- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్సిటీల్లో సమస్యలు తేలేదెప్పుడు!?
సమాజంలోని రుగ్మతలను అర్థం చేసుకొని, అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా పరిశోధనలు చేసి పరిష్కార మార్గాలను సమాజానికి అందించాల్సిన విశ్వవిద్యాలయాలు ఈరోజు సమస్యల నిలయాలుగా, ఒకరినొకరు ముష్టి యుద్ధం చేసుకునే అధికారిక కేంద్రాలుగా, అక్రమ నియామకాల అడ్డాగా, కోట్ల ప్రజాధనం కొల్లగొట్టే నిలయాలుగా, అవినీతిని అందలం ఎక్కించే అక్రమ అధికారుల ఆవాసంగా, రాజకీయ ఒత్తిళ్లకు తలోగ్గే బానిస కేంద్రాలుగా మారిపోయాయి.
వీసీల అక్రమ నియామకంతోనే..
గత కొన్ని రోజులుగా తెలంగాణ వర్సిటీలో నెలకొన్న పరిస్థితులు, వీసీ-పాలక మండలి సభ్యులకు మధ్య జరుగుతున్న యుద్ధంతో వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు, పాఠాలు చెబుతున్న టీచర్లు, ఇతర ఉద్యోగులు పలు విధాలుగా ఆందోళనలు చెందుతున్నారు. ఈ వర్సిటీలో ఉద్యోగుల వేతనాలు చెల్లించడానికి కూడా నువ్వా నేనా తరహాలో వివాదం జరిగి ఉద్యోగులకు జీతాలు చెల్లించని పరిస్థితి ఉంది. ఈ వర్సిటీలో వీసీ ఒక రిజిస్ట్రార్‌ను, ఈసీ ఒక రిజిస్ట్రార్‌ను నియమించడంతో, అసలు రిజిస్ట్రార్ ఎవరో అర్ధం కాని పరిస్థితి. మరోవైపు వీసీ లేకుండా ఈసీ సమావేశం నిర్వహించడంతో, ఈసీ సమావేశ నిర్ణయాలు చెల్లవని పత్రికా సమావేశంలో వీసీ ప్రకటిస్తున్నారు. అయితే ఈసీ సమావేశాల నిర్ణయాల అమలుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, యధావిధిగా వీసీ లేకుండా తనే చైర్మన్‌గా వ్యవహరిస్తూ ఒక ఈసీ మెంబర్ సమావేశం నిర్వహించడంతో ఈసీ, వీసీల మధ్య యుద్ధం మరింత రాజుకుంది.
కాకతీయ యూనివర్సిటీలో సైతం వీసీ పాలనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేయూ వీసీగా ప్రొ. రమేష్ నియామకం అక్రమంగా జరిగిందని, యూజీసీ నిబంధనలు ప్రభుత్వం ఉల్లఘించి ఆయనను వీసీగా నియమించిందని ఇద్దరు ప్రొఫెసర్లు కోర్టులో కేసు వేయగా, కేసు తేలకపోవడంతో వర్సిటీలో ఆయన దూకుడు ఎక్కువై, వర్సిటీలోని తోటి ప్రొఫెసర్ల పట్ల ఉన్న భేదాభిప్రాయాలతో వీసీగా అధికారం పొందగానే కక్షపూరితంగా ఒకరికి పదోన్నతి రాకుండా, మరొకరికి ప్రొఫెసర్ నుండి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి తగ్గిస్తూ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నాడు. పైగా భౌతికంగా ఎక్కడా లేని సెంటర్ల పేరు మీద సెమినార్లు నిర్వహిస్తూ లక్షల డబ్బును దుర్వినియోగ పరుస్తూ, తాను చేసిందే న్యాయం అన్న రీతిగా వ్యవహరిస్తున్నారు. పైగా వీసీగా వ్యవహరించడానికి అర్హత లేదని ఒకవైపు ఆరోపణలు వస్తున్నా, కేసు కోర్టులో వున్నా తాననుకున్నది యధావిధిగా రాజకీయ అండదండలతో పాలనను కొనసాగిస్తున్నారు. దీనిని ప్రశ్నించే విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టుకుంటూ, బదిలీలు చేస్తూ, షోకాజ్ నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గతంలో అక్రమ ఫీజుల చలానాల కుంభకోణంలో ఉద్యోగం కోల్పోయిన వారిని ఏకంగా పరీక్షల విభాగంలో అక్రమంగా ఉద్యోగం కల్పించడం, ప్రభుత్వ అనుమతి లేకుండా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా 12 మంది అనుబంధ అధ్యాపకుల నియామకంపై ఎంత రచ్చచేసినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
గవర్నర్.. సమస్యకు పరిష్కారం
అయితే రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఇలాంటివి జరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారు నియమించిన వీసీలపై ఉన్న అవినీతి ఆరోపణలపై, అక్రమ నియామకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమయినా ఒకవైపు వర్సిటీల వీసీల నియామకంపై కేసులు, మరొకవైపు వీసీల పాలనపై పలు ఆరోపణలు, వీసీ - ఈసీల మధ్య మాటల యుద్ధం వీటన్నింటిపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా సమస్యలను గాలికి వదిలేసి వర్సిటీలను అధోగతి పాలు చేస్తుందా చూడాలి. నిజానికి వర్సిటీలకు ఛాన్సలర్‌గా వ్యవహరించే హోదా గవర్నర్‌కు ఇచ్చినప్పటికీ, గవర్నర్ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనపై ఎటువంటి విచారణ, పునసమీక్ష లేకుండా యధావిధిగా ఆ ప్రతిపాదనను ఆమోదించి వీసీల అసమర్థ పాలనకు, వర్సిటీల్లో అనేక సమస్యలకు తెరలేపినట్లయిందనే విమర్శలు వస్తున్నాయి. విశ్వవిద్యాలయాలలో జరిగే నియామకంలో పునసమీక్ష చేసే అధికారం గవర్నర్ వినియోగించుకుంటే తప్ప వర్సిటీల్లోని సమస్యలకు పరిష్కారం దొరకదని మేధావులు భావిస్తున్నారు. ఎలాగో ప్రభుత్వం వర్సిటీలను చిన్న చూపు చూస్తోందని, వర్సిటీలను నిర్వీర్యం చేసే ఆలోచనలతో ప్రైవేటు వర్సిటీలు ఆజ్యం పోస్తూ, సమస్యలను గాలికి వదిలేసిన ఈ తరుణంలో ఛాన్సలర్ మాత్రమే వర్సిటీల సమస్యలకు చెక్ పెట్టగలరని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు నమ్ముతున్నారు.
డా.మామిడాల ఇస్తారి
జనరల్ సెక్రెటరీ, కేయూ టీచర్స్ అసోసియేషన్
9848309231