- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వమా.. నీవెక్కడ...!?
చరిత్ర పుటల్లో అనేక చీకటి అధ్యాయాలు, కన్నీటి గాథలు, అంధకార సంఘటనలు మనం అందరం ఏదో సమయంలో అధ్యయనం చేసిన వారిమే. ముఖ్యంగా మత మారణహోమాలు క్రూసేడులు, జాత్యహంకారంతో హిట్లర్ చేసిన మారణకాండ, దక్షిణ ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో జాతివివక్షత, మనదేశంలో అగ్రకులాల దాడులు, పేదలపై ధనికుల దాడులు, గోద్రా అల్లర్లు, స్వేచ్ఛ కోసం పోరాడితే మరణశిక్షలు, ప్రశ్నిస్తే ప్రాణాలు తీసేయడం, వలస పాలకుల దౌర్జన్యాలు, జలియన్ వాలాబాగ్ ఉదంతం... ఇలా ఒకటేమిటి అనేక చీకటి కోణాలు... అందుకే శ్రీ శ్రీ ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం’ అన్నాడు. దీనికంతటికీ కారణం మానవుని స్వార్థం, ఆధిపత్యమే.
ఎన్నో కుటిల రాజకీయాలు..
ఒక వ్యక్తిపై లేదా సమూహం పైన కొందరి ఆర్థిక, రాజకీయ సామాజిక ఆధిపత్యమే దీనికంతటికి కారణమని సూక్ష్మంగా గ్రహించవచ్చు. సాటి మానవులను తోటివారిగా (అందరూ సమానమే) అనుకోలేనంత కాలం ఈ అమానుష సంఘటనలు జరుగుతూ చీకటి చరిత్రకి పునాదులు వేస్తూనే ఉంటారు. ఇటీవల కాలంలో మయన్మార్‌లో జుంటా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో సమావేశమైన 100 మందిపై ఆకాశ మార్గాన బాంబులు కురిపించి, హతం చేయటం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంఘటన, దక్షిణ సూడాన్‌లో దాడులు, నిత్యం అట్టుడుకుతున్న ఇజ్రాయెల్, పాలస్తీనా గొడవలు, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ పాక్ వంటి ప్రదేశాల్లో తరచూ జరుగుతున్న దాడులు మానవ మారణకాండకు నిలువెత్తు నిదర్శనంగా మారుతూ మన అందరినీ ప్రశ్నిస్తున్న సంఘటనలు. మానవత్వమా నీవెక్కడ...!? అనే ప్రశ్న. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికారం చేపట్టకుండా చేసే కుటిల రాజకీయాల ద్వారా హింస, దాడులు జరుగుతున్న సంఘటనలు చూసి నివ్వెరపోయేలా ఉంది. గత ఎన్నికలలో అమెరికాలో ఓడిపోయిన ట్రంప్, జో బైడన్‌కు అధికారం ఇవ్వకుండా ఎంత కుట్ర చేసారో చూసాం. అలాగే ఇటీవల బ్రెజిల్‌లో కూడా బోల్సెనారో ఓడిపోయి, విజయం సాధించిన లూలాకు అధికారం ఇవ్వకుండా అనేక దాడులు పరోక్షంగా చేయించిన సంఘటనలు మనం చూసాం. ఈ పరిణామాలు కాలగర్భంలో కలిసిపోవాలంటే ముందుగా పాలకుల విధానాలు స్వభావాలు మారాలి. కుల, మత, జాతి, లింగ, ప్రాంతీయభాష వంటి వాటి ఆధారంగా చేసే పాలనకు చరమగీతం పాడాలి. ముఖ్యంగా మనలాంటి దేశంలో రాజకీయాలను మతానికి ముడిపెట్టే ధోరణికి స్వస్తి పలకాలి. లౌకిక విధానాన్ని అమలు చేయాలి. మతమౌడ్యంతోనే దాదాపు ఈ ప్రపంచంలో జరుగుతున్న దాడులు అధికంగా నమోదు అవుతున్నాయి. మనదేశంలో కూడా ఈ తొమ్మిది సంవత్సరాల ప్రస్తుత పాలకుల కాలంలో ఒక్క క్రైస్తవుల మీద జరిగిన దాడులే 5,88,742 పైమాటే. ఇక వివిధ మైనారిటీ వర్గాల వారి మీద, అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల మీద జరిగిన దాడులు కోకొల్లలు.
అందరికీ సమాన హక్కులు అందివ్వాలి..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైనా, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 సంవత్సరాలు అయినా, అందరికీ సమానమైన హక్కులు లభించకపోవడం గమనార్హం. అనేక మంది పాలకులు, పార్టీలు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసినా, పరిపాలనలో మాత్రం కొన్ని ఉన్నత వర్గాల ప్రజలకు అనుకూలంగా పాలన అందించడం జరుగుతోంది. ఇది వాస్తవం. ఇకనైనా పాలకుల విధానాలు స్వభావాలు మారాలి. ముఖ్యంగా యువత నేటి పాలకుల విధానాలుపై విశ్లేషణ చేయాలి. మద్యం, మత్తులకు దూరంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో, చాటింగ్‌లతో కాలక్షేపం చేయడం మానాలి. నేటి యువతే రేపటి భవిత అనే భావన అందరిలో కలగాలి. అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం యువత తాగుతున్న మద్యం చూస్తే హడలెత్తిపోయే పరిస్థితి ఉంది. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు ‘మద్యమే’ అందుకే ప్రభుత్వం దీనిని నియంత్రించడానికి పూనుకోవట్లేదు. అందుకే స్వీయ నియంత్రణ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఈ ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో ముందుకు సాగాలి. మధ్యయుగాల సంకుచిత భావాలకు స్వస్తి పలకాలి. శాంతియుతంగా సామ్యవాద భావాలతో కదలాలి.
అమెరికా వంటి దేశాల్లో గన్ కల్చర్ పెరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరగాలి. ముఖ్యంగా అమెరికా తన ఆధిపత్య ధోరణులకు స్వస్తి పలకాలి. ప్రపంచం అంతా నా గుప్పిట్లో ఉండాలనే తపన నుంచి బయటపడాలి. పరోక్షంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న ‘నాటో’ తన ఆలోచనలను సమీక్షించుకోవాలి. ఐక్యరాజ్యసమితి పనితీరు మెరుగు పరుచుకోవాలి. వివిధ దేశాల మధ్య సమస్యలకు చర్చల ద్వారానే పరిష్కారం అందివ్వాలి. శరణార్థులు, వలసలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలి. ప్రతీ దేశం ప్రజాస్వామ్య పాలన పాటించడం ద్వారానే ఈ అమానుష మానవ మారణకాండకు స్వస్తి చెప్పగలరు. ప్రస్తుతం ఉన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రకటన, వివిధ దేశాల రాజ్యాంగాలు ఆయా దేశాల ప్రజలకు ఇచ్చిన హక్కులు, భద్రత ఈ యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళికి అందించిన సమానంగా జీవించే హక్కుకు రక్షణగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ విద్య అందించడానికి ప్రయత్నాలు చేయాలి. అప్పుడు మాత్రమే ప్రతీ ఒక్కరూ కులం మతం ప్రాంతం వర్గం భాష లింగ వంటి సంకుచిత భావాలకు స్వస్తి చెప్పి, సర్వే జనా సుఖినోభవంతు అనే భావనతో ఈ ధరణిపై విరాజిల్లుతారు.
ఐ.ప్రసాదరావు
99482 72919
- Tags
- human rights
- UNO