అన్నదాత దశ మారేదెన్నడు?

by Ravi |   ( Updated:2022-09-03 17:10:49.0  )
అన్నదాత దశ మారేదెన్నడు?
X

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సాధ్యమైంది. కానీ, కాలక్రమేణా ఆ సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే పోయింది. రాజకీయ, పాలనా వ్యవహారాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. త్యాగాల చిట్టా విప్పుకుంటూ, సన్మానాలు చేయించుకుంటూ, పెద్ద పెద్ద హోదాలకు ఎదిగిన కుహానా రాజకీయ నాయకులెందరినో చూస్తూనే ఉన్నాము. అట్టి రాజకీయ నాయకులు ప్రచారంలో ఉన్నారు కనుకనే అసలు త్యాగధనుల పేర్లు ఆ వరుసలో అగుపించవు.

స్వాతంత్రాన్ని సాధించిన వారు లక్ష్యాన్ని సాధించి, భావితరాల పౌరులకు మార్గదర్శులు నిలిచారు. స్వాతంత్ర్యానంతరం సమసమాజ నిర్మాణానికి అంకురార్పణ జరగాల్సింది. పవిత్రమైన ఆ బాధ్యతను విస్మరించి పదవుల పందేరంలో పోటీకి నిలబడ్డారు నేటి మన నేతలు. పార్టీలు సూచించిన ధరలను చెల్లించి పదవులను, హోదాలను సొంతం చేసుకుంటూపోతున్నారు. పెట్టిన ఖర్చుకు పదింతలు కూడబెట్టాలను తాపత్రయంతో అక్రమ సంపాదనకెగబడుతుండడం నిత్యకృత్యంగా పరిణమించింది. రాజకీయాలలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం వెర్రితలలు వేస్తూ కొత్త కొత్త దారులను అన్వేషిస్తూ స్కాముల దశకు చేరుకుంది. పవిత్ర రాజకీయ,పాలనా విధానాలను నీరుగారుస్తూ ప్రజానీకాన్ని తీవ్ర అన్యాయాలకు గురి చేస్తున్నారు.

అన్యదా మార్గం లేకనే

వ్యవసాయం మీదనే అధిక శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్న దేశం మనది. నిరక్షరాస్యులు అధికంగానే ఉన్నారీ దేశంలో. నిరక్షరాస్యతను నిర్మూలించి, పౌరులు విద్యావేత్తలుగా ఎదుగుటకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలి. ఉత్పత్తులు, కార్యకలాపాలకు అనువైన వాతావరణాన్ని కల్పించవలసిన గురుతర బాధ్యత పాలకులపై ఉంది. ఆ విషయాన్ని వారు విస్మరించి, రాజ్యాంగ సూత్రాలను విస్మయపరచారు. తత్కారణంగా పసికూనలను బడికి పంపకుండా, బాల్యదశలోనే పొలం పనులకు పంపవలసిన దుస్థితి నేటి మన గ్రామీణ కుటుంబాలను ఆవరించియున్నది. రైతులకు క్షణం తీరిక ఉండదు. పైసా ఆదాయంగా మిగలదు. అన్యదా మార్గం లేనందున ఆ పొలం పనులను వారు వదలలేరు. పంటలు పండించకుండా ఉండలేరు. దిగుబడి రాదు. వచ్చినా లాభసాటి ధరలు లేవు. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు, కాలం చెల్లిన రైతు సహకార పరపతి సంఘాలు, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలతో సమమతమైపోతున్న రైతన్నలకు ఆత్మహత్య తప్ప అన్యదా మార్గం లేకుండాపోయింది.

అవగాహన కొరవడి

పార్లమెంటు, శాసనసభల పంపిణీ విధానమేమిటి? చట్టాల అమలు విధానమేమిటి? వ్యవస్థీకృత రంగం నిర్వహిస్తున్న బాధ్యతలు ఏమిటి? పర్యావరణ పరిరక్షణ అవసరానవసరాలేమిటి? మార్కెట్ ధోరణులు ఎలా, ఎందుకు మారుతుంటాయి? వినియోగదారుడు కోరుకునేదేమిటి? నాణ్యత అవసరాలేమిటి? కాలుష్యం లేదా కల్తీ వలన కలిగే దుష్ఫరిణామాలేమిటి? పత్రికలలో, పార్లమెంటులో, శాసనసభలో, టీవీ మాధ్యమాలలో జరిగే చర్చలేమిటి? వాటి వలన తనకేమిటి? అను విషయాల మీద అవగాహన కొరవడినందున, పంట నష్టం మూలంగా ఇరుకున్న అప్పుల ఊబిలోంచి అన్నదాతలు బయటకు రాలేక పోతున్నారు. రైతును నాయకులు ఏమి అడిగినా, తన వ్యవసాయ సమస్యల వరకే పరిమితమవుతాడే కానీ, ఇతర సమస్యల జోలికి వెళ్లడు. కల్తీ రహిత విత్తనం, విద్యుత్తు సరఫరా, పంటకు గిట్టుబాటు ధర వరకే తన కష్టాల చిట్టాను విప్పుతాడు.

ఎదురొచ్చిన ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ తన అదృష్ట దురదృష్టాల మధ్య సతమతమైపోతూ తీవ్ర అంతర్మథనాలకు లోనవుతాడు. చివరకు తన బాధల గురించి ఎవరిముందూ ప్రస్తావించకుండా ఉండడానికే అలవాటు పడిపోయాడు. దానికి పర్యవసానంగానే నేడు మనం చూస్తున్న రైతుల ఆత్మహత్యల పరంపర. అట్టి పరంపరలో శవాలుగా మారినవారు కొందరైతే, జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్న వారెందరో! వ్యవసాయపరంగా శాస్త్రీయ పరిశోధనల అభివృద్ధికి నోచుకొని నాటి రోజుల నుంచి అభివృద్ధిపరంగా వడివడిగా సాగుతున్న నేటి కాలంలోనూ రైతు తన కష్టాల నుండి విముక్తి పొందలేకున్నాడు. తన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవేయుటకు ఆలోచించలేకున్నాడు. చివరకు, పిల్లలకు పెండ్లి సంబంధాలు వెతుకుటలోనూ వివక్షకు గురవుతున్నాడు.

వారికి నాయకుడు కావాలి

వేలాది సంవత్సరాలుగా సమాజాన్ని ఆవరించి కొనసాగుతున్న కులాల స్థానంలో నేడు వర్గాలు ఆవిర్భవించాయి. విశేష వర్గాలుగా చెలామణీ అవుతున్నవారు సుఖ జీవనాన్ని గడుపుతున్నారు. వారు తమ వేతనాలు, సదుపాయాలు, ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకొనుటకు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగానే ఉంటారు. కులమతాలకతీతమైనది రైతు వర్గం. ఆ వర్గానికి సేవ చేయుటకు అంకితభావం గల ఒక రైతు నాయకుని అవసరం ఉంది. పేరు ప్రతిష్టల కోసం పాకులాడే వారు రైతులకు న్యాయం చేకూర్చలేరు. ఆ నాయకుడు రైతుల బాధలను అర్థం చేసుకొని, పరిష్కార దిశగా అన్వేషణ, జిజ్ఞాస కలిగి ఉండాలి. అందరినీ ఒక వేదిక మీదకు చేర్చి బలమైన వర్గంగా రూపొందించి, ప్రభుత్వానికి, ఇతర సామాజిక వర్గాలకు ప్రభావపూరిత పరిచయాన్ని ఇవ్వగలగాలి. ఆర్థిక, వ్యావహారిక అసహాయతల నుంచి బయట పడవేయగల పథకాలను రచించి, ప్రభుత్వానికి విషదపరచి సమస్యల సాధన దిశగా నడవాలి. రైతాంగాన్ని నడిపించాలి.

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Advertisement

Next Story