ్చితి.. నిరాశ, నిస్పృహలో కేడర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదవుల పంపకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుండటంతో అధికార పార్టీ నేతల్లో నిస్తేజం, నైరాశ్యం నెలకొంది. అందరూ పదవులను భర్తీ చేయాలని అడుగుతున్నా.. మరి ఎక్కడ, ఎందుకు ఆగుతుంది? అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పవర్‌లోకి వచ్చి 15 నెలలు కావస్తున్నా నామినేటెడ్​ పోస్టులను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడంపై నిరాశ, నిస్పృహాలతో ఉన్నారు. ఒక వైపు మంత్రివర్గ విస్తరణ వాయిదా పడటం, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా, మరో వైపు పీసీసీ కార్యవర్గం వాయిదా, నామినేటెడ్​ పోస్టుల భర్తీ వాయిదా.. ఇలా అన్నింటినీ వాయిదా వేసుకుంటూ పోవడం ద్వారా కాంగ్రెస్​ పార్టీ కేడర్‌లో నిస్తేజం, నిరుత్సాహం నెలకొన్నాయి.

పదవుల భర్తీ వాయిదాపై కేడర్ నిట్టూర్పు

పార్టీ పవర్‌లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 40కి పైగా కార్పొరేషన్​లు, కమిషన్​లను భర్తీ చేశారు. ఆ తర్వాత రేపు మాపు అంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ఫెడరేషన్​లను సర్కారు కొత్తగా ఏర్పాటు చేసింది. ఇలా అనేక పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ వీటి గురించి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అనే రీతిలో భర్తీ ప్రాసెస్ సాగుతోందని పార్టీ లీడర్లు చెప్పుకుంటున్నారు. పార్టీ పవర్‌లోకి వచ్చాక ​రకరకాల పదవులు ఉంటాయని, వాటిలో తమకు పదవులు వస్తాయని పార్టీ కేడర్ ​ఆశ పడింది. నేతలు ఒక్కొక్కరు తమ స్థాయి, తమ సేవలకు అనుగుణంగా ప్రభుత్వ పదవులపై ఆశ పడ్డారు. కానీ, అవేవి ఇప్పట్లో వచ్చేలా కనపడకపోవడంతో నిట్టూరుస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పడటంతో ఇక కాదులే అనే స్థాయికి వచ్చారు.

‘స్థానిక’ ఎన్నికలకు ఎదురుచూపులు

బీసీ రిజర్వేషన్​లతో స్థానిక సంస్థల ఎన్నికలూ వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్​ వచ్చింది అనే స్థాయిలో గత నెలలో హైప్ ​క్రియేట్​‌ కావడంతో పార్టీ నాయకులందరూ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. రిజర్వేషన్ ​ఏమైతుందో అంటూ ఎదురుచూశారు. తాము ఏ పదవికి పోటీ చేస్తామో స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఎలక్షన్స్‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. చివరికి ఎన్నికలు వాయిదా పడటంతో నిట్టూర్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీ కేడర్‌కు అత్యధిక పదవులు దక్కే అవకాశం ఉండగా, ఆ ఎలక్షన్స్ కోసం వారందరూ వేచి చూస్తున్నారు.

ఇంప్లిమెంట్ కాని పీఏసీ డెసిషన్

జనవరి మొదటి వారంలో జరిగిన పొలిటికల్ ​ఎఫైర్స్ కమిటీ సమావేశంలో జనవరి నెలాఖరు కల్లా నామినేటెడ్​ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌​రెడ్డి, పీసీసీ చీఫ్‌ ఉన్నారు. వీరి సమక్షంలోనే డెసిషన్ తీసుకుని 3 నెలలైనా ఇంత వరకు ఆచరణలో ఇంప్లిమెంట్ కాకపోవడంపై పార్టీ కేడర్‌లో ​ఆందోళన వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి ఎవరు అడ్డంకి.. భర్తీ ఎందుకు ఆగుతుంది? అంటూ కేడర్‌​లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీసీసీ కార్యవర్గం విషయంలోనూ ఇదే జరుగుతోందని, వర్కింగ్​ ప్రెసిడెంట్, ఉపాధ్యక్ష పదవుల కోసం ముఖ్య నేతలు వేచి చూస్తున్నారు. మంత్రివర్గంతో పాటుగా చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్​ పదవి కోసం, డీసీసీ అధ్యక్షుల మార్పు ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది.. ఇలా వీటన్నింటి కోసం పార్టీ నేతలు ఎందరో ఎదురుచూస్తున్నారు. నామినేటెడ్​ పదవులను ఖాళీగా ఉంచడం కంటే వాటిని భర్తీ చేయడం ద్వారా కొందరికి అవకాశం ఇచ్చిన వారవుతారని, వారి టర్మ్​ పూర్తి అయితే మరో టర్మ్‌​లో మరొకరికి చాన్స్​ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరికొందరు లీడర్లు అయితే వారికి పదవులు వచ్చాయి ఇక మన గురించి ఎందుకంత సీరియస్‌​గా తీసుకుంటారంటూ ఆవేశంతో విమర్శలు చేస్తున్నారు. నాయకులందరూ ఒకే మాట మీద ఉండి పదవులను భర్తీ చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed