ఇంటర్ తర్వాత ఎటు? ఏ కోర్సులకు డిమాండ్ ఉంటుంది?

by Ravi |   ( Updated:2024-05-29 01:16:09.0  )
ఇంటర్ తర్వాత ఎటు? ఏ కోర్సులకు డిమాండ్ ఉంటుంది?
X

విద్యార్థులకు ఇంటర్ పూర్తయ్యాక దారి ఎటు అంటే సవాలక్ష గమ్యాలు, సవాలక్ష సందేహాలతో సతమతమవుతారు. విద్యార్థులకు వారి లక్ష్యాలు, గమ్యాలు అస్పష్టంగా ఏర్పడి ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. తల్లితండ్రులు ఎటూ తేల్చుకోలేక ఎదురొచ్చిన వారినల్లా అడగడమో లేదా పక్కింటి కుర్రాడు, లేదా బంధువుల అబ్బాయి లేదా అమ్మాయి పలానా కోర్సు తీసుకున్నారని వాటిపై చర్చ చేయడం సర్వసాధారణం. అయితే ఇంటర్ తర్వాత ఏయే కోర్సులు ఉన్నాయి.. ఏ కోర్సులు చేయడం వల్ల ఎంత లాభం ఉంటుంది. ఏ కోర్సు వల్ల ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఏయే కోర్సులకు మార్కెట్లో డిమాండ్ ఉంది తదితర అంశాలు పరిశీలిద్దాం.

నాలుగేళ్ల కోర్సులు..

ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది కంప్యూటర్ సైన్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరిత ఉపాధి, ఐదంకెల జీతం గ్యారెంటీ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అన్న ధోరణితో ఎంచుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రతిభ గల విద్యార్థులకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కృత్రిమ మేధ (Artificial Intelligence), యంత్ర అభ్యసనం (Machine Learning) వంటి కోర్సులకు ప్రస్తుతం డిమాండ్ ఉండటంతో కంప్యూటర్ సైన్స్ ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. అలాగని కోర్ సబ్జెక్టులైన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ మొదలైన కోర్సులు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. బైపీసీ విద్యార్థులు కూడా ఇంటర్ బోర్డు నిర్వహించే బ్రిడ్జి కోర్సు పూర్తి చేసి ఇంజనీరింగ్‌లో జాయిన్ కావచ్చు.

బీ.ఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, ఫిషరీస్ కోర్సులు.. TS EAPCET పరీక్ష ద్వారా ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తారు. ఇవి ప్రొఫెషనల్ కోర్సులు అని చెప్పవచ్చు. వ్యవధి నాలుగేళ్లు. మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. తక్కువ సీట్లు ఉంటాయి అందువల్ల ఎక్కువ అవకాశాలు వస్తాయి.

ఫార్మా కోర్సులు..

డి. ఫార్మసీ, బీ. ఫార్మసీ, ఫార్మ్ - డి కోర్సులు.. ఇవి తెలంగాణ TSEAPCET ఎంట్రెన్స్ పరీక్ష ర్యాంకుల ఆధారంగా ఇందులో అడ్మిషన్ కల్పిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ, నాలుగేళ్ల బీ ఫార్మసీ, ఆరేళ్ల ఫార్మ్ డి కోర్సులకు ఇటు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎటొచ్చీ పై కోర్సులకు ఇంటర్ అర్హత కాబట్టి డిప్లొమా కన్న డిగ్రీ చేయడం ఉత్తమం. డిప్లొమా విద్యార్థులు మెడికల్ షాప్‌లు నిర్వహించుకోవచ్చు లేదా ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడవచ్చు. డిగ్రీ విద్యార్థులు రీసెర్చ్ వైపు, ఉన్నత విద్య వైపు అడుగులు వేయవచ్చు. ఫార్మ్ -డి విద్యార్థులకు మన దేశంలో వారి చదువుకు తగ్గ ఉపాధి అవకాశాలు లేవనే చెప్పాలి. క్లినికల్ అసిస్టెంట్, లేదా రీసెర్చ్ అసిస్టెంట్‌గా ఉపాధి అవకాశాలు విదేశాల్లో ఉన్నాయి.

నర్సింగ్ కోర్సులు..

ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు అర్హులు. TS EAPCET అర్హత పరీక్ష రాసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి వైద్య ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మంచి వేతనం కూడా లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం TOMCOM సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి కల్పించడానికి సహకరిస్తుంది. సేవా తత్పరత కలిగి వైద్య రంగంలో ఉపాధి పొందాలనుకునే వారు నిస్సంకోచంగా చేరవచ్చు.

బైపీసీ విద్యార్థుల కోసం..

ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీహెచ్ఎంఎస్/ బీయూఎంఎస్/బీఎస్ఎంఎస్ వైద్య కోర్సులు లాంటి కోర్సులకు బైపీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. వైద్య వృత్తి కోరుకునేవారు నీట్‌లో మంచి ర్యాంక్ సాధించి ఈ కోర్సుల్లో చేరవచ్చు. అయితే ఎంబీబీఎస్‌లో ప్రవేశం అంత తేలికం కాదు. దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టుదల ఉంటే సాధించవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కష్టపడితే సీటు సాధించవచ్చు. బైపీసీ చదివిన ప్రతి విద్యార్థికీ మెడిసిన్ సీటు రాదు. అంత మాత్రాన కుంగిపోరాదు. మరో ప్రయత్నం చేయడం అవశ్యం. లేదంటే వైద్య ఆరోగ్య అనుబంధ వృత్తి విద్య కోర్సుకు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చినాయి. ఇందులో ఫిజియోథెరపీ ఒక ఉత్తమమైన కోర్సు. నాలుగున్నర వ్యవధి గల ఈ కోర్సు చేసిన వారి పేరుకు ముందుగా డాక్టర్ అని చేరిపోతుంది. నీట్ ర్యాంక్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు ఈ కోర్సులు నిర్వహిస్తున్నాయి. స్వయం ఉపాధిగా స్వంత క్లినిక్ ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఈ విభాగంలో ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు మెండు.

వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కోర్సులు..

గతంలో ఆయా వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కోర్సులలో కేవలం సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్సులు ఉండేవి. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందడం వైద్య రంగంలో కంప్యూటర్ల వినియోగం పెరగడం కొత్త కొత్త వైద్య యంత్ర పరికరాలు అభివృద్ధి చెందడం, కృత్రిమ మేధస్సు ప్రభావంతో సాంకేతిక నిపుణుల ప్రాముఖ్యత బాగా పెరిగింది. వైద్య రంగంలో ఉండే ప్రతీ సూపర్ స్పెషాలిటీకి సాంకేతిక నిపుణుల అవసరం ఏర్పడింది. ప్రతి విభాగంలో నిపుణుల కొరత ఉంది. ప్రస్తుత డిమాండ్ తట్టుకోవడానికి తగ్గట్టుగా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో, నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో నాలుగేళ్లు అంటే మూడేళ్లు రెగ్యులర్ విద్య, ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్‌తో ఈ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. ఇంటర్ బైపీసీ విద్యార్థులు TS EAPCET రాంక్ ద్వారా లేదా ఇంటర్ మెరిట్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చు.

బీఎస్సీ అనస్తిషియా టెక్నాలజీ, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ, కార్డియో పల్మనరీ పర్ఫుజన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మరియు ట్రామా కేర్ టెక్నాలజీ, మెడికల్ లాబరేటరీ టెక్నాలజీ, న్యూరో సైన్స్ టెక్నాలజీ, ఆప్తమాలజీ, ఆడియాలజీ, స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియోగ్రఫీ, ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ మొదలైనవి కొన్ని ముఖ్యమైన కోర్సులు. ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ సదుపాయాన్ని పొందవచ్చు.

ఈ నాలుగేళ్ల వృత్తి విద్యా డిగ్రీ పూర్తి చేసిన వారు ఆయా కార్పొరేట్ లేదా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాంకేతిక నిపుణులుగా సేవలు అందించవచ్చు. స్వయంగా లేబరేటరీ లేదా డయాగ్నొస్టిక్ కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. వీరు ఇతర సాధారణ డిగ్రీ విద్యార్థుల్లా వివిధ పోటీ పరీక్షలకు కూడా అర్హులు. అయితే, ఈ విద్యార్థులు ఆయా కోర్సులు ఎన్నుకునేటప్పుడు ఆ విద్యాసంస్థ కు అనుబంధ ఆసుపత్రి ఉందా లేదా అని చూసుకోవాలి. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్నది. విద్యార్థులు ప్లస్ 2 తర్వాత డిప్లొమా కోర్సుల్లో చేరే బదులు డిగ్రీ కోర్సులు చేయడం ద్వారా ఉభయతారకంగా ఉంటుంది. సత్వర ఉపాధి కావాలి అనుకుంటే వృత్తి విద్యా కోర్సులు ఉత్తమం. చదివించే స్తోమత, చదవాలనే ఆసక్తి ఉన్నవారు రెగ్యులర్ కోర్సులు చేయవచ్చు.

రెగ్యులర్ డిగ్రీ కోర్సులు

నిజంగా సివిల్స్, గ్రూప్స్ కొట్టాలి లేదా ఉన్నత విద్య అభ్యసించాలనుకంటే.. రెగ్యులర్ బీఏ, బీకాం, బీఎస్సీ వివిధ గ్రూపులు చేయవచ్చు. లేదా బ్యాంకింగ్, వ్యాపార రంగాల్లో రాణించాలి అనుకుంటే బీబీఏ, బీసీఏ, బీబీఎం మొదలైన కోర్సులు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం దోస్త్ ద్వారా వివిధ యూనివర్సిటీ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు పొందవచ్చు. అర్హులకు ఫీజు రాయితీ లేదా రీయింబర్స్‌మెంట్ ఉంటుంది.

శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

94416 73339

Advertisement

Next Story