- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోడు సమస్య తీరేదెపుడు?
ఈ చట్ట ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008-09 సంవత్సరాల కాలంలో సాగుదారుల నుంచి దాదాపుగా రెండు లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 90 వేల వరకు హక్కు పత్రాలు ఇచ్చారు. హక్కు పత్రాలు అందినవారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నాలుగు ఎకరాలు క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం ఎకరం లేదా రెండెకరాలకు హక్కు పత్రాలు ఇచ్చింది. ఇంకా కొంతమంది దరఖాస్తులను కనీసం సర్వే చేయకుండా రిజెక్ట్ చేశారు. ఆదివాసీలకు కనీసం తమ హక్కు పత్రాలు ఎవరి దగ్గర తిరస్కరణకు గురయ్యయో కూడా స్పష్టత లేదు. హక్కు పత్రాలు అందిన చాలామంది రైతులకు రైతుబంధు, పంట నష్టం, పీఎం కిసాన్ యోజన వంటివి అందడం లేదు. పైగా కవ్వాల్ టైగర్ జోన్, సింగరేణి ప్రాంతంలో అటవీ హక్కుపత్రాలు ఉన్న భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా సేకరించారు.
'ప్రజలకు భూమే జీవితం, భూమి అనేదే గుర్తింపు, భూమే సంస్కృతి, భూమే ధైర్యం' అంటారు భూచట్ట న్యాయ నిపుణులు భూమి సునీల్‌కుమార్. అలాంటి భూమి హక్కు కోసం నాటి నుంచి నేటి వరకు ఆదివాసీ ప్రజలు నిరంతరం ప్రభుత్వంతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క కుటుంబానికి సెంటు పోడు హక్కు భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. నేటికీ పంట వేసుకునే సమయానికి అటవీ అధికారులకు, పోడు సాగుదారులకు తగాదాలు జరుగుతూనే ఉంటాయి. సమస్య పరిష్కారానికి మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.
'పోడు సమస్య తీర్చుతామని' అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. పైగా అటవీ ప్రాంతంలో హరితహారం, వన సంరక్షణ పేరుతో ట్రెంచులు కొడుతూ, పంట చేలను మానవత్వం లేకుండా చెరుపుతూ, వారి నోటికాడి బుక్క గుంజుకుంటూ అవస్థలు పెడుతున్నారు.
కొంతమందికే హక్కులు
అటవీ భూములు ఆదివాసీలకు ప్రధాన జీవనాధారం. వీరినీ, అడవినీ వేరు చేసి చూడలేము. అడవిలో దొరికే పండ్లు ఫలాలు, బంక, చీపుర్లు, వెదురు, వంట చెరుకు, దుంపలు ఆకులు వీరి జీవితంతో మమేకమై ఉంటాయి. ఆదివాసీలు తరతరాలుగా అంటే కనీసం ప్రభుత్వాలు కూడా ఏర్పడకముందు నుంచే పోడు వ్యవసాయం చేసుకుంటూ, అడవిని నమ్ముకుని దానిని పరిరక్షించుకుంటూ వస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ ఎన్నో లక్షల కుటుంబాలకు పోడు భూములకు హక్కు గుర్తించబడలేదు. గతంలో కొమురం భీమ్, బిర్సా ముండా, రాంజీ గోండు లాంటి ఆదివాసీ వీరులు సాగించిన పోరాటాలన్నీ భూమి కోసం భుక్తి కోసం జరిగినవే. వారి పోరాటాల స్ఫూర్తితోనే అటవీ ప్రాంతంలో భూమి కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు జరిగాయి.
ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2006లో 'అటవీ హక్కు చట్టం' రూపొందించి 2007 నుండి అమలులోకి తీసుకు వచ్చింది. ఈ చట్టం అడవి ఉన్న అన్ని ప్రాంతాలలో అమలవుతుంది. ఈ చట్టం ప్రకారం గిరిజనులు 13 డిసెంబర్ 2005కు ముందు సాగు చేసుకుంటున్న భూములకు సెక్షన్-4(6) ప్రకారం హక్కు పత్రం ఇవ్వాలి. గరిష్టంగా పది ఎకరాల లోపు ఇవ్వాలి. గిరిజనేతరులకు ఈ తేదీకి ముందు మూడు తరాలుగా అంటే కనీసం 75 సంవత్సరాలు ఆ కుటుంబం వ్యవసాయం చేసుకుంటుంటే హక్కు పత్రం ఇవ్వవచ్చు. దీనిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.
ఈ చట్ట ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008-09 సంవత్సరాల కాలంలో సాగుదారుల నుంచి దాదాపుగా రెండు లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. అందులో 90 వేల వరకు హక్కు పత్రాలు ఇచ్చారు. హక్కు పత్రాలు అందినవారికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. నాలుగు ఎకరాలు క్లెయిమ్ చేస్తే ప్రభుత్వం ఎకరం లేదా రెండెకరాలకు హక్కు పత్రాలు ఇచ్చింది. ఇంకా కొంతమంది దరఖాస్తులను కనీసం సర్వే చేయకుండా రిజెక్ట్ చేశారు. ఆదివాసీలకు కనీసం తమ హక్కు పత్రాలు ఎవరి దగ్గర తిరస్కరణకు గురయ్యయో కూడా స్పష్టత లేదు. హక్కు పత్రాలు అందిన చాలామంది రైతులకు రైతుబంధు, పంట నష్టం, పీఎం కిసాన్ యోజన వంటివి అందడం లేదు. పైగా కవ్వాల్ టైగర్ జోన్, సింగరేణి ప్రాంతంలో అటవీ హక్కుపత్రాలు ఉన్న భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా సేకరించారు.
నేటికీ పరిష్కారం చూపలేదు
ఆదివాసీలు అసలే భూ హక్కు లేకుండా జీవితాలు గడుపుతుంటే 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా' అటవీ చట్టానికి వ్యతిరేకంగా 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' 2008 సుప్రీంకోర్టులో కేసు వేసింది. చట్టం కారణంగా అడవి, అందులోని జంతువులకు ముప్పు వాటిల్లుతుందని వాదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా, ఎంత మందికి హక్కుపత్రాలు ఇచ్చారు? ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయో? తెలపాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సగం కంటే ఎక్కువే ధరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని అన్ని రాష్ట్రాలు జవాబిచ్చాయి. దీంతో హక్కు పత్రాలు లేనివారిని అటవీ భూముల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ తీర్పు మీద దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి దరఖాస్తుకు అవకాశం కావాలని కోరింది. హక్కుపత్రాలు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో తేలేవరకు ఆదేశాలను నిలిపివేయాలని విన్నవించింది. దీంతో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం పోడు సాగు దారుల నుంచి 8 నవంబరు, 2021 నుంచి నెలరోజులపాటు దరఖాస్తులు స్వీకరించింది. ఆరు నెలలు సమయం దాటినా సమస్యకు పరిష్కారం చూపించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి అర్హత ఉన్నవారందరికీ హక్కు పత్రాలు అందించాలి. అటవీ, రెవెన్యూ వివాదాలకు పరిష్కారం చూపాలి.
వాసం ఆనంద్‌కుమార్
అడ్వకేట్, 94948 41254